Home స్కోర్ ప్రతీకారం కోసం భారత్

ప్రతీకారం కోసం భారత్

నేడు లంకతో కీలక పోరు, ముక్కోణపు టోర్నీ

ind

కొలంబో: ముక్కోణపు ట్వంటీ20 టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగే కీలక మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య శ్రీలంక జట్టుతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్షంతో టీమిండియా ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో అనూహ్య ఓటమి పాలైన లంకకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన లంక ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు తహతహలాడుతోంది. అయితే రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా జోరుమీదుంది. అంతేగాక తొలి మ్యాచ్‌లో తమను ఓడించిన లంకపై బదులు తీర్చుకునేందుకు అతృతతో ఎదురు చూస్తోంది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో ఈ పోరు కూడా హోరాహోరీగా సాగడం ఖాయం. కాగా టోర్నీలో భాగంగా ఇప్పటివరకు మూడు మ్యాచులు జరిగాయి. ఇందులో శ్రీలంక, భారత్, బంగ్లాదేశ్ ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా ఈ మ్యాచ్‌లోనూ కూడా గెలిచి ఫైనల్ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనే లక్షంతో ఇరు జట్లు ఉన్నాయి. కాగా, చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన జట్టుకే విజయం వరిస్తుందని చెప్పక తప్పదు.
తీరు మారాలి…
మిగతా బ్యాట్స్‌మెన్ కూడా తమ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా తన బ్యాట్‌కు పదును పెట్టక తప్పదు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ రైనా విఫలమయ్యాడు. ఈ సారైన తన రైనా మెరుగ్గా ఆడాల్సి ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన రైనా వైఫల్యం భారత్‌కు ప్రతికూలంగా మారింది. యువ ఆటగాళ్లతో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో వరుస వైఫల్యాలు చవిచూస్తే తుది జట్టులో స్థానం కాపాడుకోవడం చాలా కష్టం. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు రైనా సిద్ధమయ్యాడు. కాగా, మనీష్ పాండే నిలకడగా రాణిస్తున్నా అతని బ్యాటింగ్‌లో మెరుపులు ఉండడం లేదు. పొట్టి ఫార్మాట్‌కు అనుగుణంగా వేగంగా ఆడడంలో మనీష్ విఫలమవుతున్నాడనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కాస్త వేగంగా ఆడాల్సిన అవసరం అతనిపై ఉంది. అంతేగాక యువ ఆటగాడు రిషబ్ పంత్ రెండు మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. ధోని వరసుడిగా పరిగణిస్తున్న పంత్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. కనీసం ఈ మ్యాచ్‌లోనైన తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోక తప్పదు. లేకుంటే టీమిండియాలో చోటు కాపాడుకోవడం చాలా కష్టం. ఇక, విజయ్ శంకర్, దినేష్ కార్తీక్‌లు కూడా మెరుగ్గా ఆడాల్సి ఉంది. ముఖ్యంగా దినేష్ తన బ్యాట్‌కు పనిచెప్పక తప్పదు. ఇక, బౌలింగ్‌లో కూడా భారత్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్క వాషింగ్టన్ సుందర్ తప్ప మిగతావారు అంతంత మాత్రంగానే రాణిస్తున్నారు. విజయ్ శంకర్, శార్దూల్ ఠాకూర్, జైదేవ్ ఉనద్కట్ వంటి యువ బౌలర్లు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. పొదుపుగా బౌలింగ్ చేయడంలో వారు విఫలమవుతున్నారు. అంతేగాక కీలక సమయంలో వికెట్లు తీయలేక పోతున్నారు. కీలక బౌలర్ చాహల్ కూడా సత్తా చాటలేక పోతున్నాడు. అతని వైఫల్యం వల్లే తొలి మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైన చాహల్ మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
గెలుపే లక్షంగా…
మరోవైపు తొలి మ్యాచ్‌లో భారత్‌ను చిత్తు చేసిన శ్రీలంక ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇందులోనూ టీమిండియాను ఓడించి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది. అయితే రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో అనూహ్యంగా ఓడిన లంకకు ఈ మ్యాచ చాలా కీలకంగా మారింది. బౌలర్ల వైఫల్యం జట్టును కలవర పెడుతోంది. బంగ్లాపై 214 పరుగులు సాధించినా ఫలితం లేకుండా పోయింది. బౌలర్ల వైఫల్యంతో బంగ్లాదేశ్ ఈ భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఈసారి కూడా లంకకు ఓటమి భయం పట్టుకుంది. కిందటి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారత్ పోరుకు సిద్ధహైంది. దీంతో భారత్‌ను ఎలా కట్టడి చేయాలో లంకకు అంతుబట్టకుండా మారింది. అ యితే కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్‌లో భీకర ఫాంలో ఉండ డం లంకకు ఊరటనిచ్చే అంశం. భారత్‌పై పెరీరా మెరుపు ఇ న్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మెండిస్ కూడా జోరుమీదున్నాడు. కెప్టెన్ చండీమల్, మాజీ కెప్టెన్ ఉపుల్ తరంగ, గుణతిలక, తిసారా పెరీరా తదితరులతో లంక చాలా బలంగా ఉంది. దీంతో భారత్‌కు గట్టి పోటీ ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

రోహిత్‌కు పరీక్ష!

rohit

వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో కూడా రోహిత్ విఫలమైన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ తర్వాతి మ్యాచ్‌లో కూడా నిరాశ పరిచాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో రోహిత్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. అతని వైఫల్యాలపై మాజీ క్రికెటర్లు, నెటిజన్లు, అభిమానులు సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వీరి విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పేందుకు రోహిత్ సిద్ధమయ్యాడు. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. తరచు విఫలమవుతున్నా రోహిత్ గుణపాఠం నేర్చుకోవడం లేదు. ప్రతి మ్యాచ్‌లోనూ నిర్లక్షంగా ఆడుతూ వికెట్‌ను పారేసుకుంటున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైన మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇందులో కూడా విఫలమైతే రానున్న రోజుల్లో రోహిత్ కష్టాలు పెరగడం ఖాయం. మరోవైపు శిఖర్ భీకర ఫాంలో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. రెండు మ్యాచుల్లో కూడా ధావన్ మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ధావన్ రాణిస్తే జట్టుకు మరోసారి భారీ స్కోరు ఖాయం.

జట్ల వివరాలు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), లోకేష్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, చాహల్, అక్షర్ పటేల్, విజయ్ శంకర్, శార్దూల్ ఠాకూర్, జైదేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్.
శ్రీలంక: దినేష్ చండీమల్ (కెప్టెన్), ఉపుల్ తరంగ, దనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్, దాసున్ శనక, కుశాల్ పెరీరా, జీవన్ మెండిస్, సురంగ లక్మల్, ఇసురు ఉడనా, అకిల ధనంజయ, అమిలా అపొన్సొ, నువాన్ ప్రదీప్, దుష్మంత చమీరాచమీరా, ధనంజయ డిసిల్వా, తిసారా పెరీరా.