Home తాజా వార్తలు కుప్పకూలాయి

కుప్పకూలాయి

Results Of Five State Assembly Elections

 

మార్కెట్లకు ఎన్నికల సెగ

ప్రభావం చూపిన అంతర్జాతీయ పరిణామాలు
అమ్మకాలకే ఇన్వెస్టర్ల మొగ్గు
572 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, క్రూడ్ ఆయిల్‌పై ఒపెక్ దేశాల సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. మరోవైపు ఆర్‌బిఐ పాలసీ నిర్ణయాలు మెప్పించకపోవడం, దేశీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో గురువారం ఒక్క రోజే సూచీలు 1.5 శాతం మేరకు పతనమయ్యాయి. మరోవైపు చైనా టెక్నాలజీ దిగ్గజం హువావే సిఎఫ్‌ఒ అరెస్టు వంటి పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో ఆసియా, యూరప్ మార్కెట్ల నష్టపోగా, ఇది భారత్‌పై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. హెవీ వెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సిలు నష్టాల్లో ట్రేడింగ్ కావడంతో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఆఖరికి 572 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ భారీగా 181.75 పాయింట్లు(1.69 శాతం) పడిపోయి 10,601.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బిఎస్‌ఇ సెన్సెక్స్ 572.28 పాయింట్లు (1.59 శాతం) నష్టపోయి 35,312.13 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లు ఇంతలా పతనమవడానికి పలు కారణాలు ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఆస్ట్రియాలో జరగనున్న ఓపెక్‌దేశాల సమావేశ నిర్ణయాల కోసం కూడా ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే వారం వెలువడనున్నాయి. ఫలితాలు వెలువడే వరకు మార్కెట్ ఒడిదుడుకులకు గురి అవుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు.

బలహీనపడిన ఆసియన్ మార్కెట్లు
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి పెరగడంతో ఆసియా మార్కెట్లలో గణనీయమైన నష్టాలు నమోదయ్యాయి. ఈ ప్రభావం దేశీయంగా అమ్మకాల ఒత్తిడికి కారణమైంది. గురువారం హాంగ్‌సెంగ్, నిక్కీ, షాంఘై సూచీలు 2.75 శాతం మేరకు పతనమయ్యాయి. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణల కారణంగా చైనా టెక్నాలజీ దిగ్గజం హువావే సిఎఫ్‌ఒ మెంగ్ వాన్‌జూని అరెస్టు చేశారు. దీంతో చైనా, హాంకాంగ్‌లో టెక్నాలజీ షేర్లలో ఆందోళన నెలకొని స్టాక్ సూచీలు పతనమయ్యాయి. ఇప్పటికే అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య విభేధాలు మరింత ముదిరే అవకాశమున్నట్లు ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ రెండు దేశాల మధ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించనుందనే అంచనాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా వివాదం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

ఫైనాన్షియల్, మెటల్, ఆయిల్ షేర్లు
రిటైల్ రుణాల విషయంలో ఆర్‌బిఐ ప్రకటించిన నిర్ణయంతో బ్యాంకింగ్ స్టాక్స్‌లో ఒత్తిడి నెలకొంది. మరోవైపు ఉత్పత్తిని నిలిపివేతపై పెట్రోలియం ఎగుమతి దేశాలు సంఘం ఒపెక్ చర్చలు జరనున్న నేపథ్యంలో మెటల్, ఆయిల్ షేర్లు కృంగిపోయాయి. ఐసిఐసిఐ బ్యాంక్, యస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లు నష్టాలను నమోదు చేశాయి.

అన్ని రంగాలూ డీలా
రంగాల వారీగా సూచీలు రియల్టీ, ఆటో, ఐటి, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, బ్యాంక్స్ నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ వంటి పెద్ద కంపెనీల షేర్ల పతనం సూచీల భారీ నష్టాలకు కారణమైంది. ప్రధానంగా ఐటీ, ఫైనాన్స్ రంగ షేర్ల క్షీణత సూచీలకు అధిక నష్టాలను కలిగించాయి. టాటామోటర్స్, టెక్‌మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకీ, ఇండియాబుల్స్‌హౌసింగ్ షేర్లు 4 నుంచి 6 శాతం నష్టపోయాయి. పవర్‌గ్రిడ్, గెయిల్, జెఎస్‌డబ్లు, సన్‌ఫార్మా షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. చిన్న షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.5 శాతం చొప్పున నష్టపోయాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,797 నష్టపోగా, 746 మాత్రమే లాభాలతో ముగిశాయి. బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.358 కోట్లు, దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ.791 కోట్లు మేరకు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.

Results Of Five State Assembly Elections

Telangana Latest News