Home నిజామాబాద్ సమాచారం అడిగితే విధులకు ఆటంకమట

సమాచారం అడిగితే విధులకు ఆటంకమట

register-office

ఆన్‌లైన్‌లో చూసుకోవాలని ఈసడింపు జవాబు
సమాచారం ఇచ్చేందుకు నిరాకరణ
రిజిస్టర్ పోస్టుకు రూ.264 వసూలు
నిజామాబాద్ ఎంపిడిఒ వింత పోకడ

మనతెలంగాణ/ నిజామాబాద్ రూరల్: సామాన్యుడి చేతికి అందివచ్చిన అస్త్రం సమాచార హక్కు చట్టం…కొందరు అవినీతి బోజ్యాధికారుల వల్ల ఈ చట్టం నీరుగారిపోతుంది. తనకు ప్రభుత్వపరంగా ఉపాధి హామీ ద్వారా రావాల్సిన బకాయిలను రాబట్టుకునే ప్రయత్నంలో స.హ.చ ద్వారా సమాచారం అడిగితే, ప్రశ్నించిన వారిని చీడపురుగును చూసినట్లుగా చూస్తున్నారు. ఓపికగా సమాధానాలు ఇవ్వాల్సిందిపోయి ఆన్‌లైన్‌లో చూసుకోవాలని స.హ దరఖాస్తుదారునికి మతిభ్రమించిన వారిలాగా ఒక లేఖను పంపించారు. తనకు న్యాయం జరగాలని చట్టాన్ని వాడుకుంటే విధులకు ఆటంకపరుస్తున్నాడని అభియోగాలు మోపి కటకటాల పాలు చేయాలనే తలంపునకు నిజామాబాద్ మండలాధికారి దిగినట్లు అవగతమవుతోంది. నిజామాబాద్ మండలం (పాత)లోని సిర్పూర్ గ్రామానికి చెందిన గోపాల్ ఉపాధి హామీ ద్వారా తన తోటలో నాటిన మొక్కలకు, పెంపుదలకు గాను ప్రభు త్వం నుంచి వచ్చే నిధులను ఇప్పించాలని ఆ గ్రామ క్షేత్ర సహాయకుడి (ఫీల్డ్ అసిస్టెంట్) కోరాడు. నిధుల్లేవ్ ఏమిలేక ఏమి చేసుకుంటావో చేసుకపో అని ఎఫ్‌ఎ అనగానే లబ్ధిదారుడు ఆర్‌టిఐని వాడుకున్నాడు. సమాధానాలు ఎలా ఇవ్వాలో తెలియక అంతర్మథనంలో పడిన సిబ్బంది మండలాధికారితో చర్చించి లెక్కపత్రం లేకుండా ఇంత డబ్బు కట్టాలని కట్టించుకున్నారు. చట్టంలో లేని విధంగా రిజిస్టర్ పోస్టుకు 264 రూపాయల సైతం కట్టించుకున్న ఘనత నిజామాబాద్ మండల అధికారులకే చెందుతుంది.
విధులకు ఆటంకమట
తనకు వచ్చే బకాయిల కోసం అడిగితే సమాధానాలు ఇవ్వాల్సిన అధికారులు పొంతన లేకుండా మాట్లాడడం గమనార్హం. స.హ.చట్టాన్ని వాడుకున్న గోపాల్‌ను లేనిపోని చట్టాలను ఉపయోగించి కటకటాల వెనక్కి పంపించాలనే యోచనను మన తెలంగాణ గత 4న బాధితునికి అధికారుల బెదిరింపులు అనే శీర్షికతో కథనాన్ని వెలువరించింది. అనుకున్నది ఒకటి, అయ్యిందొక్కటి అన్నట్లు గా ఈ వార్త కలకలం రేపడంతో దీనికి గాను గోపాల్ తరచుగా అడిగిన సమాచారాన్ని తిరిగి అడుగుతూ విధులకు ఆటంకపరుస్తున్నాడని  పై అధికారులు వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్న చందంగా ఉపాధి హామీ ద్వారా తన తోటలో మొక్కల గురించి అడిగితే ఎంపిడిఓ బెంబేలెత్తిపోవడం వెనుక పెద్ద కుంభకోణమే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాధానాలు ఇచ్చేందుకు నిరాకరణ
స.హ.చ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విభాగాపు అధికారులపై ఉంది. అలా కాకుండా ఫిర్యాదుదారుడు కోరిన వాటిని తుంగలో తొక్కి పైపైగా డబ్బులు కట్టించుకున్న దానికి అనుగుణంగా సమాచారం ఇవ్వడం వెనక మతలబు ఉన్నట్లే కనబడుతోంది. తప్పు చేయకపోతే, పనుల్లో ఆశించకపోతే బాధితుడు అడిగిన సమాచారాన్ని పూర్తి ఇవ్వలేదు. అలా చేయలేదంటే కింది నుంచి పైదాక తిలాపాపం తలా పిడికెడు ఉన్నట్లుగా ఉంది వ్యవహారం. ఆర్జీదారుడు అడిగిన సమాచారానికి ఎన్ని డబ్బులు తీసుకోవాలో తెలియకుండానే ముందుగా కట్టించుకొని, ఆనక సర్దుబాటు చేసేందుకు తిప్పలు పడుతూ కోరినవి ఇవ్వకుండా ఇతర సమాచారాన్ని కలిపి ఇచ్చారు. చెల్లించిన వాటిలో డబ్బులు మిగలడంతో సర్దుబాటు చేయకలేక రిజిస్టర్ పోస్టుకు 264 రూ.లు వసూలు చేశారంటే వారి పనితీరుకు నిదర్శనంగా భావించవచ్చు. ఇదంతా నిజామాబాద్ ఎంపిడిఓకు తెలియకుండానే జరుగుతుందా అంటేనే నమ్మశక్యంగా లేదు సుమీ….
ఆన్‌లైన్‌లో చూసుకో
సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తూ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడంతో, గత మార్చి 23న 5 అంశాలతో గోపాల్ మరో దరఖాస్తు ఇచ్చాడు. దీనిపై స్పందించిన ఎంపిడిఓ కార్యాలయ పౌర సమాచార అధికారి 1వ అంశం మా పరిధిలోకి రాదని, 2 నుండి 5వ అంశాలకు సమాచారం ఇవ్వడానికి వీలు పడదని ఓ లేఖ పంపారు. అంతేగాక పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని, అవసరమైతే ఆన్‌లైన్‌లో చూసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా ఎంపిడిఓకు తెలిసే జరిగినా, దరఖాస్తుదారున్ని తప్పుదోవ పట్టించే విదంగా ప్రయత్నాలు సాగించారు. తికమక సమాధానంతో ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశ్యాన్ని ప్రదర్శించారు. ఆన్‌లైన్‌లో చూసుకోవడం తెలిస్తే బాధితుడు స.హ దరఖాస్తు ఎందుకు చూసుకుంటాడు ? తెలియని సమాచారం అడిగితే ఈసడింపుగా సమాధారం ఇవ్వడం ఆయన హోదాకు తగదని అందులోని కొందరు సిబ్బంది పేర్కొంటున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన మండలాధికారే నిర్లక్షం ధోరణి కనబరిస్తే పట్టించుకునేదెవరనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఆన్‌లైన్‌లో చూసుకోవాలని దరఖాస్తుదారునికి సమాధానం ఇచ్చిన మండలాధికారి కార్యాలయం ఎదుట ఇదే రాసి ఉంచాలనే అభిప్రాయాలను మండల ప్రజలు వెలువరిస్తున్నారు.