Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

నర్సరీల పెంపకంలో నిధుల గోల్‌మాల్

Rs.1.16 crores is misuse of plant breeding

మొక్కల పెంపకం పేరిట రూ.1.16 కోట్లు దుర్వినియోగం
ఈజిఎస్ నిధులకు లెక్కలు చూపని అధికారులు
మొక్కలు పెంచకుండానే నిధుల స్వాహా
నర్సరీల నిర్వహణలో అధికారుల అలసత్వం

మన తెలంగాణ/మంచిర్యాల: నర్సరీల పెంపకం పేరిట ఇజిఎస్ నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు నర్సరీల పెంపకానికి ఇజిఎస్ అధికారులు పలు చోట్ల నర్సరీలను ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్షం కారణంగా కొన్ని నర్సరీలలో మొక్కలు నాటకపోగా మరికొన్ని నర్సరీలలో నాటిన మొక్కలు పంపిణీ చేయకపోవడంతో ఎండిపోయాయి. నర్సరీల పెంప కం పేరిట రూ. 1.16 కోట్ల రూపాయల ఇజిఎస్ నిధులు దుర్వినియోగం కాగా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ చేపట్టడం లేదు. కాగా ఇజిఎస్ నిధులకు సంబంధిత అధికారులు కాకి లెక్కలు చూపుతూ నిధులను స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని 12 మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద 44 నర్సరీలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు గాను 62.91 లక్షలు, ఉపాధి కూలీలకు చెల్లింపులు జరపగా 54.03 లక్షలు నర్సరీల్లో మెటీరియల్ కొనుగోలుకు వెచ్చించారు. ఆసిఫాబాద్ మండలంలో 3 నర్సరీల ఏర్పాటుకు 9.43 లక్షలు ఖర్చు చేశారు. అదే విధంగా బెజ్జుర్ మండలంలో 6 నర్సరీల ఏర్పాటుకు రూ. 8.50 లక్షలు, దహెగాంలో 6 నర్సరీల ఏర్పాటుకు రూ. 8.58 లక్షలు, జైనూర్‌లో 3 నర్సరీలకు రూ. 10.03 లక్షలు కాగజ్‌నగర్‌లో 4 నర్సరీలకు రూ. 8.51 లక్షలు, కెరమెరిలో 3 నర్సరీలకు రూ. 12.57 లక్షలు, కౌటాల మండలంలో 4 నర్సరీలకు రూ. 10.07 లక్షలు , రెబ్బెన మండలంలో 3 నర్సరీలకు రూ.8.49 లక్షలు, సిర్పూర్ (టి) మండలంలో 3 నర్సరీల నిర్వాహణకు రూ. 9.56 లక్షలు, సిర్పూర్(యు) మండలంలో 3 నర్సరీల నిర్వహణకు రూ. 10.04 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. అదే విధంగా తిర్యాణి మండలంలో 3 నర్సనీల పెంపకానికి రూ. 8.28 లక్షలు, వాంకిడి మండలంలో 3 నర్సరీల నిర్వాహణకు రూ. 12.26 లక్షలను వెచ్చించగా ఎక్కడ కూడా అధికారులు నిర్దేశించిన లక్ష్యాల మేరకు మొక్కలను పెంచలేదనే ఆరోపణలు ఉన్నాయి. నర్సరీల నిర్వహణలోభాగంగా పాలిథిన్ కవర్ల కొనుగోలు, విత్తనాల పేరిట పెద్ద ఎత్తున అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. బెజ్జూర్ మండలం రుద్రపూర్-1, మర్తిడి-1,బెజ్జూర్-2 నర్సరీలను ఏర్పాటు చేసిన అధికారులు వాటిలో మొక్కలు నాటడం మరిచిపోయారు. కేవలం పాలిథిన్ కవర్లలో మట్టిని నింపి విత్తనాలు నాటకుండానే వదిలివేయడంతో ఇటీవల వర్షాలకు పిచ్చిమొక్కలు మొలిశాయి. కాగా బెజ్జూర్ మండలంలో 6 నర్సరీలను లక్షంగా పెట్టుకోగా 4 నర్సరీలను ఏర్పాటు చేసి, రూ. 8.50 లక్షలను స్వాహ చేశారు. ఇటీవల ఉపాధి హామీ అధికారులు క్షేత్రస్థాయిలో జిల్లాలోని నర్సరీలను పరిశీలించినప్పటికీ సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సామాజిక తనిఖీల్లో కూడా ఉపాధి హామీ అధికారులు లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడినట్లుగా వెల్లడి కావడంతో ప్రాజెక్టు డైరెక్టర్‌కు నివేదిక పంపించారు. అయినప్పటికీ ప్రాజెక్టు డైరెక్టర్ నర్సరీలను పరిశీలించగా పోవడంతో అధికారులు ఇజిఎస్ నిధులకు కాకి లెక్కలు చూపుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలోని 12 మండలాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచి బీడు భూముల్లో నాటడంతో పాటు అటవీ అధికారులకు అందజేసేందుకు అధికారులు నిర్ణయించారు. కాగా జిల్లాలోని పలు నర్సరీలలో మొక్కలు పెంచకుండానే అధికారులు కేవలం కూలీలకు మాత్రమే కూలీ డబ్బులు చెల్లించి మెటీరియల్ కొనుగోలు పేరిట లక్షలాది రూపాయలను స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నర్సరీల పెంపకానికి ఖర్చు చేసిన నిధులపై విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments