Home IPL 2019 డివిలియర్స్ విధ్వంసం…

డివిలియర్స్ విధ్వంసం…

De-Villiers

బెంగళూరు : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా మూడో విజయంతో రేసులో నిలిచింది. బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 202 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 185 పరుగుల మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (42), క్రిస్ గేల్ (23) శుభారంభం అందించారు. మయాంక్ అగర్వాల్ ఐదు ఫోర్లు, సిక్స్‌తో 35 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ పురాన్ కూడా దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, ఫోర్‌తో 46 పరుగులు చేశాడు. మిల్లర్ 24 పరుగులు సాధించాడు. అయితే చివర్లో బెంగళూరు బౌలర్లు అద్భుత బౌలింగ్‌ను కనబరచడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.
డివిలియర్స్ జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లి, పార్థివ్ పటేల్‌లు శుభారంభం అందించారు. అయితే రెండు ఫోర్లతో 13 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన కెప్టెన్ విరాట్‌ను మహ్మద్ షమి వెనక్కి పంపాడు. దీంతో 35 పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్‌ను చేజార్చుకుంది. తర్వాత వచ్చిన ఎబి.డివిలియర్స్ ప్రారంభం నుంచే తన మార్క్ షాట్లతో చెలరేగి పోయాడు. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. మరోవైపు పార్థివ్ పటేల్ కూడా చెలరేగి ఆడాడు. చూడచక్కని షాట్లతో అలరించిన పార్థివ్ 24 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో ఏడు బౌండరీలతో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత బెంగళూరు వెంటవెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది.

స్టార్ ఆటగాడు మోయిన్ అలీ (4) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆకాశ్‌దీప్ నాథ్ (3) కూడా నిరాశ పరిచాడు. అయితే తర్వాత వచ్చిన స్టోయినిస్ అండతో డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. స్టోయినిస్ కూడా అద్భుత షాట్లతో అలరించాడు. ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడిన డివిలియర్స్ పరుగుల వరద పారించాడు. అతన్ని కట్టడి చేయడంలో పంజాబ్ బౌలర్లు విఫలమయ్యారు. వరుస సిక్సర్లతో డివిలియర్స్ అభిమానులను కనువిందు చేశాడు. దూకుడుగా ఆడినడివిలియర్స్ 44 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు స్టోయినిస్ కూడా కీలక ఇన్నింగ్స్‌తో తన వంతు సహకారం అందించాడు. పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న స్టోయినిస్ 34 బంతుల్లో మూడు సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో 46 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. వీరిద్దరి దూకుడుతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.

royal challengers bangalore won on kings xi punjab