Home బిజినెస్ రూపాయి, చమురు ధరలు కీలకం

రూపాయి, చమురు ధరలు కీలకం

Rupee and oil prices are crucial,

కీలక రంగాల ఉత్పత్తి, జూన్ వాహన సేల్స్‌పైనా దృష్టి పెట్టాలి: నిపుణులు

న్యూఢిల్లీ: ఈ వారం డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, క్రూడ్ ఆయిల్ ధరలు, స్థూల ఆర్థిక గణాంకాలు స్టాక్‌మార్కెట్లను శాసిస్తాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. జూన్‌లో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి, ఆటోమొబైల్ అమ్మకాల గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిణామాలపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. డెల్టా గ్లోబల్ పాట్నర్స్ వ్యవస్థాపకుడు దేవేంద్ర నెవ్గి మాట్లాడుతూ, ఈవారం అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్ వర్ధమాన దేశాల మార్కెట్లపై ప్రభావం చూపనుందని, అలాగే రూపాయి కదలికలు, ఆర్‌బిఐ నిర్ణయాలు ప్రధానమని అన్నారు. గతవారం క్రూడ్ ఆయిల్ ధరలు, భౌగోళికరాజకీయ పరిణామాలు భారత్ కరెన్సీని బలహీనం చేశాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపా యి మారకం విలువ 69కి చేరి జీవనకాల కనిష్టానికి పతనమైంది. గతవారం రూపాయి విలువ 63 పైసలు క్షీణించి 68.47 వద్ద ముగిసింది.
గతవారం దేశీ స్టాక్ మార్కెట్లను విదేశీ అంశాలు దెబ్బతీశాయి. అమెరికా -చైనా మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచడంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. దీంతో దేశీయంగానూ మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. వారాంతం శుక్రవారం నాటికి సెన్సెక్స్ 266 పాయింట్లు(0.75 శాతం) పడిపోయి 35,423 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 107 పాయింట్లు(1 శాతం) నష్టపోయి 10,714 వద్ద స్థిరపడింది. గత వారం చిన్న షేర్లలో భారీ అమ్మకాలు నమోదవగా, బిఎస్‌ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం పతనమైంది. స్మాల్ క్యాప్ మరింత అధికంగా 3 శాతంపైగా డౌన్ అయింది. సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా మోటార్స్ అత్యధికంగా దాదాపు 13 శాతం నష్టపోయింది.