Home తాజా వార్తలు అడుగంటిన జలసిరులు

అడుగంటిన జలసిరులు

Reservoir operations under climate change: Storage capacity
Reservoir operations under climate change: Storage capacity

ఎండిపోయి కనీస మట్టానికి చేరుకున్న రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లు
ఎగువ మానేరుపై ఆవిరైన ఆశలు
సింగూరులో 8.6, జూరాలలో 3.260 టిఎంసిలే
డెడ్ స్టోరేజీలో సాత్నాలా
నిలకడగా ఉన్న నిజాంసాగర్, శ్రీరాంసాగర్

జిల్లాల నుంచి మన తెలంగాణ ప్రతినిధులు
వేసవి తీవ్రత పెరిగిపోవడంతో రాష్ట్రంలో పలు జలాశయాలు ఎండిపోతున్నాయి. ఒక వైపు ఇన్‌ఫ్లో తగ్గిపోవడం మరోవైపు నీటి వినియోగం పెరిగిపోవడంతో ప్రాజెక్టులు అడుగంటిపోతున్నా యి. పలు పెద్ద ప్రాజెక్టుల్లో సైతం నీటి నిల్వలు కనిష్ఠ మట్టానికి చేరుకున్నాయి. గత 15 రోజులు గా ఎండ తీవ్రతకు ప్రాజెక్టుల్లోని నీరు పదుల క్యూసెక్కులలో ఆవిరైపోతున్నది. ఫలితంగా పలు ప్రాజెక్టులు ఇసుక ఎడారులను తలపిస్తుండగా మరికొన్ని నెర్రెలు విచ్చిన నేలలతో దర్శనమిస్తున్నాయి. వేలాది గ్రామాలను ఆపదలో ఆదుకునే చెరువుల పరిస్థితి సైతం ఇదే విధంగా తయారు కావడంతో గ్రామీణ చిన్న, సన్నకారు రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జలాశయాల పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా సుమారు రెండు నెలలుండే వేసవి కాలంలో మంచినీరు, సాగు నీటి పరిస్థితి ఏమిటని ప్రాజెక్టుల పరిధిలోని ప్రజలు ఆందోళన వక్తం చేస్తున్నారు. రబీ సాగు కారణంగా ప్రాజెక్టులలో నీటిమట్టం గణనీయం గా తగ్గిపోతున్నది.
ఎగువ మానేరుపై ఆవిరైన ఆశలు : కరీంనగర్ ఎగువ, మధ్య, దిగువ మానేరు ప్రాజెక్టుల్లో ఎగువ మానేరు ఈ ఏడాది వ్యవసాయ రంగానికి చుక్క నీరు ఇవ్వలేకపోయింది. 2.2 టిఎంసిల సామ ర్థం కలిగిన ఈ ప్రాజెక్టు కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డి పేట మండలాల పరిధిలోని 13,085 ఎకరాలు సేద్యానికి నోచుకోవాల్సి ఉండగా, ఒక్క ఎకరాకూ ఈ సీజన్‌లో నీరు అందని దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది రబీలో ఈ ప్రాజెక్టు కింద ఆరువేల ఎకరాలకు మాత్రం సాగు నీటిని అందించగలిగారు. ప్రాజెక్టులో 0.16 టిఎంసిల నీటి మట్టం (డెడ్‌స్టోరేజి) ఉండడంతో ప్రస్తుత సంవత్సరం వ్యవసాయ అవసరాలకు నీటి విడుదల సాధ్యపడలేదు. కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలోని లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీటితో, తాగునీటిని అందించే లోయర్ మానేర్ ప్రాజెక్టు కూడా క్రమేపి డెడ్ స్టోరేజి దిశకు చేరుకుంటున్నది. 24 టిఎంసిల సామర్థం కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 3.914 టిఎంసిల నీరు మాత్రమే మిగిలి ఉన్నది. పెద్దపల్లి జిల్లా గుండారం రిజర్వాయర్ పరిధిలోని సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇదే జిల్లాలో గర్రెపల్లి ప్రధాన జలాశయం చెరువు కింద గల 1500ల ఎకరాల ఆయకట్టుకుగాను 700 ల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించడానికి వీలుకలిగింది.
మెతుకుసీమ గొంతెండుతోంది
సింగూరులో 8.6 టిఎంసిలే
మెతుకుసీమ గొంతెండుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివధ నీటి ప్రాజెక్టులు, చెరువులలో నీటి మట్టాలు అవసాన దశకు చేరుకుంటున్నాయి. ఫలితంగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని అనేక పట్టణాలు, గ్రామాలు, తండాలు తాగునీటికి తల్లడిల్లుతున్నాయి. సంగారెడ్డి జిల్లా వాసులకు ఏకైక తాగు,సాగునీటి ప్రాజెక్టయిన సింగూరులో నీటి మట్టం నిత్యం తగ్గిపోతోంది. సింగూరు ప్రాజెక్టు మొత్తం 30 టిఎంసిల నీటి సామర్థం కలదు, కాగా ప్రస్తుతం 8.6 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ వుంది. ఘణ్‌పూర్ ప్రాజెక్టుకు ఇవ్వాల్సి వున్న 4 టిఎంసిల నీరు కూడా రెండు రోజుల్లో పూర్తవుంది. సింగూరులో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతుండటం వల్ల భవిష్యత్ అవసరాలకు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారే అవకాశం వుందని అధికారులు అంటున్నారు.
