Home రంగారెడ్డి బలిడి బస్సులు

బలిడి బస్సులు

RTA Officers Checked School buses Fitness

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :బడి బస్సులు కాస్తా బలి తీసుకునే బస్సులుగా మారినా రవాణా శాఖ అధికారులు కాసుల మత్తులో కార్యాలయాలకు పరిమితం అవుతున్నారు. బడిబస్సు ఫిట్‌నెస్‌కు నోచుకోకపోయినా కనీస ప్రమాణాలు పాటించకపోయినా తమకు సంబంధం లేదన్న మాదిరిగా రవాణా, పోలీసు, ట్రాఫిక్ అధికారులు వ్యవహరిస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభించే లోపు విద్యాసంస్థల బస్సులను ఫిట్‌నెస్ చేయించుకోవలసిన అవసరం ఉన్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహారం సాగుతుంది. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు దాటుతున్నా బడిబస్సులు మాత్రం ఫిట్‌నెస్‌కు నోచుకోవడం లేదు. రవాణా శాఖ అధికారుల వద్ద విద్యాసంస్థల బస్సుల వివరాలు పూర్తిగా ఉన్న ఫిట్‌నెస్‌కు నోచుకోకుండా రోడ్లపై తిరుగుతున్నా విద్యాసంస్థల బస్సులను గుర్తించి బస్సులను సీజ్ చేసి యజమాన్యాలపై కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉన్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైద్రాబాద్ మహనగరంకు చుట్టుపక్కల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విస్తరించిఉండటంతో తెలంగాణలోనే అత్యధిక విద్యాసంస్థలు జిల్లాలో కొలువైనాయి. రంగారెడ్డి జిల్లాలో 4700 విద్యాసంస్థల బస్సులకు 4200 బస్సులు మాత్రమే ఇప్పటివరకు ఫీట్‌నెస్‌కు నోచుకున్నాయి. జిల్లాలో దాదాపు 500 వందలకు పైగా విద్యాసంస్థల బస్సులు ఇప్పటివరకు ఫీట్‌నెస్‌కు నోచుకోకుండానే రోడ్లపై తిరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో 4835 బస్సులకు 4114 బస్సులకే ఫీట్‌నెస్ పూర్తి చేశారు. మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ రవాణ శాఖ అధికారి పరిధిలో 3080 విద్యాసంస్థల బస్సులుండగా ఇప్పటివరకు 2668 బస్సులను ఫీట్‌నెస్ చేసుకున్నారు. ఉప్పల్ రవాణ శాఖ అధికారి పరిధిలో 1755 విద్యాసంస్థల బస్సులకు గాను 1446 బస్సులు మాత్రమే ఫీట్‌నెస్‌కు నోచుకున్నాయి. వికారాబాద్ జిల్లాలో పరిస్థీతి మరింత దారుణంగా కనిపిస్తుంది. రెండు వందలకు పైగా విద్యాసంస్థల బస్సులు జిల్లాలో నడుస్తున్న సగం బస్సులు కూడ రవాణ శాఖ అధికారి వద్దకు వచ్చి ఫీట్‌నెస్ చేయించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి.

