Home ఖమ్మం నజరానాలు నసీబ్ మార్చేనా?

నజరానాలు నసీబ్ మార్చేనా?

ఎక్కడ విన్నా ఒక్కటే చర్చ, దానిపై రాని ఏకాభిప్రాయం, ఎవరు గెలుస్తారన్న దానిపై బెట్టింగులు ఇదీ ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న స్థితి. మండలి ఎన్నికలపై పోటీలో ఉన్న అభ్యర్థులు, వారికి మద్దతు ఇస్తున్న పార్టీలు లెక్కల్లో మునిగిపోయారు. ఇదిలా ఉండగా అక్కడక్కడ బెట్టింగులకు దిగుతున్నారు.
ఓటింగ్‌పై ఎడతెగని చర్చలు
అక్కడక్కడ బెట్టింగ్‌లు! ఎవరి లెక్కలు వారివి
రేపటితో ఉత్కంఠకు తెర
giftమన తెలంగాణ ప్రతినిధి /ఖమ్మం: శాసన మండలి ఎన్నికలు ముగిసిన తర్వాత గెలుపు ఓటములపై జిల్లా వ్యాప్తంగా చర్చలు సాగుతున్నాయి. సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు, టిఆర్‌ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మి నారాయణల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో లెక్కలు వేస్తున్నారు. ప్రధాన పార్టీలు క్రాస్ ఓటింగ్‌పై క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి ప్రధాన పోటీదారుకు క్రాస్ ఓటింగ్ జరిగిందన్న విషయం బహిరంగమైంది. క్రాస్‌ఓటింగ్ ఏ స్థాయిలో జరిగింది. ఎంతమంది ఓటర్లు చేజారారు అనేది అంతుపట్టడం లేదు. అధికార పార్టీ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతతో ఓటమి తప్పదని భావించినా మంత్రులు క్యాంపుకు కోట్లాది రూపాయలు తెచ్చి పంపిణీ చేశారని పలువురు పేర్కొంటున్నారు. టిఆర్‌ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేసిన క్యాంపుకు ప్రతిరోజు మంత్రులను రప్పించి పలు హమీలు ఇప్పించారు. అయినా ఓటర్లలో అభ్యర్థి పట్ల సానుకూలత రాకపోవడం డబుల్ బెడ్ రూం ఇళ్లు, లక్షలాది రూపాయల పనులు అంటూ ఆశ చూపారు. పోలింగ్‌కు ముందు రోజు వరకు వేచి చూసినా అమాత్యులు ఇక లాభం లేదని రాత్రికి రాత్రే డబ్బులు సంచులు తెప్పించారు. ఓటమి నుంచి బయట పడాలంటే నగదు, నజరానాలే మార్గమని భావించి కోట్ల రూపాయలు గుప్పించారు. ఒక మంత్రి స్నేహితుడి ద్వారా పట్టువస్త్రాలు పంపిణీ చేశారు. ఈ నజరానా అయినా అధికార పార్టీ అభ్యర్థి నసీబ్ మారుస్తుందని నేతలు ఆశగా ఉండగా క్రాస్ ఓటింగ్ కొంతమేర అధికార పార్టీ ఒక అంచనాకు రాకుండా చేస్తుంది. వామపక్ష అభ్యర్థి పువ్వాడకు టిఆర్‌ఎస్, వైసిపి నుంచి సానుకూల ఓటు పోల్ కావడంతో పాటు కాంగ్రెస్, టిడిపి, వామపక్షాల ఓట్లు చెక్కు చెదరకపోవడం గెలుపు ఓటములపై ఎడతెగని చర్చకు కారణం అవుతుంది. జిల్లా వ్యాప్తంగా లక్షల్లో బెట్టింగులు నడుస్తున్నాయి. వైసిపికి వచ్చే ఓట్లపై బెట్టింగు నడుస్తుంది. దాదాపు 20 రోజుల పాటు మండలి ఓటర్లను అధికార పార్టీ నుంచి కాపాడుకోవడం ఇబ్బందికరంగా మారిందని ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో అధికారంలో ఉన్న ఏపార్టీ చేయని విధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ టిఆర్‌ఎస్ బెదిరింపులకు పాల్పడిందని ఓ విపక్ష నేత వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరో 24 గంటల తర్వాత ఫలితం తేలనుండడంతో ఉత్కంఠతకు తెరపడనుంది. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన ఖమ్మం ఫలితం కోసం యావత్తు రాష్ట్రం ఎదురు చూస్తుంది.