Home ఎడిటోరియల్ ఆంధ్రా మీడియా.. కురసోవాలు

ఆంధ్రా మీడియా.. కురసోవాలు

catoon-image
రోషోమాన్ అని వొక ఫేమస్ సినిమా వుంది తెలుసా.? అకిరా కురసోవా అనే గొప్ప దర్శకుడు తీసిండు దాన్ని. జపాన్ కథాంశంతో నడిచే ఆ సినిమాలోని 24 క్రాఫ్టులు ఇప్పటికీ నూతన దర్శకులకు పాఠాలు నేర్పుతున్నయి. ఈ సినిమాలోని కథాంశం దాన్ని స్క్రీన్ మీద విజువలైజ్ చేసిన తీరు..తో ఆ సినిమా సెల్యులాయిడ్ ఫిలాసఫీగా నిలిచిపోయింది.
కండ్లద్దాలు లేకుంటనే ఫోర్ ఢీ ఎపెక్టు చూయిస్తదీ సినిమా.. అదేందీ…కండ్లద్దాలు పెట్టుకోని త్రీడి సినిమా చూసినం గని ఈ ఫోర్ డీ యేంది..అందునా కండ్లద్దాలు లేకుంట యేంది.? అని అనుకుంటున్నరా,,..? అదే ఈ సినిమా ప్రత్యేకత. ప్రత్యేక కండ్లద్దాలతోని కండ్లకు కనిపించే మూడో డైమన్షన్‌ను మాత్రమే చూడగలం.. త్రీడీ సినిమాల్లో., కానీ ఈ దర్శకుడు బ్లాక్ అండ్ వైట్లోనే నాలుగో డైమన్షన్ చూయిస్తడు.
అదీ..బొమ్మల ద్వారా కాదు.. కథ ద్వారా.
బొమ్మలు టూ డైమన్షన్లనే కనిపిస్తయి కని వాటి నడుమ నడిచే కథే నాలుగు తీర్ల అర్థమయిద్ది ప్రేక్షకునికి.
కథ అంటే వొకటే .. కనిపించేదె వాస్తవం అని మనం అనుకుంటం గద… కని.. ఈ దర్శకుడు ఆ అభిప్రాయాన్ని బద్దలు చేసిండు. కథ వొకటే కావచ్చు…కానీ మీరు అర్థం చేసుకునే వాస్తవం మాత్రం వొకటి మాత్రమే కాదు. వొకే కథకు నాలుగు వాస్తవాలుంటయి అని.. వొకటే కథకు నాలుగు తీర్ల అర్థాలు చూయిస్తడు ది గ్రేట్ డైరెక్టర్ అకిరా కురసోవా.
అంటే..కథ వొకటే. శుభం కార్డు పడేటాలకు నాలుగు తీర్ల అర్థమయిద్దన్నట్టు…యెవలి అర్థం వాల్లు తీస్కోవాలె ప్రేక్షకులే. అయితే అసలు వాస్తవమేది అనేది మాత్రం దర్శకుడు కురసోవా కూడా చెప్పడు. అదీ రోషోమాన్ అనే సినిమా సంగతి.
ఐతే..
ఇప్పుడెందుకు ఆ ముచ్చెట అంటరా…
అక్కడికే వస్తున్న.
తెలుగు పేరుతో నడుస్తున్న ఆంధ్రా పక్షపాత తెగులు పత్రికలు కొన్ని రాస్తున్న రాతలు వండుతున్న కథనాలు… ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన వార్తా కథనాల పేరుతో వీరు పడుతున్న కతలు…రోషోమాన్ సినిమాను మించి కురసోవా దర్శకత్వాన్ని దాటి పోతున్నయి. అసలు వాస్తవాన్ని దాచిపెట్టి తమకు అనుకూలమైన డైమన్షన్ను యెట్లా చూయించాలనేది…రోషోమానే గనుక బతికి వుండి వుంటే వీల్ల కాడికే వచ్చి నేర్చుకును…అనేంతగా విజృంభిస్తున్నరు.
