Home బిజినెస్ విజయ్ మాల్యా అప్పు రూ.1200 కోట్లు రద్దు

విజయ్ మాల్యా అప్పు రూ.1200 కోట్లు రద్దు

రూ. 7 వేల కోట్ల మేర 65 మంది మొండి బకాయిలు రైటాఫ్ చేసిన ఎస్‌బిఐ   

జాబితాలో మాల్యాతో సహా 63 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు –   దీనిలో తెలుగు రాష్ట్రాల కంపెనీలు ఉన్నాయి

Vijaya-malya1

న్యూఢిల్లీ: మొండి బకాయిలపై దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద మొత్తంలో పేరుకుపోయి సంస్థ మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన మొండి బకాయిలను ఎస్‌బిఐ వేరే ఖాతాలోకి మళ్లించింది. బ్యాలెన్సు షీటులో మొండి బకాయిల భారం లేకుండా చూసుకుంది. ఇదే సమయంలో అతిపెద్ద రుణ ఎగవేతదారుగా ఉన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు కూడా లక్కీలోపడ్డారు. కింగ్‌ఫిషర్ కోసం మాల్యా అప్పుగా తీసుకున్న దాదాపు రూ.1200 కోట్లను ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రద్దు చేసింది. దీనివల్ల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఎస్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఎస్‌బిఐ ఈ రుణాన్ని అంతా రైటాఫ్(మొండి బకాయిల ఖాతా నుంచి రద్దు) చేసింది. కింగ్‌ఫిషర్ కోసం మాల్యా తీసుకున్న ఈ భారీ రుణంతో పాటు ఇతర మొండి బకాయిలను కూడా ఆకా(అడ్వాన్స్‌డ్ అండ్ కలెక్షన్ అకౌంట్) కేటగిరీలోకి బదిలీ చేసినట్టు ఎస్‌బిఐ ప్రకటించింది. ఇది బ్యాంకు పుస్తకాల్లో మొండి బకాయిలు లేనట్టుగా చూపిస్తుందని, అదే సమయంలో ఈ నిరర్థక ఆస్తులను పైసాతో సహా వసూలు చేసేంత వరకు అది తనపని తాను చేసుకుంటూ పోతుందని బ్యాంకు వెల్లడించింది. రిజర్వు బ్యాంకు అనుమతించిన పద్ధతి అయిన ’అడ్వాన్స్ అండర్ కలెక్షన్ అకౌంట్స్ (ఆకా)’ ద్వారా మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులను ఒక ప్రత్యేకమైన ఖాతాలోకి బదిలీ చేస్తారు. దీంతో అవి బ్యాంకు బ్యాలెన్స్ షీటులో కనిపించవు. తద్వారా బ్యాంకు పనితీరుపై అది ఎలాంటి ప్రభావం చూపదు. అయితే అంతమాత్రాన వాటిని పూర్తిగా మాఫీ చేసినట్లు కాదు. ఈ పద్ధతిలో మొత్తం 63 మంది ఎగవేతదారులకు చెందిన మొండి బకాయిలను ఎస్‌బిఐ రైటాఫ్ చేసినట్లు తెలుస్తోంది. వీటి విలువ దాదాపు రూ.7,016 కోట్లు ఉంటుంది. ఈ మేరకు డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ ఒక కథనం ప్రచురించింది.

