Home లైఫ్ స్టైల్ ఎనిమిదో ఫెద‘ర’ర్

ఎనిమిదో ఫెద‘ర’ర్

వింబుల్డన్ టోర్నమెంట్… ప్రేక్షకులకు కనువిందైతే, ఆటగాళ్లకు అద్భుతమైన అవకాశం. సీజన్ రాకకోసం ఇరు వర్గాలు ఎదురుచూస్తాయి. అయితే ఈ వింబుల్డన్ సీజన్ ప్రపంచ టెన్నిస్ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదెలా అంటే! రోజర్ ఫెదరర్ రూపంలో… అవును వింబుల్డన్ కోర్టులో ఈ 36 ఏళ్ల యువకుడి ఉత్సాహం చూసి నూనూగుమీసాల కుర్రాళ్లకు ఈర్ష పుట్టింది. పడిపోతాడనుకున్న ఆటగాడు నిలువెత్తు … తనకిష్టమైన ఆల్ఫ్ పర్వతాల ఎత్తుకు ఎదిగి నిలుచున్నాడు. చిరకాల ప్రత్యర్థి నాదల్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మట్టికరిపించి అదే ఉత్సాహంతో వింబుల్డన్‌కు ప్రణాళిక రచించాడు. అనుకున్నట్లుగా  ఒకే సంవత్సరంలో రెండు టైటిళ్లు( ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్) సొంతం చేసుకుని టెన్నిస్ చరిత్రలో తన పేజీని స్థిరపరుచుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల వింబుల్డన్ ఫైనల్లో ప్రత్యర్థి సిలిచ్‌పై ఏకపక్ష విజయం సాధించాడు. వరుస సెట్లలో గెలిచి టైటిల్ సొంతం చేసుకోవడమే కాకుండా, ఎనిమిదో ఫెదర్‌ను తన క్రౌన్‌లో చేర్చుకున్నాడు ఫెదరర్. ఈ ఘనత సాధించిన  తొలి క్రీడాకారుడిగా రికార్డు సృష్టించి రూ.18 కోట్ల 53 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు. ఈ స్ఫూర్తిమంతమైన విజయగాథలోని మైలు రాళ్లు కొన్ని…

federar-path

ఫెదరర్ పనైపోయింది అన్నవారి అంచనాలను తలకిందులు చేస్తూ  వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. కేవలం సొంతం చేసుకోవడమే కాకుండా తనను అందుకునేందుకో గీత గీశాడు. అతి పెద్ద వయస్కుడిగా ఆడి వింబుల్డన్‌లో ఎనిమిదో టైటిల్‌ను కైవసం చేసుకుని  ఆల్‌ఇంగ్లాండ్ క్లబ్‌లో చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ ఫైనల్లో మూడో సీడ్ మారిన్ సిలిచ్( క్రొయేషియా) ను కోలుకోనీయకుండా వరుస సెట్లు గెలుపొంది, టైటిల్ కైవసం చేసుకున్నాడు. గంటా 41 నిమిషాలు సాగిన ఫైనల్లో ఫెదరర్ సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించాడు. ఈ స్విస్ దిగ్గజాన్ని నిలువరించడం సిలిచ్ వల్ల కాలేదు, ఫలితం 36 ఏళ్ల కుర్రాడైన ఫెదరర్ కిరీటంలో ఎనిమిదో వింబుల్డన్ టైటిల్ ఫెదర్ ఇమిడిపోయింది.

