Home నిర్మల్ మంత్రి కనుసన్నలలో రెవెన్యూ అధికారులు

మంత్రి కనుసన్నలలో రెవెన్యూ అధికారులు

Maheshwar-reddy-image

ఉమ్మడి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణ

మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్ : మంత్రి కనుసన్నలలో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై పనులు నిర్వహిస్తున్నారని ఉమ్మడి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిర్మల్‌లో స్థానిక గాజులపేట్ సర్వే నెంబర్, ప్రస్తుతం కొచ్చెరువులో నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయం సర్వే నెంబర్ ఒకే దగ్గర చూపించడం అమానుషం అన్నారు. భౌతికంగా కొచ్చెరువుకు, గాజుల పేట్‌కు చా లా దూరం ఉంటుందన్నారు. ఇలా చూపించడం ఏ విధంగా సాధ్యమని ప్రశ్నించారు. అవే కాకుండా నిర్మల్‌లో వందలాది ఎకరాల్లో అసైన్డ్ భూములు పట్టాలవుతున్నాయన్నారు. చెరువులు కబ్జాకు గురై అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. వీటన్నింటికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బాధ్యత వహిస్తున్నారని ఆరోపించారు. ఇలా రెవెన్యూ అధికారులను పావులుగా మార్చుకొని పనులు పూర్తి చేస్తున్నారన్నారు. వీటన్నిటిపై సిట్టింగ్ జడ్జి, హైలెవల్ కమిటీతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారన్నారు. రైతులు క్రాఫు లోను కోసం బ్యాంకులను ఆశ్రయిస్తే ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన కొత్త పాస్‌పుస్తకాలను మార్టిగేజ్ చేయడం వలన రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇవే కాకుండా పాత డీడ్‌లను అడగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇలాంటి అనాలోచిత పనులు ప్రభు త్వం చేయడం వలన రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు ధాన్యానికి డబ్బులు రాకా ఇబ్బంది పడితే కెసిఆర్ ప్రభుత్వం ఎకరానికి రూ. 4వేలు స్కీమ్ అని ఇచ్చి నిజమైన రైతులకు ఎలాంటి లబ్ది చేయకుండా భూస్వాముల కొరకు ఈ స్కీమ్ పెట్టినట్లు అనిపించిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే ఈ సమస్యలు ఉండేవి కాదన్నారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ. 4వేల స్కీమ్ ఎన్నికల స్టంటే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. చాలా మంది నిరుపేద రైతులు చెక్కులు అందక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన రైతు కుటుంబాలకు చెక్కులు ఇ వ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇటీవల సోన్‌లో 10ఏళ్ల చిన్నారి స్పందనను పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ ఆగంతకుడిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. స్పందన కుటుంబానికి రూ. 25లక్షల ఆర్థిక సాయం చేసి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అయిరా నారాయణరెడ్డి, తక్కల రమణరెడ్డి, సాదా సుదర్శన్, ముత్యంరెడ్డి, సత్యం చంద్రకాంత్, బాపురెడ్డి, వీరేష్, భోజన్న, సాహేబ్‌రావు, వేణుగౌడ్, పోతన్న తదితర నాయకులు పాల్గొన్నారు.