Home తాజా వార్తలు ఆఫీస్ స్పేస్‌కు భలే డిమాండ్

ఆఫీస్ స్పేస్‌కు భలే డిమాండ్

Hyderabad భారీగా పెరిగిన అద్దెలు
మిగతా మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌కే డిమాండ్
గతేడాది 5 కోట్ల చదరపు అడుగుల మేర ఆఫీస్ స్పేస్ లీజు
8 సంవత్సరాల్లో ఇదే అత్యధికం

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ఆఫీసుకు డిమాండ్ పెరిగింది. నగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేందుకు బడా సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలకన్నా హైదరాబాద్‌కే డిమాండ్ ఎక్కువగా ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ కొల్లియర్స్ తన సర్వేలో వెల్లడించింది. ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే నగరంలో ఆఫీసు అద్దెలు భారీగా పెరిగాయని ఆ సంస్థ చేసిన సర్వేలో పేర్కొంది. నివాస గృహాలు, ఆస్తుల ధరలు భారీగా పెరిగిన మెట్రో నగరాల సరసన ప్రస్తుతం హైదరాబాద్ కూడా చేరింది.

తెలంగాణలో నివాసాలకు డిమాండ్ పెరగడంతో రియల్‌రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని రియల్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2018 సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన సర్వేలో అద్దెలు 8 శాతం పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తాలో ఈ సర్వేను నిర్వహించి ఈ విషయాన్ని ఆ సంస్థ వెల్లడించింది. 2018 జవనరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రముఖ నగరాల్లో అంతకుముందు ఉన్న అద్దెలతో పోల్చితే అక్టోబర్ నుంచి 2.5 శాతం అధికమయ్యాయని ఆ సంస్థ వెల్లడించింది.

గతంలో కంటే 15.8 శాతం పెరుగుదల

హైదరాబాద్‌లో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ (సిబిడి)లో ఆఫీసుల ఏర్పాటుకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. దీంతో ఇక్కడ అద్దెలు గతంలో పోల్చితే ఏకంగా 15.8 శాతం పెరిగిపోయాయి. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మణికొండ తదితర ప్రాంతాలు సిబిడి జోన్‌లో ఉన్నాయి. అలాగే నగరంలోని పెరిఫెరల్ బిజినెస్ డిస్ట్రిక్స్ (పిబిడి)లోనూ పోయినసారితో చూస్తే అద్దెలు 9.1శాతం పుంజుకున్నాయి. పోచారం, ఉప్పల్, శంషాబాద్ వంటి పలు ప్రాంతాలు ఈ జోన్‌లో ఉన్నాయి. ఇక సెకండరీ బిజినెస్ డిస్ట్రిక్ (ఎస్‌బిడి)లో అద్దెలు 8.3 శాతం పెరిగినట్టు సర్వేలో తేలింది. గడిచిన 12 నెలల్లో హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాఫర్టీ ధరలు 16.6 శాతం పెరగడంతో ప్రపంచంలోని 150 నగరాల్లో హైదరాబాద్ నాలుగోస్థానంలో నిలిచింది. అహ్మదాబాద్ 19.6 శాతం ధరలు పెరగడంతో ప్రపంచంలో రెండోస్థానంలో నిలిచింది. ఆ తరువాత 18.6 శాతంలో హైదరాబాద్ నాలుగోస్థానంలో, 18.3 శాతంతో బెంగళూరు ఐదో స్థానం, 13.2 శాతం పెరుగదలతో సూరత్ 9వ స్థానంలో, ఫుణె 12.6 శాతంతో 12వ స్థానంలో, ముంబై 11.5 శాతం ధరల పెరుగుదలతో 17వ స్థానంలో నిలిచాయని నైట్‌ఫ్రాంక్ గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీ సిండెక్స్ తన నివేదికలో గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.

బెంగళూరులో అధికంగా 16.3 శాతం

బెంగళూరులోని ఈపిఐపి జోన్/వైట్‌ఫీల్డ్ ఈపిఐపి జోన్/ వైట్‌ఫీల్డ్‌ల్లో అద్దెలు అధికంగా 16.3 శాతం పెరిగాయి. బన్నర్‌ఘట్టు రోడ్డులో 13.8 శాతం, హోసూర్ రోడ్డులో 8.1 శాతం చొప్పున అద్దెలు ఎగబకాయి. ఎలక్ట్రానిక్ సిటీలో 7.5 శాతం, ఔటర్ రింగ్‌రోడ్డులో 7.1 శాతం చొప్పున పెరిగినట్లు కొల్లియర్స్ సంస్థ తెలిపింది. అలాగే కోల్‌కత్తా సిబిడిలో 10.5 శాతం అద్దెలు పెరగగా, చెన్నైలోని ఓ ఎమ్మార్ పోస్ట్‌లో టోల్ రీజియన్‌లో గతంలో పోల్చితే 10 శాతం మేర అద్దెలు పెరిగినట్టు కొల్లియర్స్ సంస్థ చేసిన సర్వేలో పేర్కొంది.

బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో డిమాండ్

గతేడాది హైదరాబాద్‌తో సహా దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల మేర ఆఫీస్ స్పేస్ లీజుకు కుదిరిందని ఆ సంస్థ పేర్కొంది. గడిచిన 8 సంవత్సరాల్లో ఇదే గరిష్టమని పేర్కొంది. 2018 సంవత్సరంలో బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో డిమాండ్ ఎక్కువగా ఉందని ఆ సంస్థ చేసిన సర్వేలో వెల్లడించింది. అయితే నిర్మాణాల్లో జాప్యం కారణంగా కొత్తవి అందుబాటులోకి రావడం మాత్రం 20 శాతం తగ్గిపోయిందని తెలిపింది. దీనికి తగ్గట్టుగానే గృహ నిర్మాణాలకు కూడా డిమాండ్ పెరగడంతో రియల్‌రంగం మళ్లీ పుంజుకుంది. అయితే డిమాండ్ తగ్గట్టుగా నివాసాల నిర్మాణాలు లేకపోవడం, విలాసవంతమైన విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలతో ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో భూముల ధరలు గణనీయంగా పెరగడంతో నివాసాల ధరలపై దాని ప్రభావ పడింది. నగరం చుట్టూ భూములను ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేయడంతో నిర్మాణాలకు కొనే భూములకు భారీ ధర చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడుగా ఇటీవల భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం కూడా జత కావడంతో నివాసాల ధరలు సామాన్యులకు అందనంత స్థాయిలో పెరిగాయి.

విధానపరమైన నిర్ణయాల వలన..

ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల మార్పులు, గృహ రంగానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోదా రావడంతో ఈ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. రాష్ట్రంలో ఐటి కంపెనీలకు సకల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. రియల్ రంగానికి అనేక రాయితీలను కల్పిస్తుండడంతో ఆఫీసు డిమాండ్ పెరుగుతోందని ఆ సంస్థ చేసిన సర్వేలో వెల్లడయ్యింది. ఐటిలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో నిరుద్యోగ సమస్య కూడా కొంతమేర తగ్గిందని ఐటి, రియల్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ నలువైపులా ఐటి కారిడార్లను నిర్మించడంతో పెట్టుబడులు పెట్టడానికి బడా కంపెనీలు హైదరాబాద్‌పై ఆసక్తి చూపుతున్నాయి.

Rising Demand for Office Space in Hyderabad