Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ప్రేమ పేరుతో వృద్ధుడిని ముంచేసిన యువతి!

Retired banker falls in love and conned of Rs 35 lakh: Gurugram
గురుగ్రాం: లేటు వయసులో ఘాటు ప్రేమలో పడి ఓ వృద్ధుడు ఏకంగా రూ. 35 లక్షలు పోగొట్టుకున్న ఉందంతం ఇది. 66 ఏళ్ల బ్యాంకు మాజీ అధికారి ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడి భారీ మొత్తంలో పోగొట్టుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  66 ఏళ్ల బ్యాంకు రిటైర్డు అధికారి డిఎల్ఎఫ్ 1 ప్రాంతంలో నివాసముంటున్నాడు. భార్య మరణించడంతో ఒంటరిగా ఉంటున్న ఈ వృద్ధుడికి జెన్నీ అండర్సన్ అనే మహిళ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. దీంతో మాజీ అధికారి కొన్నాళ్లుగా ఆమెతో ఛాటింగ్ చేశాడు. ఆ పరిచయం కాస్తా వాట్సాప్ నంబరు మార్చుకునేంత వరకు వెళ్లింది. దాంతో వారిద్దరూ తరచూ వాట్సాప్ ఛాటింగ్ చేసుకుంటున్నారు. పరిచయం పెరగడంతో యువతి తన గురించి చెబుతూ… తాను పెళ్లి చేసుకోలేదని తన తల్లితో కలిసి లండన్ నగరంలో నగల దుకాణం నిర్వహిస్తున్నట్లు చెప్పింది. ఆ తరువాత మే 26వ తేదీన తమ నగల దుకాణం పదకొండో వార్షికోత్సవం ఉందని, దానిలో పాల్గొనేందుకు లండన్ రావాలంటూ ఆహ్వానం పంపించడానికి ఉద్యోగి ఇంటి చిరునామా అడిగింది.
అయితే, తాను లండన్ రాలేనని వృద్ధుడు చెప్పడంతో బహుమతులు పంపిస్తానని చెప్పి చిరునామా తీసుకుంది. ఆ తరువాత మే 29న తాను నగలను కొనేందుకు ఇండియా వస్తున్నట్లు చెప్పి, వాట్సాప్ లో విమానం ఎక్కుతున్న ఫోటోను వృద్ధుడికి జెన్నీ పంపింది. ఈ క్రమంలో జూన్ 1న ముంబయి ఎయిర్ పోర్టు నుంచి పూజ అనే పేరుతో మరో యువతి మాజీ అధికారికి ఫోన్ చేసింది. జెన్నీ రూ.68 లక్షల బ్రిటీష్ పౌండ్లను తీసుకోరావడంతో పాటు ఆమెకు హెల్త్ సర్టిఫికెట్ లేదని, నగదుకు సంబంధించిన అధికారిక పత్రాలు కూడా లేవంటూ ఆమె ఫోన్ ను జెన్నీకి ఇచ్చింది. ఫోన్ లో జెన్నీ మాట్లాడుతూ… తాను ఎయిర్ పోర్టులో చిక్కుకున్నానని జరిమానా చెల్లించాలని ఏడ్చింది. దీంతో వృద్ధుడు నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపిస్తే తాను సర్దుబాటు చేస్తానని చెప్పాడు. దాంతో వివిధ పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతా నెంబర్లు ఇచ్చింది జెన్నీ. ఆ ఖాతాల్లో మాజీ అధికారి ఏకంగా రూ.35 లక్షలు వేశాడు. ఆ తరువాత వెంటనే జెన్నీ వాట్సాప్ నంబరు స్విచాఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన వృద్ధుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ గుడ్డిది అనేది నానుడి.. కానీ, మరీ ఇంతా గుడ్డిదా అని ఈ ఘటనపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Comments

comments