Search
Wednesday 19 September 2018
  • :
  • :

పంచాయతీ ఎన్నికలపై గులాబీ నజర్

Rose nose on the panchayat election

మెజారిటీ సర్పంచ్‌లు ఏకగ్రీవంపై మంత్రి దృష్టి
ఎమ్మెల్యేలు సైతం ముమ్ముర ప్రయత్నాలు
గులాబీ దళంలోకి కొనసాగుతున్న వలసలు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా : పంచాయతీ ఎన్నికలలో సత్తాచాటడానికి గులాబీ దళం సిద్ధమవుతుంది. పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలలో మనోధైర్యం దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పంచాయతీ ఎన్నికలు వస్తుండటంతో సిట్టింగ్ శాసనసభ్యులతో పాటు టికెట్ కోసం క్యూలైన్‌లో ఉన్న ఆశావహులకు సైతం పంచాయతీ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. ఇటీవల పలు సర్వేలలో జిల్లాలోని పలువురు గులాబీ ఎమ్మెల్యేలు వెనకబడుతున్నారని వచ్చిన లీక్‌లు ఎమ్మెల్యేలను మరింత జాగ్రత్త పడకపోతే భవిష్యత్ కష్టం అన్న భావన కలుగడంతో తెల్లవారక ముందు నుంచే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలకు గాను మెజారిటీ గ్రామ పంచాయతీలు ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గంలో అధిక స్థానాలకు గెలుచుకోవడానికి స్థానిక నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. తండాలను పంచాయతీలుగా మార్చడంతో ఇక్కడ అధిక పంచాయతీలు ఏర్పాటు కావడంతో మెజారిటీ తండాలను కైవసం చేసుకోవాలన్న లక్షంతో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో పాటు నేతలు ఈర్లపల్లి శంకర్ తదితరులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కల్వకుర్తి, మహేశ్వరం, ఇబ్రహింపట్నం, చేవెళ్ళ, రాజేంద్రనగర్ నియోజకవర్గాలలో సైతం ఎమ్మెల్యేలు పంచాయతీలలో పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తూ కాంగ్రెస్, టిడిపి, బిజెపి నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. పంచాయతీ రిజర్వేషన్‌లు ప్రకటించేలోపు ప్రతి గ్రామంలో పర్యటించడంతో పాటు రిజర్వేషన్ ఎలా వచ్చినా దీటైన అభ్యర్దిని రంగంలోకి దించడానికి కావలసిన కసరత్తు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల తరపున రంగంలోకి దిగే నేతలను గుర్తించి వారిని తమ పార్టీలో చేర్చుకోవడానికి కొన్ని నియోజకవర్గాలో ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దిగి పనిచేస్తున్నాయి. తండాలను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా జిల్లాలో మెజారిటీ స్థానాలను తమ ఖాతాల్లో వేసుకోవడానికి అవకాశం ఉంటుందని గ్రహించి పథకం ప్రకారం ముందుకు సాగుతున్నారు. తండాలలో ఇతర పార్టీలకు అభ్యర్థులను లేకుండా చేయడం…ఉన్న వారిని సైతం తమ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం పెద్ద ఎత్తున చేస్తున్నారు. షాద్‌నగర్, మేడ్చల్, ఇబ్రహింపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి.

మంత్రి ధాటికి…
వికారాబాద్ జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డి గత కొన్ని రోజులుగా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తాండూర్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతి పంచాయతీలో స్వయంగా తిరిగి పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వర్గపోరుతో డీలాపడ్డ కాంగ్రెస్, టిడిపి క్యాడర్‌లను గ్రామాల్లో పూర్తిగా తమ పార్టీలో చేర్చుకుంటూ ప్రతిపక్షాలకు షాక్ ఇస్తున్నారు. గత నెల రోజులుగా మంత్రి మహేందర్ రెడ్డి ఒక్కో రోజు కనీసం 10, – 15 గ్రామాల్లో తిరుగుతుండటంతో పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు ఎస్టీ రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆయా గ్రామాలలో మెజారీటి నేతలను తమ పార్టీలోకి చేర్చుకుని సర్పంచ్ స్థానాలకు దాదాపుగా ఎకగ్రీవం చేయడానికి కావలసిన కసరత్తును పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చిన మెజారీటి సర్పంచ్ స్థానాలు తాండూర్‌లో ఎకగ్రీవం కానున్నాయని ప్రచారం జరుగుతుంది. కొడంగల్, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలో సైతం ఆదే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Comments

comments