Home సినిమా సినీ ప్రముఖుల సమక్షంలో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభం

సినీ ప్రముఖుల సమక్షంలో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభం

RRRఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత దానయ్య డి.వి.వి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రానా, కల్యాణ్‌రామ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, వెంకీ అట్లూరి, మెహర్ రమేశ్, దిల్‌రాజు, అల్లు అరవింద్, పివిపి, శోభు యార్లగడ్డ, యువి వంశీ, యువి విక్రమ్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, బివిఎస్‌ఎన్ ప్రసాద్, కె.ఎల్.నారాయణ, డి.సురేశ్‌బాబు, ఎం.ఎల్.కుమార్ చౌదరి, నవీన్ ఎర్నేని, సి.వి.మోహన్, యలమంచిలి రవిశంకర్, పరుచూరి ప్రసాద్, ఎన్.వి.ప్రసాద్, సాయి కొర్రపాటి, గుణ్ణం గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టగా వి.వి.వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ “మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆఫ్ టాలీవుడ్‌ను మా బ్యానర్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో రాజమౌళి దర్శకత్వంలో చేయడం ఓ కలలాగా ఉంది. సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలున్నాయి. నందమూరి అభిమానులు, మెగాభిమానులు ఈ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. అందరి అంచనాలను మించేలా నిర్మాణంలో ఏవిధంగా రాజీపడకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తాం. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటేంత గొప్ప సాంకేతిక విలువలతో ఈ సినిమాను రూపొందిస్తాం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 19 నుండి ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రెండు వారాలపాటు భారీ సెట్‌లో యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించబోతున్నాం. త్వరలోనే ఈ సినిమాలో పనిచేసే మిగతా నటీనటుల వివరాలను ప్రకటిస్తాం”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః కె.కె.సెంథిల్ కుమార్, మ్యూజిక్‌ః ఎం.ఎం.కీరవాణి, మాటలుః సాయిమాధవ్ బుర్రా, కర్కీ, ఎడిటర్‌ః శ్రీకర్ ప్రసాద్, ఎఎఫ్‌ఎక్స్ సూపర్ విజన్‌ః వి.శ్రీనివాస్ మోహన్, కాస్టూమ్ డిజైనర్‌ః రమా రాజమౌళి, ప్రొడక్షన్ డిజైనర్‌ః సాబు సిరిల్, కథ, వి.విజయేంద్రప్రసాద్.

RRR Movie Shooting Started in Hyderabad 

Telangana News