Home తాజా వార్తలు నా జీవితంలో ఆ రోజును మరచిపోలేను: చరణ్

నా జీవితంలో ఆ రోజును మరచిపోలేను: చరణ్

 

హైదరాబాద్‌: రాజమౌళితో మళ్లీ పనిచేయాలనుకున్నా… కానీ తారక్‌తో కలిసి ఆయనతో సినిమా చేస్తానని అనుకోలేదని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా అత్యంత ప్రాతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాకు సంబంధించిన విషయాలను గురువారం చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో  వెల్లడించారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ..‘‘ఇది నిజంగా జరుగుతోందా లేదా అన్నది కూడా ఇంకా నమ్మలేకపోతున్నాను. రాజమౌళితో మళ్లీ పనిచేయాలనుకున్నాం. కానీ తారక్‌తో కలిసి ఆయనతో సినిమా చేస్తానని అనుకోలేదు. ఈ ప్రాజెక్ట్‌ ఎలా మొదలైందనేది నా ఆసక్తి. సంవత్సరం క్రితం నేను ఊరెళ్లడం కోసం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నా. ఆ దారిలో రాజమౌళి గారి ఇల్లు ఉంది. ఆయన మా ఇంటికి ఒకసారి వచ్చేసి వెళ్లు అన్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లాక.. ఒక మంచి ఫోజులో తారక్ నేల మీద అలా రిలాక్స్ అయి కూర్చున్నాడు. తారక్‌కు నేనొస్తానని తెలీదు. నాకూ తనొస్తాడని తెలీదు. అలా ఇద్దరం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. మా ఇద్దర్నీ లోపలికి తీసుకెళ్లి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ గురించి చెప్పారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. తారక్, నేనూ ఇద్దరం ఒకరి మొహాలు ఒకరం చూసుకుని వెళ్లి రాజమౌళిని గట్టిగా పట్టుకుని ఈ సినిమాలో చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పాం. ఆ తర్వాత తీసిన ఫొటోనే మీరు చూసింది. నా జీవితంలో ఆ రోజును మరచిపోలేను. అద్భుతమైన, గౌరవప్రదానమైన పాత్రల్లో నటిస్తున్నాం. మేం కూడా చాలా జాగ్రత్తగా నటిస్తున్నాం. నా సోదరుడు తారక్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇంకా మా పాత్రలకు సంబంధించిన చిత్రీకరణ మొదలుకాలేదు’’ అని చరణ్ చెప్పుకొచ్చాడు.

#RRR Press Meet: Ram Charan reveals #RRR movie begins