Home ఛాంపియన్స్ ట్రోఫీ పంజాబ్ ఇంటికి

పంజాబ్ ఇంటికి

  • చెలరేగిన బౌలర్లు, కింగ్స్ చిత్తు, ప్లే  పుణె

Pune-Win

పుణె: రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఐపిఎల్ ప్లే ఆఫ్ బెర్త్‌కు దూసుకెళ్లింది. ఆదివారం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పుణె చిరస్మరణీయ ఆటతో కింగ్స్ లెవన్ పంజాబ్‌ను చిత్తు చేసి ముందంజ వేసింది. ఈ విజయంతో పుణె పాయింట్ల పట్టికలో ముంబై తర్వాత రెండో స్థానాన్ని దక్కించుకుంది. వరుస విజయాలతో ప్లేఆఫ్ ఆశలను రేపిన పంజాబ్ చివరి మ్యాచ్‌లో చిత్తు చిత్తుగా ఓడి టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. తప్పనిసరి విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో పుణె 9 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్‌ను పుణె బౌలర్లు అద్భుత బౌలింగ్‌త 73 పరుగులకే కుప్పకూల్చారు. తర్వాత ఈ లక్ష్యాన్ని పుణె కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. చక్కటి బౌలింగ్‌తో పంజాబ్‌ను కట్టడి చేసిన జైదేవ్ ఉనద్కట్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆడుతూ.. పాడుతూ…
స్వల్ప లక్షంతో బరిలోకి దిగిన పుణె ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు అజింక్య రహానె, రాహుల్ త్రిపాఠి చక్కని బ్యాటింగ్‌తో శుభారంభం అందించారు. సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన రహానె ఈసారి కాస్త కుదురుగా ఆడాడు. మరోవైపు రాహుల్ తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాడు. చూడచక్కని షాట్లు కొడుతూ స్కోరును పరిగెత్తించాడు. లక్షం మరి తక్కువ కావడంతో పంజాబ్ బౌలర్లు చేసేదేమి లేకుండా పోయింది. స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝులిపించిన రాహుల్ నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో 41 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ స్టివ్ స్మిత్‌తో కలిసి రహానె మరో వికెట్ కోల్పోకుండానే పుణెను విజయ తీరానికి చేర్చాడు. సమన్వయంతో ఆడిన రహానె ఒక ఫోర్, మరో సిక్స్‌తో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్మిత్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో పుణె మరో 8 ఓవర్లు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో పుణె పటిష్టమైన ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ఇందులో గెలిచే జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు కూడా మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్-2, ఎలిమినేటర్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ఓడిన జట్టు తలపడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచే జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.
ప్రారంభంలోనే..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. ఉనద్కట్ వేసిన అద్భుత బంతికి వెనుదిరిగాడు. తర్వాత పంజాబ్ మళ్లీ కోలుకోలేక పోయింది. ఒకరి తర్వాత ఒకరూ ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టారు. జట్టును ఆదుకుంటాడని భావించిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (13) నిరాశ పరిచాడు. స్టార్ ఆటగాడు షాన్ మార్ష్ కూడా (10) కూడా చేతులెత్తేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న మోర్గాన్ కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఉనద్కట్ అద్భుత ఫీల్డింగ్‌కు రనౌటయ్యాడు. పుణె బౌలర్లు పోటీ పడి వికెట్లు పడగొట్టడంతో పంజాబ్ ఆటగాళ్లు క్రీజులో నిలువలేక పోయారు. శార్దూల్ ఠాకూర్ అద్భుత బౌలింగ్‌తో వెంటవెంటనే మూడు వికెట్లు తీసి పంజాబ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. కెప్టెన్ మాక్స్‌వెల్ అయితే ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. మరోవైపు డానియల్ క్రిస్టియన్, ఆడమ్ జంపా కూడా రెండేసి వికెట్లు తీయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 15.5 ఓవర్లలో 75 పరుగుల వద్దే ముగిసింది. అక్షర్ పటేల్ (22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పుణె బౌలర్లలో ఠాకూర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఉనద్కట్, జంపా, క్రిస్టియన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. పంజాబ్ జల్టులో కేవలం నలుగురు మాత్రమే రెండంకెలా స్కోరు మార్క్‌కు చేరుకున్నారు. ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు కల్లలయ్యాయి.