ప్రస్థానం
స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ తండ్రి రాబర్ట్ ఫెదరర్, తల్లి లైనెట్ ఫెదరర్ (సౌత్ ఆఫ్రికాకు చెందింది). తల్లి పుట్టిల్లైన సౌత్ ఆఫ్రికా, తండ్రిదైన స్విట్జర్లాండ్ రెండు దేశాల పౌరసత్వం కలిగి ఉన్నాడు. రోమన్ క్యాథలిక్‌గా పెరిగిన ఫెదరర్, అందరు పురుష స్విస్ పౌరుల్లాగానే స్విస్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో నిర్బంధ మిలిటరీ సర్వీస్‌లో చేరాడు. అయితే 2003లో మిలిటరీకి ఫెదరర్ సరిపోడని తీసివేశారు. ఆ తర్వాత సివిల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పనిచేశాడు. దీంట్లో పనిచేస్తున్నందుకు తన ఆదాయంలో మూడు శాతం దానికి చెల్లించాడు. చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ ఆటల్లో రాణించాడు ఫెదరర్. తన తోటి క్రీడాకారిణి అయిన మిర్కా ఫెదరర్‌ను వివాహం చేసుకున్నాడు. సిడ్నీ ఒలింపిక్స్ సమయంలో వీరిద్దరూ స్విస్ తరుఫున ఆడారు. ఫెదరర్‌ను పెళ్లిచేసుకునే కంటే ఏడు సంవత్సరాల ముందు మిర్కా కాలికి గాయం కావడంతో ఆట నుంచి రిటైర్ అయ్యింది. వీరికి 2009లో ట్విన్స్(అమ్మాయిలు) పుట్టారు, తర్వాత 2014లో అబ్బాయిలు ట్విన్స్‌గా పుట్టారు.
టెన్నిస్ కెరీర్
జూనియర్ ప్లేయర్‌గా 1998లో వింబుల్డన్‌లో అడుగుపెట్టి మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐటిఎఫ్ సింగిల్ టోర్నమెంట్లు నాలుగింటిని గెలుచుకున్నాడు. దీంతో పాటు ఆరెంజ్ బౌల్ మ్యాచ్ కూడా గెలిచాడు. అదే సంవత్సరం ప్రొఫెషనల్ గా టోర్నమెంట్‌లో అడుగు పెట్టాడు. మొదటి 100 ర్యాంకింగ్స్‌లోకి 1999లో చేరాడు. అనేక మ్యాచుల్లో పాల్గొన్నా మొదటి సింగిల్స్ విజయం మాత్రం 2001లో నమోదయ్యింది. నాలుగు సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన పీట్ సంప్రాస్‌ను ఓడించి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. అదే సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ ఆండ్రూ అగస్సీతో ఆడి ఓడాడు. మొదటి మాస్టర్ సిరీస్ ఈవెంట్ క్లే కోర్ట్‌లో ఆడి గెలవడంతో టాప్ టెన్ ఆటగాళ్లలోకి దూసుకు పోయాడు. 1998-2002 మధ్య కాలంలో 10 సింగిల్స్ ఫైనల్స్ ఆడాడు, వీటిల్లో నాలుగు గెలవగా, ఆరు ఓడాడు. ఇదే సమయంలో ఆరు డబుల్స్ ఫైనల్స్‌లో ఆడాడు. ఎటిపిలో 13 వ ర్యాంకుతో 2001లో నిలిచాడు. టాప్ 10 ర్యాంకు 2002లో సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ లో 2003లో విక్టరీ సాధించాడు. అక్కడ మొదలైన ప్రస్థానం 2004లో మూడు గ్రాండ్ స్లామ్‌లు గెలిచి వరల్డ్ నెంబర్ వన్‌కు చేరుకున్నది. రెండో వింబుల్డన్ విజయం 2004, 2005, 2006, 2007, 2009, 2012 ల్లో వింబుల్డన్ విజేతగా నిలిచాడు. నాలుగేళ్ల తర్వాత తాజాగా 2017లో రోరింగ్ విక్టరీతో టెన్నిస్‌లో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు.
సామాజిక సేవ
రోజర్ ఫెదరర్ ఫౌండేషన్‌ను 2003లో స్థాపించి ప్రతికూల పరిస్థితులనెదుర్కొంటున్న పిల్లలకు విద్య, క్రీడల్లో పాల్గొనే సౌకర్యం కల్పిస్తున్నాడు. తన తల్లి పుట్టిన ప్రదేశమైన సౌత్‌ఆఫ్రికాలో తన సేవలను మరింత విస్తరించాడు. దీన్లో భాగంగా సౌత్ ఆఫ్రికా స్విస్ ఛారిటీ ఏర్పాటు చేసి పిల్లలను ఆటలు, చదువుల్లో ప్రోత్సహిస్తున్నాడు. తన సంస్థలో శిక్షణ పొందిన చిన్నారులను కలిసేందుకు 2005లో సౌత్ ఆఫ్రికా వెళ్లాడు ఫెదరర్. యుఎస్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన తన రాకెట్‌ను వేలం వేయగా వచ్చిన సొమ్మును హరికేన్ కత్రినా తుపాను బాధితు లకు విరాళంగా అందించాడు. ఇండియన్ ఓషన్‌లో ఏర్పడిన సునామీ బాధితుల సహాయార్థం టాప్ ప్లేయర్లతో కలిసి ర్యాలీ ఫర్ రిలీఫ్ చేపట్టాడు. దీన్లో భాగంగా 2006లో తమిళనాడుకు కూడా వచ్చాడు. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించ బడి, ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తున్నాడు. హయతీ భూకంప బాధితుల సహాయార్థం ఛారిటీ ఈవెంట్ చేశాడు.
ఫోర్బ్ జాబితాలో
క్వీన్స్‌లాండ్ ఫ్లడ్స్ సమయంలో కూడా స్పందించాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకా రుల్లో ఫెదరర్‌ది నాలుగో స్థానం(ఫోర్బ్). ప్రతి సంవత్సరం ప్రైజ్ మనీగా పొందే, పదుల సంఖ్యలో ఉన్న అడ్వర్‌టైజ్‌మెంట్ డీల్స్ వల్ల 40-50 మిలియన్ల యూరోలు సంపాదిస్తాడు.
అవార్డులు
ఎటిపి వరల్డ్‌టూర్ డాట్ కామ్ ఫ్యాన్స్ ఫేవరేట్ అవార్డ్‌ను 2003 నుంచి 2014 వరకు వరసగా పొందాడు. స్టీఫెన్ ఎడ్బర్గ్ స్పోర్ట్ మ్యాన్‌షిప్ అవార్డ్‌ను వరుసగా 12 సార్లు (2004-2009 వరకు తిరిగి 2011-2016 వరకు) గెలుచుకు న్నాడు. ఈ రెండు అవార్డులు గౌరవాన్ని, పాపులారిటీని సూచిస్తాయి.
ఆర్థర్ యాషే హ్యుమానిటే రియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్‌ను రెండు సార్లు (2006,2013). లారస్ వరల్డ్ స్పోర్ట్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గా వరుసగా నాలుగు సంవత్సరాలు పేరు పొందాడు. గ్రేటర్ మేల్, ఫీమేల్ టెన్నిస్ ప్లేయర్ ఎవర్ గా ఇఎస్‌పిఎన్ ర్యాంక్ పొందాడు. ఈ ఏడు ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఫెదరర్‌ను గ్రేట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైంగా జాన్ మెకెన్రో అభిప్రాయపడ్డాడు.

