Home వికారాబాద్ రూ. 50 కోట్ల పంట రుణాలు ఇస్తాం

రూ. 50 కోట్ల పంట రుణాలు ఇస్తాం

Mahendar-image

మంత్రి మహేందర్‌రెడ్డి 

మన తెలంగాణ/వికారాబాద్ : జిల్లా సహకార బ్యాంకు ద్వారా రైతులకు రూ.50 కోట్ల పంట రుణాలు ఇస్తామని మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి రైతుకు రూ.2 లక్షల చొప్పున అందజేసే యోచనలో ఉన్నామని చెప్పారు. రూ.65 లక్షల వ్యయంతో తాండూరులో డిసిసిబి బ్రాంచి భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక అనుమతితో స్థలాన్ని లీజుకు తీసుకుని తాండూరులో బ్యాంకు భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. రూ.వంద కోట్ల దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 52 వేల మంది రైతులకు రూ.128 కోట్లు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద రూ.12 వేల కోట్లతో 58 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున సహాయం అందజేశామని ఉద్ఘాటించారు. నవంబరులో రెండవ పంటకూ రైతుబంధు కింద రూ.6 వేల కోట్ల సహాయం చేస్తామని వెల్లడించారు. వివాదాస్పద భూములకూ రైతుబంధు అందజేస్తామని మంత్రి మహేందర్ స్పష్టం చేశారు. అయితే, సంబంధిత రైతుకు తప్పనిసరిగా పాసు పుస్తకాలు ఉండాలని సూచించారు. రైతుబంధు చెక్కుల డబ్బును పాత బకాయిల కింద బ్యాంకర్లు స్వాధీనం చేసుకునే హక్కులేదన్నారు. రైతులు నిర్భయంగా రైతుబంధు డబ్బును బ్యాంకుల ద్వారా తీసుకోవాలని తెలిపారు. మిషన్‌కాకతీయ కింద జిల్లాలో 200 చెర్వులకు నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. మరో మూడు చెర్వులు మిగిలివున్నాయని వివరించారు. రైతు సంక్షేమం కోసం పాటు పడుతున్న తమ ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి వివరించారు.

మాజీ చైర్మన్, చైర్మన్ మాటల యుద్ధం
బ్యాంకు శంకుస్థాపన చేసిన అనంతరం వేదికపై డిసిసిబి మాజీ చైర్మన్ పి.లకా్ష్మరెడ్డి, ప్రస్తుత చైర్మన్ పెంటారెడ్డి మధ్య మాటల యుద్ధం ఆకస్తికరంగా మారింది. నగర శివారు ప్రాంతాల నాయకులకు వ్యాపార ధోరణి తప్ప రైతులకు సేవ చేయాలన్న ధ్యాస లేదని లకా్ష్మరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత చైర్మన్ భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రూ.30 లక్షల సిసి కెమెరాల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతున్నదని చెప్పారు. దానికి సంబంధించిన ఫైలును మంత్రికి అందజేశారు. కొంతమంది సభ్యులు అవినీతికి పాల్పడాడరని, రైతులకు అన్యాయం జరిగితే సహించబోమని స్పష్టం చేశారు. సేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద రైతులకు రూ.2 లక్షలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూన్ దాటినా, విత్తనాలు గడువు ముగుస్తున్నా స్పందన లేదని అన్నారు. తాండూరులో బ్యాంకు నిర్మాణానికి వెచ్చిస్తున్న డబ్బు ప్రభుత్వానిది కాదన్నారు. సిసి కెమెరాల దుర్వినియోగం డబ్బును డిసిసిబి చైర్మన్ ద్వారా రికవరీ చేయాలని లకా్ష్మరెడ్డి స్పష్టం చేశారు. అనంతరం మాట్లాడిన చైర్మన్ పెంటారెడ్డి సభ్యుల అనుమతితోనే సిసి కెమెరాలు కొనుగోలు చేశామన్నారు. సభ్యుల తీర్మానం మేరకు కొనుగోలు చేసిన కెమెరాల్లో ఎలాంటి అవకతవకలు జరుగులేదని చెప్పారు. ఈ వ్యవహారం విచారణలో ఉందని, డబ్బు రికవరీ చేస్తామని తెలిపారు. బ్యాంకు నిర్మాణ పనులకు టెండర్లను ఆన్‌లైన్‌లో నిర్వహించడం కుదరదని తెలిసే ప్రతికల ద్వారా టెండర్లు పిలిచామన్నారు. గడచిన మూడేళ్ల కాలంలో రూ.400 కోట్ల రుణాలు ఇచ్చామని గుర్తు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాలకు రూ.180 కోట్లు ఇవ్వగా వికారాబాద్ ప్రాంతానికి రూ.190 కోట్లు ఇచ్చామని వివరించారు. తాను బాధ్యతలు చేపట్టక ముందు రూ.10 లక్షల వరకు సీఈవో సంతకం లేకుండానే డ్రా చేశారని గుర్తు చేశారు. ఎంత సేవలు చేసినా మాజీ చైర్మన్లకూ కేసుల పీడ తప్పలేదని చైర్మన్ పెంటారెడ్డి వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా వారిరువురి స్పీచ్‌లను మంత్రి, అక్కడ ఉన్న జనం ఆసక్తికరంగా విన్నారు. పనులకు ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించలేదని డిసిసిబి డైరెక్టర్ ఆల్విన్ అనంతరెడ్డి అన్నారు. జిల్లాలో కొత్తగా ధారూరు, కులకచర్ల, మన్నెగూడ, బషీరాబాద్‌లో బ్రాంచిలు ప్రారంభిస్తామని తెలిపారు. మాజీ ఎంపిపి కరణం పురుషోత్తమరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతాసంపత్ కూడా మాట్లాడారు. డిజీఎం ప్రభాకర్‌రెడ్డి, సీఈవో నర్సింహారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నారాయణగౌడు, మాజీ చైర్మన్లు వెంకట్‌రాంరెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.