ఇసుక ఎడారులను తలపిస్తున్న నదులు
వేసవికి ముందే ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నెల రోజులుగా రికార్డు స్థాయిలో భూ గర్బ జల నీటి మట్టం పడిపోతుంది. జీవనది లాంటి గోదావరి ఇసుక ఎడారిని తలపిస్తుంది. మధ్యతరహా ప్రాజెక్టులైనా లంకాసాగర్, మూకమామిడి, పెద్దవాగు, బయ్యారం మొదలైన ప్రాజెక్టులు ఎడారులను తలపిస్తున్నాయి. గోదావరి, కిన్నెరసాని, తాలిపేరు సహా ప్రధానమైన నదులు ఏరులలో నీటి చుక్క కన్పించడం లేదు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరివాహాక ప్రాంతం మినహా మిగిలిన చోట్ల మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో నీటి వనరులు అడుగంటి పోవడంతో మూడు, నాలుగు కిలో మీటర్ల దూరంలో వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టకపోతే నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
జూరాలాలో 3.260 టిఎంసిలే
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటిని అందించే ఏకైక జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం వేసవి కావడంతో ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో నీరులేక అడుగంటిపోయింది. ప్రస్తుతం జూరాల జలాశయంలో 314.410 మీటర్లలో కేవలం 3.260 టిఎంసిల నీళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, ఆత్మకూరు అమరచింత కొత్తకోట వంటి ప్రాంతాలకు తాగునీటిని కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం కేవలం 3.260టీఎంసీల నీరు అందుబాటులో ఉండడంతో రెండునెలల పాటు తాగునీటిని ఎలా ఇవ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎగువ ప్రాంతం కర్ణాటక నుంచి 1లేదా, 2టిఎంసిల నీరు వస్తే తాగునీటిని అందించే ఆస్కారం ఉంటుందని జూరాలా అధికారులు చెబుతున్నారు.
డెడ్ స్టోరేజీలో కొనసాగుతున్న సాథ్‌నాలా:
ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గల ఐదు ప్రాజెక్టులలో సాథ్‌నాల ప్రాజెక్టు ఇప్పటికీ డెడ్ స్టోరేజీలో కొనసాగుతోంది. గత 25 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇతర నాలుగు ప్రాజెక్టులైన కడం, స్వర్ణ, సుద్దవాగు, మత్తడివాగుల ప్రాజెక్టులు సైతం కనిష్ట మట్టానికి చేరువలో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 286 అడుగులు కాగా, 276.5 అడుగుల నీటి మట్టం ఉంది. ఇప్పటికే 1.5 అడుగుల లోతున డెడ్ స్టోరేజీగా కొనసాగుతోంది.
నిలకడగా నీటిమట్టం
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సాగు, త్రాగునీటి కోసం నిర్మాణమైన ప్రధాన జలశయాలు పూర్తిస్థాయి జలాలతో లేకపోయిన గత ఏడాది కంటే కాస్త నీటి నిల్వ ఎక్కువగానే ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 3.096 టిఎంసిల నీటి నిల్వ ఉంది. గత ఏడాది కేవలం 1.90 టిఎంసిల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 17.80 టిఎంసిలు కాగా ఈ ఏడాది పూర్తిస్థాయిలో నింపడం జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి కాల్వల ద్వారా నీటి విడుదలను ఆపివేయడంతో ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంది. గత 8 దశాబ్దాలుగా హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చుతున్న ఉస్మాన్‌సాగర్(గండిపేట్), హిమాయత్‌సాగర్ జంటజలాశయాలలో ముందు జాగ్రత్తగా తాగునీటిని నిల్వ చేస్తున్నారు. నగర తాగునీటి అవసరాలకు ప్రస్తుతం ఎలాంటి లోటు లేకపోవడంతో ఈ జలాశయాల నీటిని పూర్తిస్ధాయిలో వాడటం లేదు. అత్యవసర పరిస్ధితుల్లో సరఫరా చేయడానికి జలాశయాల్లోని నీటిని వాడకుండా జలమండలి అక్కడే స్టోరేజీ చేస్తోంది. అయితే వేసవి ఎండల తీవ్రతకు నీరు చాలవరకు అవిరైపోయి నీటి మట్టాలు తగ్గుతున్నాయని అధికారులు చెబుతున్నారు.