Search
Friday 21 September 2018
  • :
  • :

మళ్లీ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

నవంబర్‌లో 4.88 శాతం నమోదు   

ఆహార  ధరల పెరగుదలతో 15 నెలల గరిష్ఠానికి చేరిక

Market

న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగింది. నవంబర్ నెలకు గాను వినిమయ ధర సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4.88 శాతం నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో 3.63 శాతంతో ఈసారి భారీగా ద్రవ్యోల్బణం పెరిగింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 4 శాతం కంటే అత్యధికంగా నమోదైంది. ఇంతకుముందు నెల అక్టోబర్‌లో ఈ ద్రవ్యోల్బణం 3.58 శాతంగా ఉంది. ఆహార ధరలు పెరుగుతుండటంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందనే భయాందోళనతోనే ఇటీవల జరిగిన పాలసీ సమీక్షలో కూడా ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వడ్డీరేట్లను తగ్గించలేదు. రాయిటర్స్ అంచనాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 4.2 శాతానికి పెరుగుతుందని అంచనావేశారు. కానీ అత్యధిక మొత్తంలో వర్షాల కారణంగా ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండ్లు, కూరగాయల తోటలకు నవంబర్ నెలలో కురిసిన వర్షాలు తీవ్ర స్థాయిలో దెబ్బకొట్టాయని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఉల్లిపాయలు, టోమాటోలు, ఇతర ఉత్పత్తుల ధరలు పెరిగినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి అక్టోబర్‌లో 2.2 శాతానికి క్షీణించింది. సెప్టెంబర్‌లో ఇది 3.8 శాతంగా ఉండేది. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) ప్రవేశపెట్టినప్పటి నుంచి పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి మందగించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6న జరిగిన పాలసీ సమావేశంలో ఆర్‌బిఐ తన ద్రవ్యోల్బణ అంచనాలను 10 బేసిస్ పాయింట్లు పెంచి 4.3 శాతం నుంచి 4.7 శాతం మధ్యలో ఉండనుందని పేర్కొంది. 2018 చివరి వరకు కూడా ఆర్‌బిఐ వడ్డీరేట్లను మార్చదని కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

Comments

comments