Home తాజా వార్తలు జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం

జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం

Road Accident In Suryapet Rtc Bus Hits Lorry

సూర్యాపేట రూరల్ : జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. రహదారిపై పశువులు రావడంతో వాహనాలు ఒకదానికొక్కటి ఢీ కొన్నాయి. బస్సు డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులు గాయాలతో బయట పడ్డారు. స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం జీడి మెట్ల నుండి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి వెళ్తున్న టిఎస్ 04జెడ్ 0144 నంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు 36 మంది ప్రయాణికులతో వెళ్తుంది. ఈ క్రమంలో సూర్యాపేట పట్టణం జనగాం క్రాస్‌రోడ్డు దాటిన తర్వాత ఎస్‌ఎం ఫంక్షన్‌ హాల్ సమీపంలో జాతీయ రహదారిపై గేదెలు రావడంతో ముందుగా ఉన్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేసినట్లు స్థానికులు తెలిపారు. దీనితో వెనుకాల వస్తున్న ఆర్టీసి బస్సు లారీని వెనుక నుండి స్వల్పంగా ఢీ కొట్టి  రోడ్డు పక్కకు వెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ప్రయాణికులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వనున్నందున పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.