Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

సిర్పూర్‌కు ప్రాణం పోసిన సిఎం

sirpoor-miil

నడపనున్న జెకె పేపర్‌మిల్స్

సిర్పూర్‌మిల్లు పునరుద్ధరణ ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం

మన తెలంగాణ / హైదరాబాద్ : సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని సిర్పూ ర్ పేపర్ మిల్లు (ఎస్‌పిఎం)ను ఒడిస్సాకు చెందిన జెకె పేపర్‌మిల్స్ సంస్థ హస్తగతం చేసుకుంది. రూ. 628 కోట్ల పెట్టుబడితో ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. తాజాగా గురువారం పునరుద్ధరణ ప్రణాళికకు నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలుపడంతో కాగజ్ నగర్ పేపర్ మిల్లు త్వరలోనే మళ్లీ తెరుచుకోనుంది. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పేపర్ పరిశ్రమగా తనదైన ముద్ర వేసుకున్న కాగజ్‌నగర్ పేపర్ మిల్లు వరుస నష్లాలను చవి చూసి 2014 సెప్టెంబర్ 27న మూతపడింది.
ఉమ్మడి రాష్ట్రంలోనే మూత : ఉమ్మడి రాష్ట్రంలోనే సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు మూత పడింది. అంతకు ముందు చాలా కాలం పాటు పోద్దార్ కంపెనీనే మిల్లు కార్యకలాపాలను నిర్వహించింది. ప్రత్యక్షంగా, పరోక్షసంగా 10 వేలకు పైగా కుటుంబాలకు ఈ పేపర్ మిల్లే జీవనాధారంగా ఉండేది. తీవ్ర నష్టాల కారణంగా 2014 సెప్టెంబర్ 27న యాజమాన్యం మిల్లుకు లాకౌట్ ప్రకటించింది. మిల్లు మూత పడడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన కార్మికులు రోడ్డున పడ్డారు. అయితే నిజాం కాలంలో ప్రారంభించిన కంపెనీ ఆధునీకరణకు యాజమాన్యం 2005-06లో ఐడిబిఐ బ్యాంకుతో పాటు పలు ఇతర బ్యాంకుల నుండి సుమారుగా రూ.350 కోట్ల రుణాలను తీసుకుంది. ఈ రోజు నాటికి ఈ అప్పు వడ్డీలతో కలుపుకుని రూ. 480 కోట్లకు చేరింది. పేపర్‌మిల్లు నిర్వహణకు ఇపయోగించే ముడి సరుకుతో పాటు బకాయిల పేరుతో ఇతర సంస్థల వద్ద మరో రూ.200 కోట్ల మేరకు అప్పు పడింది. ఇలా నష్టాల పేరుతో పేపర్‌మిల్లు ఉత్పత్తిని నిలిపి వేయడం, కార్మికులకు పాత బకాయిల కింద రూ. 70 కోట్లు చెల్లించాల్సి రావడంతో ఎస్‌పిఎం ఇక కోలుకోలేని పరిస్థితికి చేరుకుంది. దివాళా దిశగా పయనిస్తున్న కంపెనీ నిర్వహణ, కార్యకలాపాలను గమనించిన బ్యాంకర్లు తమ బాకీల వసూళ్ల కింద ఎస్‌పిఎంను 2016 అక్టోబర్‌లో స్వాధీనం చేసుకుని 2017 ఫిబ్రవరిలో రూ.422 కోట్లకు వేలం వేశాయి. కెసిఆర్, కెటిఆర్ చోరవతోనే మళ్లీ పునరుద్దరణ : తెలంగాణ ఉద్యమ సందర్భంలో పేపర్ మిల్లు కార్మికులు నెలల తరబడి ఉద్యమాలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు చేశారు. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పేపర్ మిల్లును తెరిపించి వేలాది మంది కార్మికులకు జీవనోపాధిని కల్పించితీరుతామంటూ టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీ అప్పట్లో కార్మికులకు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత సిఎం కెసిఆర్ సారధ్యంలో పరిశ్రమల శాఖ మంత్రి కెటి. రామారావు ఎస్‌పిఎం పునరుద్ధరణ కోసం నిరంతరప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఒడిస్సాకు చెందిన జేకే పేపర్‌మిల్స్ తెలంగాణ పట్ల ఆసక్తిని చూపింది. ఏప్రిల్ 14న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో జేకే పేపర్ మిల్స్ నూతన యాజమాన్యానికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకకాలను ఇస్తూ ఆమోదం తెలిపింది. జిఎస్‌టి, స్టాంపు డ్యూటీ, రాయితీలతో సహా మూడేండ్ల పాటు ఒక్కో యూనిట్‌కు రూ. 3 చొప్పున విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే జెకే పేపర్ మిల్స్‌కు తిరిగి చెల్లించనుంది. కార్మికలకు సంబంధించిన బకాయిలు వంటి ఆర్థిక భారాలను కూడా ప్రభుత్వమే భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మిల్లు తెరుచుకుంటే 1200 మందికి ప్రత్యక్షంగాను, మరో 10 వేల మందికి పరోక్షంగానూ ఉద్యోగ, ఉపాధి లభించనున్నాయి.

కెటిఆర్ హర్షం

సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్దరణకు ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలుపడం పట్ల పరిశ్రమల శాఖ మంత్రి కెటి. రామారావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గత మూడున్నరేళ్లుగా ఎస్‌పిఎంను తెరిపించేందుకు అనేక ప్రయత్నాలు చేశామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతాతో పాటు అనేక ఇతర నగరాలకు వెళ్లి ఆయా కంపెనీలు, వివిధ సంస్థల యాజామాన్యాలతో సమావేశం అయ్యామన్నారు. కంపెనీ రీవైవల్ కోసం పారిశ్రామిక సంస్థలతో పాటు కంపెనీకి రుణాలు ఇచ్చిన ఐడిబిఐ బ్యాంకుతోనూ మళ్లీ చర్చలు జరిపామన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు పునరుద్దరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరపాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేసిందని కెటిఆర్ పేర్కొన్నారు. కాగా పేపర్ మిల్లు పునరుద్దరణకు కృషి చేసిన సిఎం కెసిఆర్,మంత్రి కెటిఆర్‌కు జిల్లా మంత్రి జోగు రామన్నతో పాటు కాగజ్ నగర్ ఎంఎల్‌ఏ కోనేరు కోనప్ప ధన్యవాదములు తెలిపారు.

Comments

comments