విషయానికి వస్తే…
యాదగిరిగుట్టలో వ్యభిచారం అని వార్త పేరుతో ఆంధ్రా మీడియా రాసి అచ్చేసిన ఫోర్త్ డైమెన్షన్ కథనాన్ని వొకపాలి పరిశీలిస్తే మనకు వారి ప్రతిభ ఎంతగొప్పదో అర్థం కాక తప్పదు.
ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల ఇప్పటికీ కొనసాగుతున్న ఇస్మంటి దందాలను దాచిపెడుతున్నరు.. వోకే.. సరే అది వాల్లిష్టం అని అనుకుందాం.
మరి మన యాదగిరిగుట్టలో కూకటి వేల్లతో పెకలిస్తున్న పాడు వృత్తిని మాత్రం వాస్తవాలను దాచి దుష్ప్రచారం చేయాలని సూస్తున్నరు.? అని మీరు అడుగుతున్నరా..?
సరే ..మీడియాకనుక…వాల్లకు ప్రపంచం మీది ఎక్కడి వార్తనయినా రాసే హక్కు వుంది కాబట్టి రాసిన్రేమో…అని మల్లా అనుకుందాం.
రాస్తే రాసిన్రు కానీ … అడ్డగోలుగ ఎట్ల రాస్తరు.? వార్తను దానిలోని వాస్తవాన్ని ..దాని వెనక వున్న చరిత్రను…మొత్తంగా ఆ వ్యవహారం యొక్క పూర్వాపరాలను పర్యవసానాలను రాయలెగని…అట్లెట్ల రాస్తరు తెలంగాణను బదునాం చేసేటట్లు.? అని మల్లా వో ప్రశ్న అడుగుతున్నరా..?
అగో అందికే …వీల్లను మీడియా రోషోమాన్లు అన్నది.
వీల్లు మామూలు ఎడిటర్లయితే…
వాస్తవాన్ని మీరన్నట్టు వాస్తవంగనే చూయిస్తరు.
వాల్లు జపాన్ రోషోమాన్ ను మించిన ఆంధ్రా మీడియా రోషోమాన్లు కావట్టే .. వాస్తవాన్నిసూటిగా చెప్పకుండా..వాల్లకిష్టమున్న డైమన్షన్ను మాత్రమే చూయిస్తరు వాస్తవ విరుద్ధంగా..
వాస్తవం వాస్తవం కాదు అది నీను చెప్పినట్టు మాత్రమే వుంటుది..అని జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నరీల్లు.
యాదగిరిగుట్టలో నడిచింది.. వలస పాలన ప్రోద్బలంతో దశాబ్దాల కాలంగా కొనసాగుతూ మర్రి వూడల్లా పాతుక పోయిన ఆంధ్రా ప్రేరేపిత వ్యభిచార వృత్తి అనే సంగతి జగమెరిగిన సత్యం. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి..వొక వాస్తవాన్ని వారి కురస బుద్ధితో వక్రీకరించిన్రు.వాటి ఫలితమే గత రొండు మూడు రోజులుగా ఆంధ్రా పత్రికల్లో అచ్చయిన బ్యానర్ అయిటంలు. అట్లా వాల్లు అర్తసత్యాలను అచ్చేస్తూ..మన ఆలోచనలను మల్లిస్తూ..తెలంగాణ మెదల్ల మీద థాట్ పోలీసింగ్ చేస్తూ వారి మీడియా కిరాతకాలను రెట్టింపు చేస్తున్నరు. తెలంగాణ ప్రభను తగ్గిద్దామనే కుయుక్తులకు పాల్పడుతున్నరు.కసితో రగిలిపోతున్నరు.
కని వాస్తవం వాస్తవమే..కదా ఎన్నటికైనా బయటపడుతది కదా..
ఇట్లా చెప్పుకుంటపోతే వొక యాదగిరిగుట్ట మీదనే కాదు తెలంగాణకు వ్యతిరేకంగా వీల్లు కక్కుతున్న విషం గుట్టలకు గుట్టలు పోగుపడుతనే వున్నది.
