Search
Wednesday 26 September 2018
  • :
  • :

నరకం చూయిస్తున్న నల్లవెల్లి రోడ్డు

కొనసా…గుతున్న మరమ్మత్తులు
అర్ధాంతరంగా ఆగిన కల్వర్టు పనులు

Road-Damaged

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ పట్టణంలో అత్యంత రద్దీ కల్గిన రోడ్డులలో నల్లవెల్లి రోడ్డు ఒకటి. ఈ రోడ్డు విస్తరణ దీర్ఘకాలిక ప్రణాళికగా మారింది. అసంపూర్తి పనులతో ఈ దారిపై ఉన్న వ్యాపారులు దారి గుండా వెళ్లే ప్రయాణికులు పడ్డ బాధలు వర్ణణాతీతం. ఏలాగోలా సుదీర్ఘ కాలం పాటు కొనసాగినసిసి రోడ్డు నిర్మాణం ఎట్టకేలకు కొలిక్కి వచ్చిందన్న సంతృప్తితో ఉన్న వారికి నల్లవెల్లి చౌరస్తాలో నిర్మిస్తున్న కల్వర్టు పనులు గొంతులో పచ్చిమిరపకాయలా మారింది. నాగర్‌కర్నూల్ నల్లవెల్లి రోడ్డు విస్తరణ చాలా కాలంగా రాజకీయ వివాదాలకుకేంద్రంగా మారగా ఇప్పుడు అది ప్రమాదాలకు నిలయంగా రూపాంతరంచెందింది.

పట్టణంలోని ఆర్ అండ్ బి ప్రధాన రోడ్డుపై అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లవెల్లి రోడ్డు మలుపు తిరుగుతుంది. ఈ మలుపు వద్ద తరచు డ్రైనేజీ సమస్యఏర్పడుతుండటంతో అక్కడ వంతెన నిర్మించేందుకు పనులు ప్రారంభం అయ్యాయి. నల్లవెల్లి రోడ్డు ప్రయాణికుల కష్టాలను ఈ కల్వర్టు రెట్టింపు చేసింది. నల్లవెల్లి సిసి రోడ్డు పూర్తైనా, ప్రధాన రోడ్డు నుండి నల్లవెల్లి రోడ్డుకు ఉన్న లింకును ఈ కల్వర్టు తెంపి వేసింది. కల్వర్టు పనులు అసంపూర్తిగా వదిలేసినా కాంట్రాక్టర్ ససేమిరా ఆ పని తాను చేయబోనంటూ తెగేసి చెప్పి వెళ్లినట్లు తెలిసింది. బిల్లులు సకాలంలో రాకపోవటం, ఇతరత్ర ఒత్తిళ్ల నేపథ్యంలో కాంట్రాక్టర్ ఈ పనులు చేసేందుకు ససెమిరా అంటున్నట్లు తెలిసింది.

రోడ్డు పూర్తిగా మూత పడటంతో కనీసం ద్విచక్రవాహనాలు, పాదాచారులు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడటంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నగర పంచాయితీ ఈ రోడ్డుపై రాకపోకలు పునరుద్దరించేందుకు తాత్కలిక చర్యలు చేపట్టారు. తాత్కలికంగా నీరు వెళ్లేందుకు పైపులు వేసి దానిపై మట్టి వేశారు. చిన్నవాహనాలు తప్ప భారీ వాహనాలేవి ఈ దారి గుండా వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. అయితే ఈ కల్వర్టు దుస్థితి తెలియని వారు భారీ వాహనాలతో ఈ దారి గుండా వచ్చి ప్రమాదాలకు లోనవుతున్నారు. నల్లవెల్లి సిసి రోడ్డు వేసినప్పటికి ఈ రోడ్డు నుండి పలు కాలనీలకు వెళ్లే అంతర్గత రోడ్ల మూలమలుపుల్లో మురుగు కాల్వలు సరిగ్గా నిర్మించకపోవటంతో సగం రోడ్డుపైకి గుంతలు ఉండటంతో ప్రతి మలుపు ఓ ప్రమాద ఘంటికగా మారింది. ఈ క్రమంలోనే శనివారం వంట గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ ఈ కల్వర్టు వద్ద ఇరుక్కు పోయింది. ఒక దశలో సిలిండర్ లారీ బోల్తా పడే స్థాయికి చేరటంతో చుట్టుపక్కల ప్రజలు, చిరు వ్యాపారులు ప్రమాదభయంతో వణికిపోయారు.

Comments

comments