Home జాతీయ వార్తలు సిద్ధరామయ్య పొగరుబోతు.. వేణుగోపాల్ బఫూన్

సిద్ధరామయ్య పొగరుబోతు.. వేణుగోపాల్ బఫూన్

 

 కన్నడ కాంగ్రెస్ నాయకత్వంపై సీనియర్ నేత బేగ్ సంచలన వ్యాఖ్యలు
 ఖండించిన డిప్యూటీ సిఎం పరమేశ్వర

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోషన్ బేగ్ రాష్ట్ర నాయకత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీట్ల కేటాయింపు విషయంలో మైనార్టీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. మంత్రులకు శాఖలను అమ్ముకున్నారని సొంతపార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి కెసి వేణుగోపాల్ బఫూన్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం రోషన్ బేగ్ విలేకరులతో మాట్లాడుతూ సిద్ధరామయ్య పొగరుబోతు అని మండిపడ్డారు. ఇక మరో నేత గుండు రావు ఫ్లాప్ షో కారణంగా ఫలితాలు దారుణంగా రాబోతున్నాయని ఎగ్జిట్‌పోల్స్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీని క్షమాపణలు కోరుతున్నానని, క్రిస్టియన్లకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని, ముస్లింలకు ఒకే ఒక్క సీటు కేటాయించారన్నారు. ప్రభుత్వం ఉంటుందో పోతుందోనని కుమారస్వామి భయపడుతుతన్నారని, ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తాను ముఖ్యమంత్రిని కాబోతున్నానంటూ సిద్ధరామయ్య చెప్పుకుంటున్నారని రోషన్ పేర్కొన్నారు.
కాగా బేగ్ వ్యాఖ్యలపై డిప్యూటీ సిఎం, కాంగ్రెస్ నేత జి. పరమేశ్వర స్పందించారు. ఇది పూర్తిగా బేగ్ వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. ఆయన ఆశించిన బెంగళూరు టికెట్ దక్కకపోవడంతో ఈవిధంగా మాట్లాడుతున్నారన్నారు. సీనియర్ నేత అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదన్నారు.

Roshan baig criticism to Siddaramaiah