మొన్నా నడుమ తెలంగాణలో చేపల పెంపకం అనే కార్యక్రమాన్ని తక్కువ చేయడానికి, ఆంధ్రా చేపల వ్యాపారులకు తెలంగాణలో వుండి దొంగ సద్దులు మోద్దానికి వొక అసంబద్ధమైన కథనాన్ని యెవరికీ కనిపించని డైమెన్షన్లో కనిపెట్టి అచ్చేసిండ్రు. కానీ ఇటువంటి ఆంధ్రా కురుస’(సోవా) బుద్ధులను ఎప్పటికప్పడు వాచ్ డాగులై కనిపెడుతున్న తెలంగాణ సోషల్ మీడియా యాక్టివిస్టులు వీరి కుయుక్తులను తిప్పిబండకు కొట్టిన్రు. అసలు సిసలు వాస్తవ కోణమేందో, వార్తా కథనం మాటున దాగివుండి ఆయా ఆంధ్రా పక్షపాత పత్రికలు రాస్తున్న దుర్మార్గపు కోణమేందో, ప్రజలకు హంసల మాదిరి తేటతెల్లం చేస్తనే వున్నరు. చేపల కథ అట్ల ముగిసిందో లేదో.. తీర్థాల్లో వ్యర్ధాలు అంటూ తెలంగాణ దేవుని గుల్ల మీద పడి ఆగం చేయచూసిన్రు.. దాన్ని తిప్పికొట్టినం. అదట్ల వాసన కూడా పోలేదు..ఇగో ఇప్పుడు యాదాద్రిలో వ్యభిచారం అంటూ…వాస్తవా చరిత్రను దాచిపెట్టి వొక తప్పుడు యాంగిల్ ను జత చేసి తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నరు.
వీరి కురసోవా డైమన్షన్లు వొక వార్తలు వార్తాకథనాలకే పరిమితం కాలేదు.. ఎడిట్ పేజీ ఆర్టికల్లను కూడా ఆక్రమిస్తున్నయి. వీరి దర్శకత్వ ప్రతిభ ఎంత విశృంఖలంగా సాగుతున్నదంటే…అసలు తెలంగాణకు సంబంధేని లేని అంశాలను మొదలు పెట్టి అటు ఇటు తిప్పి ఆఖరుకు తెలంగాణకు ముడిపెట్టి..వొక తప్పుతీసి దాన్ని తెలంగాణకు అతుకుపెడుతూ తమ అక్కసును వెల్లగక్కుతున్నరు. వాస్తవ విరుద్దమైన ముగింపులతో జనాలను అయోమయానికి గురిచేసే కతల పడుతున్నరు.
స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ఘనతను తెలుగు’ ముసుగున అంటగట్టడం చేస్తున్నరు. యేదయినా కొంచెం మంచి జరిగిందనిపిస్తే దాన్ని కేవలం ఆంధ్రా పేరుతో పరిమితం చేయడం వంటి అనేక థాట్ పోలీసింగ్ కుయుక్తలకు వొడిగడుతున్నరు. తెలంగాణను తెర్లు చేసే కుట్రలతో, ఆంధ్రా ప్రభుత్వాన్ని హైద్రాబాద్‌లో వుంటూ నిస్సిగ్గుగా నెత్తికెత్తుకుంటున్నది వీరీ కురస(సోవా)బుద్ది.
వీరెంత బాధ్యతారాహిత్యపు భయం లేని జీవులనేది నిత్యం ప్రసారమౌతున్న వీరి వార్తలను గమనిస్తే అర్థమయితది. ఉదాహరణకు.. “ఫలనా కాడికి బయలు దేరిన ముఖ్యమంత్రి..”… “ఫలానా ఆదేశాలు జారిచేసిన ముఖ్యమంత్రి…” అంటూ స్క్రోలింగులు వదులుతరు.. యే ముఖ్యమంత్రి కావచ్చు అని వీల్ల సచ్చు ఛానల్లను బలవంతంగా భరిస్తున్న తెలంగాణ ప్రేక్షకుడు పదినిమిషాలు పరీక్షపట్టి చూస్తే గానీ అర్థం కావట్లేదు..అది ఆంధ్ర ముఖ్యమంత్రి వార్త అని. ఆట్లా ..ఆంధ్రా ముఖ్యమంత్రిని తెచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసే థాట్ పోలీసింగ్ స్క్రోలింగులు..ఫోర్త్ డైమెన్షన్ సినిమా వార్తలను వండుతున్నరీ కురుసోవాలు.