రవాణాలో వసూల్ రాజాలు
విద్యాసంస్థల బస్సులను ఫీట్‌నెస్ చేయడంలో సైతం రవాణ శాఖలోని కొంత మంది అధికారులు వసూల్ రాజాల అవతారం ఎత్తినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు రంగారెడ్డిలో 4200, మేడ్చల్ జిల్లాలో 4114, వికారాబాద్ జిల్లాలో వంద బస్సులు ఫీట్‌నెస్ చేసినట్లు అధికారులు చెప్పుతున్న చాలా వరకు చేతివాటం ప్రదర్శించినట్లు ప్రచారం జరుగుతుంది. ఫీట్‌నెస్‌కు వస్తే కాసులు సమర్పించుకున్న వారికి ఒక మాధిరిగా ఇతరులకు మరో మాధిరిగా సవాలక్ష కండిషన్‌లు పెట్టి వేదిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సులలో ఫస్టు ఎయిడ్ కిట్‌లు, అగ్నీమాపక పరికరాలు, చుట్టు ఉన్న కిటికిలకు గ్రీల్స్ తదితర సౌకర్యాలతో పాటు వాహనం కండీషన్‌లో ఉండాలన్న నిభందనలు ఉండాలని ఉన్న కొంత మంది అధికారులు కనీసం బస్సులను పరిశీలించకుండానే ఫీట్‌నెస్ సర్టీఫికేట్‌లు జారీచేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. బడులు ప్రారంబించి 15 రోజులైన ఫీట్‌నెస్ లేని వాహనాలపై నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు దాదాపు వంద బస్సులపై కేసులు నమోదు చేశామని చెప్పుకుంటున్న 1300 వాహనాలు ఫీట్‌నెస్ లేకుండా తిరుగుతున్నాయన్న విషయం మాత్రం రవాణ అధికారులు మరిచిపోతున్నారు.
యాజమాన్యాల కక్కుర్తి
పాఠశాల యాజమన్యాలు విద్యార్దుల దగ్గర ఫీజులు, రవాణ చార్జీలు వసూళ్లు చేయడంలో చూపిస్తున్న శ్రద్ద బడి బస్సుల నిర్వహణలో మాత్రం చూపడం లేదు. అనుభవం ఉన్న డ్రైవర్‌లను నియమించుకుంటే అధికంగా జీతాలు ఇవ్వవలసి వస్తుందన్న కక్కుర్తీ పడుతు అనుభవం లేని డ్రైవర్‌లను నియమిస్తున్నారు. బస్సులలో ఆయాలను నియమించవలసి ఉన్న ఒకటి రెండు బస్సులలో మాత్రం ఆయాలు కనిపిస్తున్నారు. 25 సీట్ల సామర్ధం గల బస్సులలో 50 మందికి పైగా విద్యార్దులను ఎక్కించుకుని బస్సులు రయ్ రయ్ మంటు కాలనీల నుంచి ప్రధాన రోడ్లపైకి వచ్చి దూసుకుపోతున్నాయి. బస్సులలో కనీసం నిల్చోవడానికి సైతం చోటు లేకపోయిన చిన్న చిన్న పిల్లలను ఎక్కించుకుంటున్న తీరును చూసిన చాలా మంది పాఠశాల యజమాన్యాల తీరుపై మండిపడుతున్న రవాణ, పోలీసు యంత్రాంగం మాత్రం కనీసం స్పందించడం లేదు. పోలీసు స్టేషన్‌ల ముందునుంచి ఇలాంటి బస్సులు, వ్యాన్‌లు, ఆటోలు యదేచ్చగా తిరుగుతున్నాయి. గురువారం నాడు వికారాబాద్ జిల్లా కేంద్రంలో నారాయణ పాఠశాల యజమాన్యం నిర్లక్షం మూలంగా నాలుగు సంవత్సరాల బాలుడు దుర్మరణం పాలయ్యారు. వ్యాన్‌లో ఆయా లేకపోవడం మూలంగానే ప్రమాదం సంబవించింది. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్, చెవెళ్ల, ఇబ్రహింపట్నం నియోజకవర్గాలో ఆరు మంది ఎక్కే ఆటోలు 20 మంది పిల్లలను ఆటో ముందు, వెనక, డ్రైవర్‌కు ఇరువైపులా కూర్చోపెట్టుకుని పోలీస్‌స్టేషన్‌ల ముందు నుంచి తిరగడం పరిపాటిగానే మారింది. గత సంవత్సరం స్కూల్ బస్సుల పుణ్యమా అని ఉమ్మడి జిల్లాలో దాదాపు 10 మంది వరకు పిల్లల ప్రాణాలు గాలీలో కలపిపోగా విద్యాసంవత్సరం ప్రారంబించి 15 రోజుల్లోనే నాలుగు సంవత్సరాల బాలుడిని వ్యాన్ బలీ తీసుకుంది. మామూళ్ల మత్తులో మునిగితేలుతున్న రవాణ, పోలీసు అధికారులు మరో విద్యార్ధి ప్రాణం గాలీలో కలవకముందే ఫీట్‌నెస్ లేని బస్సులతో పాటు సామర్ధంకు మించి పిల్లలను ఎక్కించుకుని అనుభవం లేని డ్రైవర్‌లు నడుపుతున్న వాహనాలపై కఠీన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.