దీనిలో విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫియర్ ఎయిర్ లైన్స్ బకాయిలు రూ 1,201 కోట్లు కూడా ఉన్నాయి. మొండిబకాయిల జాబితాలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌దే మొదటి స్థానం. ఇంకా తెలుగు కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ రైటాఫ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విక్టరీ ఎలక్ట్రికల్స్‌కు చెందిన రూ.93.91 కోట్లు, విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ లిమిటెడ్ రూ. 66.57 కోట్లు, కెఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు రూ. 86.73 కోట్లు, ఘన్ శ్యాం దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ రూ.61.72 కోట్లు ఉన్నాయి. అలాగే తెలంగాణకు చెందిన టోటెం ఇన్ ఫ్రాకు బకాయిలు రూ. 93.68కోట్లు, ఎస్‌ఎస్‌బీజీ ఇంజనీరింగ్ ప్రాజెకట్స్ రూ.65.24 కోట్లు ఉన్నాయి. ఇంకా ఈ జాబితాలో కెఎస్ ఆయిల్ (రూ 596 కోట్లు), సూర్య ఫార్మాస్యూటికల్స్ (రూ 526 కోట్లు) జిఇటి పవర్, (రూ .400 కోట్లు) సాయి అండ్ ఇన్ఫో సిస్టమ్ (రూ 376 కోట్లు) ఉన్నాయి. 63 ఖాతాలను పూర్తిగా ఆకాలోకి మళ్లించగా, 31 ఖాతాలను పాక్షికంగా మళ్లించినట్లు తెలిపింది. ఆరింటిని మొండి బకాయిలుగా చూపించారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారం గందరగోళం సృష్టిస్తున్న వేళ ఎస్‌బిఐ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకేసారి పెద్దమొత్తంలో రుణాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏమైనా వేరే కారణాలు ఉన్నాయా అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిర్ణయంతో విదేశాల్లో ఉన్న మాల్యా మాత్రం ఊపిరి పీల్చుకుంటారేమో.. ఈ పరిణామాలు చూస్తే మాల్యాపై ప్రభుత్వం తీవ్రమైన ధోరణిలో వెళ్లడం లేదని తెలుస్తోంది.

మాల్యా అప్పు రద్దు చేయలేదు

ఎస్‌బిఐ చేసిన రైటాఫ్… మొండి బకాయిల రద్దు అని కాదు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాతో సహా అనేకమంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల మొండి బకాయిలను ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రైటాఫ్(రద్దు) చేయడంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. ఈ రుణం రద్దు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది ఖాతా పుస్తకాలకు చెందినది మాత్రమే, నిరర్థక ఆస్తిగా ఉంటుంది. రిట్ ఆఫ్ అంటే రుణం మాఫీ అని కాదు, అది అలాగే కొనసాగుతుంది అని జైట్లీ రాజ్యసభలో వివరణ ఇచ్చారు. మాల్యా రుణం ఎగవేత సమస్య గత యుపిఎ పాలన నుంచి తమకు వారసత్వంగా వచ్చిందేనని జైట్లీ అన్నారు. గత ప్రభుత్వమే మాల్యా సంస్థకు రు ణాన్ని మంజూరు చేసిందనే విష యాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

రూ.500, రూ. 1000 నోట్లను అకస్మాత్తుగా నిషేధించడం కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు సీతా రాం ఏచూరి విజయ్ మాల్యా రుణాన్ని ఎస్‌బిఐ రైటాఫ్ చేసిన విషయాన్ని లేవనెత్తగా జైట్లీ పైవిధంగా స్పందించారు. నల్లధనానికి చెక్ పెట్టడంలో పెద్ద నోట్ల రద్దు ఎంతగానో దోహదం చేస్తుందని, ప్రస్తుతం ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు తలెత్తినా దీర్ఘాలికంగా ప్రయోజనం పొందుతామని జైట్లీ అన్నారు. ‘దేశం నల్లధనంతో ఎక్కువకాలం ఉండదు’ అని జైట్లీ తన ఫేస్‌బుక్ కవర్‌పేజీపై ఓ నినాదాన్ని ఉంచారు. ఇకపై దేశం లో నల్లధనం ఛాయలు కనిపిం చే అవ కాశం లేదని అన్నారు. నల్లధనం, నకిలీ నోట్లు, టెర్ర ర్ ఫైనాన్సింగ్ నిర్మూలన కోస మే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. అకా కింద మొండి బకాయిలను సర్దు బాటు చేసినట్టు ఎస్‌బిఐ పేర్కొంది. వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ వేల కోట్ల వరకు బాకీ పడిం ది. ఎస్‌బిఐ స్వాధీనం చేసుకున్న స్థిర ఆస్తుల్లో గోవాలోని మాల్యాకు చెందిన విల్లా కూడా ఉంది. అయితే దీనిని వేలం వేసేందుకు పలు సార్లు ప్రకటనలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విల్లా కొనుగోలు చేసే వారి కోసం ఎస్‌బిఐ ఎదురుచూస్తోంది.