హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రెతిఫైల్ బస్‌స్టేషన్ సమీపంలో ఆదివారం ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. రౌడీషీటర్ ఫరీద్ కల్లలో కారం చల్లిన దుండగులు వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఫరీద్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న ఫరీద్‌ను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఫరీద్‌పై చిలకలగూడ పిఎస్‌లో పలు కేసులతో పాటు రౌడీషీట్ కూడా తెరిచి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసిన్నట్లు తెలుస్తోంది.