అదరహో…

  • ఇప్పటివరకు ఫెదరర్ సాధించిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్ల సంఖ్య 19
  • ఆటలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రెండు, అవి 2007,1017 ల్లో. ఇది 1976 లో జాన్ బోర్గ్ సాధించాడు.
  • ఇప్పటివరకు ఫెదరర్ సాధించిన విజయాలు 1111.
  • ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల సంఖ్య 102.
  • వింబుల్డన్ పురుషుల సింగిల్స్ గెలిచిన పెద్ద వయస్కుడిగా ఫెదరర్ చరిత్ర సృష్టించాడు.

9వ వింబుల్డన్ నా ‘గోల్’

వింబుల్డన్ ఆడక అయిదేళ్ళయినా నాలో స్పిరిట్ మిగిలే ఉంది. ఎప్పటికైనా మరోసారి వింబుల్డన్ చేజిక్కించుకుంటానన్న ఆశ సజీవంగానే ఉంది. ఆ నమ్మకమే నన్ను ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్‌ను గెలిపించేలా చేసింది. నాకున్న నమ్మకమే నా టీమ్‌కు కూడా ఉండడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. వింబుల్డన్ ఇంత కాలం ఆడగలగడం నా అదృష్టం. పెద్దల దీవెన అంటాడు ఫెడరర్. 19 సార్లు గ్రాండ్‌స్లామ్ విక్టరీలు సాధించి రాఫెల్ నాడల్ 15 విక్టరీల రికార్డును చెరిపేయగలగడం ఆనందంగా ఉంది. కాలి గాయం, సుదీర్ఘకాలం ప్రాక్టీస్‌కు దూరంగా ఉండడం వంటి ఆటంకాలున్నాయి. నాలోని పట్టుదల వెనక్కి తగ్గలేదు. అయినా ఎందుకైనా మంచిదని 2016లో కూడా అవకాశం వచ్చినా కాలిగాయం నేపథ్యంలో ఆడలేక వదులుకున్నాను. ఈ స్థితిలో రెండు గ్రాండ్‌స్లామ్‌లు సాధించగలనా..అన్న బెరుకు నాలో ఉండేది. లోలోపల నమ్మకం ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేనందున బైటికి ధైర్యంగా చెప్పలేకపోయాను. ఈ మాట బైటికి అని ఉంటే అంతా పగలబడి నవ్వేవారు. అనుకున్నది సాధించాక ఇప్పుడు మీ ముందు ఇలా కాన్షిడెంట్‌గా నిలబడగలుగుతున్నాను. ఈ తాజా విజయంతో వరల్డ్ ర్యాంకింగ్‌లో మూడోస్థానానికి చేరుకున్నాను. 3 దశాబ్దాలు దాటినా తరగని ఉత్సాహంతో ఉన్నాను. వీలైతే 9వ వింబుల్డన్‌ను కూడా గెలవాలని కోరుకుంటున్నాను. అదే గోల్‌గా నిర్దేశించుకున్నాను.

– ఫెదరర్