Home వికారాబాద్ ఆర్టీసీ చర్చలు సఫలం

ఆర్టీసీ చర్చలు సఫలం

RTC negotiations are good

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ప్రధాన డిమాండ్లను పక్కనబెడితే 16 శాతం ఐఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.  చిన్నచిన్న పొరపాట్లకు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించకుండా చర్యలు తీసుకుంటామని హామీ లభించింది. ఆదివారం నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో ఇది వరకే సమ్మె నోటీసు ఇచ్చిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది.  సమ్మె నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మె నిర్ణయంపై కన్నెర్రజేసిన విషయం తెలిసిందే. ఆర్టీసి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కార్మికులు కోరకున్నా 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత సిఎం కేసీఆర్‌కు దక్కింది. రెండేళ్ల క్రితమే ఫిట్‌మెంట్ పెంచినా ఇటీవల కార్మికులు అనేక డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చారు. దీనిపై స్పందించిన సీఎం కార్మికుల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేమని, అవసరమైతే ప్రైవేటు సంస్థలతో బస్సులు నడుపుతామని హెచ్చరించారు. మంత్రులు హరీష్‌రావు, మహేందర్‌రెడ్డి, ఈటెల రాజేందర్ పలుమార్లు టీఎంయూ నాయకులతో చర్చలు జరిపారు.  ఈ అర్ధర్రాతి నుంచే బస్సులను నిలిపివేస్తామని ముందుగా కార్మిక నాయకులు ప్రకటించినా చర్చలు సఫలీకృతం కావడంతో హర్షం వ్యక్తం చేశారు.