Home స్కోర్ రీతూరాణి రిటైర్మెంట్

రీతూరాణి రిటైర్మెంట్

hockeyన్యూఢిల్లీ : భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ రీతూరాణి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని హాకీ ఇండియా అధ్యక్షుడు నరేందర్ బాత్రా గురువారం వెల్లడించారు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెబుతున్నానని, అందుకే జాతీయ శిక్షణ శిబిరానికి హాజరుకాలేనని రెండు రోజుల క్రితం రీతురాణి తమకు మెయిల్ చేసినట్టు ఆయన తెలిపారు. రిటైర్మెంట్ కావాలన్నది ఆమె వ్యక్తిగతమని, భారత జట్టుకు సేవలు అందించిన ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా 36 ఏళ్ల తరువాత భారత మహిళా జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో కెప్టెన్‌గా 24 ఏళ్ల రీతూరాణి కీలక పాత్ర పోషించింది. ఆమె కెప్టెన్సీలోనే భారత్ 2013 ఆసియన్ ఛాంపియన్‌ట్రోఫీలో రజతం, 2014 ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. అయితే రీతూరాణి దృక్పథం(ఆమె తీరు) బాగోలేదని హాకీ ఇండియా ఆమెను రియో ఒలింపిక్స్‌కు ఎంపిక చేయలేదు. దీంతోనే 24 ఏళ్ల వయసులోనే ఆమె కెరీర్‌కు వీడ్కోలు పలికినట్టు తెలుస్తోంది.