తెలంగాణ ప్రజలను నాయకత్వాన్ని ఎడ్డోల్లను చేసి అరువయేండ్లనుంచి తెలంగాణను అక్రమంగా ఆక్రమించుకోని అవాస్తవాలను ఆధారం చేసుకోని బతికిన్రిన్నాల్లు. సొంత పేపర్లు ఛానల్లతోని మనతోని మైండ్ గేములను ఆడిన్రు. మనలను మనకు గాకుంటా చేసి ..మన చరిత్రను మనకు దూరం చేసి..మనం వాస్తవం అనుకున్నదాన్ని అవాస్తవంగా అవాస్తవాన్ని వాస్తవంగా..మనకు పనికొచ్చే సత్యాన్ని అర్థసత్యాలుగా వాల్ల అర్తసత్యాలను సత్యాలుగా చిత్రీకరించిన్రు. తీరొక్క డైమన్షన్లో కతలు కథనాలను అల్లీ అల్లీ మన మీద రుద్దీ రుద్దీ..అది రుద్దీ ఇది రుద్దీ ఇదే మన అభిరుద్ది అని చూయిస్తూ.. కురసోవాను మించిన దర్శకత్వ ప్రతిభతో ఎడిటింగ్ మెలకువలతో వాస్తవాలన్నిటినీ కప్పి పెట్టిన్రిన్నాల్లు.
ఎన్నాల్లు దాపెడుతరు ఎవరైనా వాస్తవాన్ని.? పాపం పండింది తెలంగాణ వచ్చింది. చింత చచ్చినా పులుపు సావలేదన్నట్టు..వాల్ల కంపు వాసనను తెలంగాణ ల జేరి వెదజల్లుతనే వున్నరు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు తెలంగాణనుంచి ఖాళీ చేసి వెల్లిపోవాల్సిన యీ ఆంధ్రమీడియా కురసోవాలు మీము మహాగొప్పగా వెలుగుతున్నాము అంటూ ప్రగల్బాలకు పోతున్నరు.
ఆరిపోయే దీపం గొప్పగా వెలుగుతున్నపుడు..సామాన్యునికి అది గొప్ప వెలుగునిస్తుంది అని అనిపిస్తది..కానీ దాని మూలం తెలిసినవానికి మాత్రం అది ఆరిపోయే దీపం ..కావట్టే ఆఖరి వెలుగును ఎక్కువగా పంచుతున్నది అని అర్తమయితది..కదా. అదే సూత్రం ప్రకారం..వీరి విర్రవీగుడంతా.. పోత పోత వొక ఆరిపోయే దీపం వెలిగే వొక వెలుగు అని తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమైతున్నది.
ఈ కుహనా ఆంధ్రా కురసోవాలు యెట్ల తిప్పి చూయించినా…డ్రమ్ములు డ్రమ్ములు బురుద నింపుకోని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మీద ప్రజా సంక్షేమ కార్యక్రమాల వెలుగుల వాస్తవాల మీద, ఎన్ని డ్రమ్ముల బురద జల్లినా.. ఎప్పటికప్పుడు కడిగేసుకుంటా తేటతెల్లం చేసుకుంట పోతనే వుందాం. మనకు వాస్తవాల వెలుగులనందించే మన సోషల్ మీడియా సహా తెలంగాణ మీడియా భాస్కరులున్నంత వరకు.. వాస్తవాలేమిటో ఎప్పటికప్పుడు వాటంతటవే వజ్రంలోని కోణాల మాదిరి ప్రస్పుటమైతనే వుంటయి.