Home ఛాంపియన్స్ ట్రోఫీ చాలెంజర్స్ ఏడో ‘సారి’

చాలెంజర్స్ ఏడో ‘సారి’

  • చెలరేగిన ఫెర్గూసన్, తాహిర్ మ్యాజిక్ ..
  • రాణించిన స్మిత్, కోహ్లి శ్రమ వృథా,
  • బెంగళూరుపై పుణె ఘన విజయం

RCB-PUne

పుణె : కిందటి రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు అవమానకర రీతిలో చిత్తయ్యింది. 158 పరుగుల కష్ట సాధ్యం కానీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన చాలెంజర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 96 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. పుణె బౌలర్లు ఫెర్గూసన్, ఇమ్రాన్ తాహిర్ అద్భుత బౌలింగ్‌తో బెంగళూరును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన ఫెర్గూసన్ 4 ఓవర్లలో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మరోవైపు తాహిర్ నాలుగు ఓవర్లలో 18 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రత్యర్థి జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి (55) మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. బెంగళూరులో కోహ్లి తప్ప ఏ ఒక్కరూ కూడా కనీసం రెండంకెలా స్కోరును అందుకోలేక పోవడం విశేషం. ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం ఆరు బౌండరీలు మాత్రమే వచ్చాయి. అందులో నాలుగు కోహ్లి కొట్టినవే కావడం గమనార్హం. కాగా, అద్భుత బౌలింగ్‌తో పుణెను గెలిపించిన ఫెర్గూసన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
ప్రారంభం నుంచే..
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ రెండు పరుగులు మాత్రమే చేసి ఉనద్కట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. భారీ ఆశలు పెట్టుకున్న స్టార్ ఆటగాడు డివిలియర్స్ కూడా నిరాశా పరిచాడు. మూడు పరుగులు చేసిన డివిలియర్స్‌ను ఫెర్గూసన్ పెవిలియన్ పంపాడు. ఒక వైపు వైపు వికెట్లు పడుతున్నా కోహ్లి పోరాటం కొనసాగించాడు. సంయమనంతో ఆడుతూ స్కోరును ముందుకు నడిపించేందుకు ప్రయత్నించాడు. అయితే సహచరులు చెత్త ఆటను కనబరచడంతో కోహ్లి పోరాటం వృథా అయ్యింది. వికెట్ కీపర్ కెదార్ జాదవ్ (7), సచిన్ బేబి (2), స్టువర్ట్ బిన్ని (1), పవన్ నేగి (౩), మిల్నె (5), శామ్యూల్ బద్రి (2) ఘోరంగా విఫలమయ్యారు. కనీస పోరాటం కనబరచకుండానే వెనుదిరిగారు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన కోహ్లి 48 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా సీజన్‌లో ఇప్పటివరకు పది మ్యాచులు ఆడిన బెంగళూరుకు ఇది ఏడో ఓటమి. దీంతో జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు అడుగంటాయనే చెప్పవచ్చు. మరోవైపు ఈ విజయంతో పుణె తన నాకౌట్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది.
ఆదుకున్న త్రిపాఠి, స్మిత్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఫుణెకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అజింక్య రహానె పేలవ ప్రదర్శనతో మరోసారి నిరాశ పరిచాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి బద్రి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అప్పటికి పుణె స్కోరు 18 పరుగులు మాత్రమే. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టె బాధ్యత తనపై వేసుకున్నాడు. త్రిపాఠితో కలిసి స్కోరును ముందుకు నడిపించాడు. మరోవైపు త్రిపాఠి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. అయితే 28 బంతుల్లో 4ఫోర్లు, ఓ సిక్సర్‌తో ౩7 పరుగులు చేసిన త్రిపాఠిని పవన్ నేగి వెనక్కి పంపాడు. నేగి వేసిన చక్కని బంతికి త్రిపాఠి వికెట్ల వెనుక దొరికి పోయాడు. దీంతో 40 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, ఈ దిశలో బ్యాటింగ్‌కు వచ్చిన మనోజ్ తివారి కూడా కుదురుగా ఆడాడు. అతని అండతో స్మిత్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరూ బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించాడు. దూకుడుగా ఆడిన స్మిత్ ౩2 బంతుల్లోనే ఐదు ఫోర్లు. ఒక సిక్స్‌తో 45 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. స్టువర్ట్ బిన్నికి ఈ వికెట్ దక్కింది. తర్వాత వచ్చిన వికెట్ కీపర్ ధోనీ కూడా జట్టుకు అండగా నిలిచాడు. సంయమనంతో ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన తివారి ౩5 బంతుల్లో 4బౌండరీలు, ఒక సిక్స్‌తో 44 పరుగులు చేశాడు. ధోనీ 17 బంతుల్లో ఒక ఫోర్, మరో సిక్స్‌తో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో పుణె స్కోరు ౩వికెట్లకు 157 పరుగులకు చేరింది. బెంగళూరు బౌలర్లలో చాహల్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

స్కోరు బోర్డు వివరాలు

రైజింగ్ పుణె సూపర్‌ జెయింట్స్ ఇన్నింగ్స్ : అజింక్య రహానె (సి) మిల్నె (బి) బద్రి 6, రాహూల్ త్రిపాఠి (సి) కేదార్ జాదవ్ (బి) పవన్ నేగి 37, స్టీవెన్ స్మిత్ (సి) మిల్నె (బి) బిన్ని 45, మనోజ్ తివారి నాటౌట్ 44, ఎంఎస్.ధోనీ నాటౌట్ 23, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం 2౦ ఓవర్లలో 157/3
బౌలింగ్: ఆడమ్ మిల్నె 4-0-35-0, శామ్యూల్ 4-0-31-1, శ్రీనథ్ అరవింద్ 4-0-30-0, వైఎస్ చాహల్ 2-0-25-0, పవన్ నేగి 4-0-18-0, స్టువర్ట్ బిన్ని 2-0-17-1.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : ట్రావిస్ హెడ్ (బి) ఉనద్కట్ 2, విరాట్ కోహ్లి (సి) మయాంక్ అగర్వాల్ (బి) క్రిస్టియాన్ 55, ఎబి డివిలియర్స్ (సి) మనోజ్ తివారి (బి) ఫెర్గూసన్ ౩, కేదావ్ జాదవ్ (రనౌట్ ) 7, సచిన్ బేబి(సి) స్మిత్ (బి) వాషింగ్టన్ సుందర్ 2, స్టువర్ట్ బిన్ని (సి) సుందర్ (బి) ఫెర్గూసన్ 1, పవన్ నేగి (సి) క్రిస్టియాన్ (బి) ఇమ్రాన్ తాహిర్ ౩, ఆడమ్ మిల్నె (సి) స్మిత్ (బి) ఇమ్రాన్ తాహిర్ 5, శామ్యూల్ బద్రి (బి) ఇమ్రాన్ తాహిర్ 2, శ్రీనాథ్ అరవింద్ నాటౌట్ 8, చాహల్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం 2౦ ఓవర్లలో96/9.
బౌలింగ్: దీపక్ చాహర్ 2-0-18-0, ఉనద్కట్ 4-0-19-1, ఫెర్గూసన్ 4-1-7-2, డానియల్ క్రిస్టియన్ 4-0-25-1, ఇమ్రాన్ తాహిర్ 4-0-18-3, వాషింగ్టన్ సుందర్ 2-0-7-1