Home బిజినెస్ 4 శాతం దాటనున్న రిటైల్ ద్రవ్యోల్బణం

4 శాతం దాటనున్న రిటైల్ ద్రవ్యోల్బణం

నవంబర్‌లో మరింతగా పెరిగే అవకాశం: నిపుణులు

Marketముంబయి: అక్టోబర్‌లో ఏడు నెలల గరిష్ఠానికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. ఈ నెలలోనూ మరింతగా పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగయాలు, ఆయిల్ ధరలు పెరగడం వల్ల నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దాటనుందని అంటున్నారు. నోమురా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లింఛ్, మోర్గాన్ స్టాన్లీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థల ప్రకారం, ధరల ఒత్తిడి ఎక్కువగా ఉండనుంది. కూరగాయలు, ఆయిల్ ధరల్లో పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ కోలుకునే దశలో ఉన్నందు వల్ల వచ్చే నెలల్లో మరింతగా రిటైల్ ద్రవ్యోల్బణం పెగనుందని పేర్కొంది. ‘నవంబర్‌లో రిటైల్ వినిమయ ధరల సూచీ(సిపిఐ) ద్రవ్యోల్బణం 4 శాతం దాటనుంది. 2018 సంవత్సరానికి గాను ఆర్‌బిఐ లక్షం 4 శాతానికి పైనే ఉండనుంది’ అని నోమురా నివేదికలో పేర్కొంది. అక్టోబర్ నెలలో కూరగాయల ధరల ప్రభావం భారీగా కనిపించింది. దీంతో గత నెలలో సిపిఐ ద్రవ్యోల్బణం 3.58 శాతంతో 7 నెలల గరిష్ఠానికి చేరింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎంఎల్ ప్రకారం, నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతానికి చేరనుంది. కాగా సెప్టెంబర్ ద్రవ్యోల్బణం 3.28 శాతంతో పోలిస్తే రిటైల్ ద్రవ్యోల్బణం 3.58 శాతానికి పెరిగింది. ఇంతకుముందు మార్చి నెలలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం అత్యధికంగా 3.89 శాతం నమోదైంది. కేంద్ర గణాంకాల శాఖ(సిఎస్‌ఒ) విడుదల చేసిన వివరాల ప్రకారం, అక్టోబర్‌లో ఆహార ధరల ద్రవ్యోల్బణం 1.9 శాతానికి పెరిగింది. సెప్టెంబర్‌లో ఇది 1.25 శాతం మాత్రమే ఉంది. కూరగాయల సెగ్మెంట్‌లో ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపింది. కూరగాయల ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 3.92 శాతంతో పోలిస్తే అక్టోబర్‌లో రెట్టింపు అయి 7.47 శాతానికి చేరింది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు గుడ్లు, పాలు(దీనికి సంబంధించిన ఉత్పత్తులు) వంటి వాటిలోనూ అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదైంది. వరుసగా చూస్తే అక్టోబర్‌లో పండ్లు చౌకగా మారాయి. పప్పు ధాన్యాల్లో ద్రవ్యోల్బణం వరుసగా క్షీణించి మైనస్ 23.13 శాతానికి చేరింది.
ఇంధనం ధరలు ప్రియం అయ్యాయి. డిసెంబర్ 5, 6 తేదీలలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో జరగనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక సమీక్ష వుంటుంది. ఈ సమీక్షలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకొనున్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం గణాంకాలను చూస్తే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పరిశ్రమ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.