Home ఆఫ్ బీట్ ఇంటర్వూలకి రెజ్యూమె కీలకం

ఇంటర్వూలకి రెజ్యూమె కీలకం

lf ఉద్యోగం చేయాలనుకునేవారు మొదటగా ప్రాముఖ్యత ఇచ్చే పత్రం రెజ్యూమె. దీన్ని  బయోడేటా, కరిక్యులమ్ అని కూడా అంటారు. అభ్యర్థిని ఇంటర్వూకి పిలవాలంటే రెజ్యూమ్ కీలకం.ఒక రకంగా చెప్పాలంటే  ఆ అభ్యర్థి గురించిన పరిచయ పత్రం అవుతుంది. ఎంతి ప్రతిభ ఉన్నా, ఒక్కొక్కసారి చిన్నచిన్న లోపాలతో  జీవితంలో ముందుకు వెళ్లలేక పోతుంటారు. ఎంత తెలివితేటలు ఉన్నా చిన్నపాటి లోపాలు జరిగినా మంచి మంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. 

చాలా మంది ఉద్యోగార్థులు రెజ్యూమెలో తమ మొత్తం విద్యా విషయాలు, ఇంకా నైపుణ్యాలు ఇక్కడే రాసేస్తే మంచిదని భావిస్తారు. కానీ ఆ అభిప్రాయం తప్పు. రెజ్యూమెలో స్పష్టంగా, కరెక్టుగా అవసరమైనచోట్ల టెంప్లెట్స్‌ను ఉపయోగించి వాళ్లకి మనం సమాచారాన్ని తెలపగలగాలి. మనకి ఏ సబ్జెక్టులు తెలుసు, ఏ ప్లేస్‌లో పనిచేస్తాం అనేవి కచ్చితంగా ఉండాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా స్పష్టంగా ఉండాలి. అనవసరమైన, అసంబద్ధమైన సమాచారాన్ని రాయకపోవడమే మంచిది. అలాంటివి చూడగానే ఎంపిక చేసుకునే వాళ్లు ఇష్టంగా చూడకుండా పక్కన పడేస్తారు. దీంతో ఉద్యోగార్థులు ఎన్ని అర్హతలున్నా మానసికంగా బాధపడి మంచి అవకాశాలు కోల్పోతారు. వాళ్లకి ఒక కాపీ ఇచ్చాక అభ్యర్థి దగ్గర కూడా ఒక కాపీ ఉంచుకుంటే మంచిది. రెజ్యూమె ఎలా రాయాలో చూద్దాం..
రెండూ కలిపి రాయొద్దు : నైపుణ్యాలు, తెలివితేటలు ఈ రెండూ విషయాలు వేరువేరుగా రాయాలి. మనం మొదటి నుంచి నేర్చుకున్న విషయాలు సంక్షిప్తంగా రాయాలి. మనం సొంతంగా తెలుసుకున్నవి నైపుణ్యం (స్కిల్స్) కిందకు వస్తాయి. వాటిని అభ్యర్థి సొంత తెలివితేటలుగా గుర్తిస్తారు. వాటిని సంక్షిప్తంగా రాస్తే రిక్రూట్ చేసుకునే వాటిని పక్కన పడేయకుండా ఉత్సాహంగా పరిశీలిస్తారు.
నిజాయితీగా మన అనుభవాలను తెలియచేయాలి: ఇంతకు ముందు ఏదైనా ఉద్యోగం చేసినా, మధ్యలో కొద్ది కాలం ఆపి వేరే ఏదైనా కోర్సు చదివినా ఆ వివరాలు కరెక్టుగా రాయాలి. వాళ్లకి మన రెజ్యూమె చూడగానే ఏ టైములో ఏమి చేశామనేది అర్థమవ్వాలి. పని అనుభవం, అంతకుముందు పనిచేసిన సంస్థ పేరు, హోదా కచ్చితంగా రాయాలి. చక్కగా ఒకదాని తరువాత ఒకటి చూడగానే ఆకర్షణీయంగా ఉండేట్టుండాలి. అప్పుడే అభ్యర్థి ఎంత నిజాయితీగా రాశాడు అనేది తెలుసుకోవటానికి రెజ్యూమె ఉపయోగపడుతుంది. హాబీల కోసం ఎంత సమయం వెచ్చించాం, మహిళలైతే ప్రసూతి సెలవులు … ఏదేమైనప్పటికీ వాళ్లకి కచ్చితంగా ఆ విషయం అర్థమయ్యేలా తెలియచేయాలి. అప్పుడే వాళ్లకి అభ్యర్థి గురించి మంచి అవగాహన కలుగుతుంది.
తేదీల్లో తప్పులు దొర్లకూడదు: అభ్యర్థి పాఠశాలలో, కళాశాలల్లో విద్య ముగించిన సంవత్సరం తేదీలను తప్పులు లేకుండా రాయాలి. హడావిడిగా రాయకుండా కాస్త నిదానంగా రెజ్యూమె రాశాక ఒకటికి రెండుసార్లు సరిగా ఉందా లేదా చూసుకోవాలి. పొరపాటున ఒక అంకె తప్పు పడినా వాళ్ళకు అనుమానం వచ్చే అవకాశాలున్నాయి. అభ్యర్తి దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి నైపుణ్యతల గురించి స్పష్టంగా చెప్పాలి.
ప్రయోజనాలు: ఇదివరకు ఏమైనా విజయాలు సాధిస్తే వాటిని ఒక క్రమపద్ధతిలో వివరంగా రాయాలి. అప్పటి కంపెనీ పేరు స్పష్టంగా తెలియచేయాలి. మీరు అక్కడ చేసిన పనుల గురించి కంపెనీకి కలిగిన ప్రయోజనాన్ని వివరంగా, అర్థమయ్యేలా ఉండాలి.
సోషల్ ప్రొఫైల్ సైట్స్ : అభ్యర్థిని కలుసుకోవడానికి రిక్రూటర్లు మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. అందువల్ల మీ సామాజిక మాధ్యమాల వివరాలు వారికి వివరంగా తెలియచేయాలి. ప్రొఫెషనల్ కమ్యూనిటీస్ వివరాలు ఉండే సైట్ల పేర్లను రిఫర్ చేయడం మంచిది. మన ఫోన్ నెం., ఇ మెయిల్ ఎడ్రస్ కరెక్టుగా రాయాలి. రిఫరెన్స్ ఉండాలి: అభ్యర్థి గురించి ఏదైనా అడిగినప్పుడు తెలియచేయడానికి రిఫెరెన్స్ వ్యక్తులు ఇద్దరు ఉండాలి. వాళ్లు మీ గురించి నమ్మకం కలిగించే వారై ఉండాలి. అంతేతప్ప ఏదో తెలిసిన ఇద్దరి పేర్లు రాశాం అని కాదు. అభ్యర్థులను ఎంపిక చేసుకునే వాళ్లు రోజూ వందలాది రెజ్యూమెలను చూస్తూంటారు.అందువల్ల వాళ్లకి సందేహాలు రాకుండా అవసరమైన చోట టెంప్లేట్స్ ఉపయోగిస్తూ రాయాలి. ఈ టెంప్లేట్స్ మన గురించి మొత్తం విషయాన్ని తెలియచేయాలి. గజిబిజిగా ఉండకూడదు. వాళ్లు చూడగానే ఆకట్టుకునే విధంగా ఉండాలి. మీ రెజ్యూమెలో ఇవన్నీ ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకోండి.