Home స్కోర్ విజేత ఫెదరర్

విజేత ఫెదరర్

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సిలిక్ ఓటమి, బోపన్న జంటకు రన్నరప్

రోజర్ @ 20
స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కెరీర్‌లో ఇది 20వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. ప్రపంచంలో మరే ఆటగాడు కూడా సింగిల్స్‌లో ఇన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించలేదు. అంతేగాక, కెరీర్‌లో ఆరో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. ఇంతకు ముందు నొవాక్ జొకొవిచ్ (సెర్బియా), రాడ్ లెవర్ (ఆస్ట్రేలియా)లు మాత్రమే ఇన్నేసి టైటిల్స్ సాధించారు. తాజాగా ఈ దిగ్గజాల సరసన ఫెదరర్ నిలిచాడు. కాగా, కిందటి ఏడాది కూడా ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచాడు. అంతకుముందు 2004, 2006, 2007, 2010లలో కూడా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఇదిలావుండగా ఫెదరర్ ఇప్పటి వరకు 20 టైటిల్స్ తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఇందులో అత్యధికంగా 8 వింబుల్డన్ టైటిల్స్ ఉన్నాయి. తర్వాతి స్థానం ఆస్ట్రేలియా ఓపెన్‌దే. ఇక ఐదుసార్లు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించాడు. కాగా, ఒకసారి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. కాగా, ప్రపంచ టెన్నిస్‌లో ఫెదరర్ దరిదాపుల్లో మరే ఆటగాడు కనిపించడం లేదు. స్పెయిన్ యోధుడు రఫెల్ నాదల్ పోటీలో ఉన్నా ఫెదరర్ రికార్డును బద్దలు కొట్టడం అతనికే కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. జొకొవిచ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వరుస గాయాలు వీరిద్దరిని వెంటాడుతున్నాయి. దీంతో ఫెదరర్ సాధించిన రికార్డు టెన్నిస్ చరిత్రలో చిరకాలం చెక్కు చెదరకుండా ఉండడం ఖాయమని చెప్పవచ్చు.

Tennis

మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ ఫెదరర్ 62, 67, 63, 61 తేడాతో క్రొయేసియా స్టార్, ఆరోసీడ్ మారిన్ సిలిక్‌ను చిత్తు చేశాడు. ఫెదరర్‌కు ఇది ఆరో ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. ఒవరాల్‌గా ఫెదరర్ గెలుచుకున్న 20వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ ఇది. కాగా, కిందటి ఏడాది కూడా ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. కాగా, సిలిక్‌తో జరిగిన టైటిల్ సమరంలో స్విస్ స్టార్ ఫెదరర్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ప్రారంభం నుంచే ఫెదరర్ దూకుడుగా ఆడాడు. చూడచక్కని షాట్లతో సిలిక్‌ను హడలెత్తించాడు. తనకు మాత్రమే ప్రత్యేకమైన షాట్లతో చెలరేగిన ఫెదరర్ పెద్దగా చెమటోడ్చకుండానే మొదటి సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్‌లో సిలిక్ దూకుడును పెంచాడు. అసాధారణ పోరాట పటిమతో ఫెదరర్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. కళ్లు చెదిరే షాట్లతో స్విస్ దిగ్గజాన్ని బెంబెలెత్తించాడు. అయితే ఫెదరర్ కూడా పట్టు వదలకుండా పోరాడాడు. ఇద్దరు కూడా సర్వం ఒడ్డడంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. అయితే ఇందులో సిలిక్ పైచేయి సాధించాడు. అంతేగాక 76తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ, మూడో సెట్‌లో మళ్లీ ఒత్తిడికి గురయ్యాడు. ఈసారి ఫెదరర్ మరింత దూకుడుగా ఆడాడు. సిలిక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాడు. ఫెదరర్ కళ్లు చెదిరే షాట్లతో సిలిక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మరోవైపు తీవ్ర ఒత్తిడిలో ఆడిన సిలిక్ వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఫెదరర్ సఫలమయ్యాడు. అద్భుత షాట్లతో అలరించిన స్విస్ దిగ్గజం సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక, నాలుగో సెట్‌లో ఫెదరర్‌కు కనీస పోటీని కూడా ఇవ్వడంలో సిలిక్ విఫలమయ్యాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఫెదరర్ సులువుగా సెట్‌ను సొంతం చేసుకుని తన ఖాతాలో ఆరో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మరోవైపు తన కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని భావించిన సిలిక్ రన్నరప్‌తో సరిపెట్టుకోక తప్పలేదు.
బోపన్న జోడీకి రన్నరప్…
ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో లో రోహన్ బోపన్న(భారత్) జంట రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్నతిమియా బాబోస్ (హంగేరి) జంట ఫైనల్లో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 8వ సీడ్ గాబ్రియెలా డబ్రొస్కి (కెనడా), మాట్ పావిక్ (క్రొయేసియా) చేతిలో బోపన్న జంట పరాజయం చవిచూసింది. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో పావిక్ జంట 26, 64, 119తో బోపన్న జోడీని ఓడించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న బోపన్నబాబోస్‌లు తర్వాతి సెట్‌లో కంగుతిన్నారు. నువ్వానేనా అన్నట్టు సాగిన మూడో సెట్‌లో విజయం కోసం చివరి వరకు ప్రతయ్నించినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో ఒత్తిడికి గురి కావడంతో ఓటమి తప్పలేదు.