Search
Saturday 22 September 2018
  • :
  • :

ఆందోళన అవసరం లేదు…

Rupee Was Expected To Fall To 70 Dollar

న్యూఢిల్లీ: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి జీవితకాల కనిష్ఠానికి పడిపోవడానికి బహిరంగ అంశాలే కారణమని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చందర్ గార్గ్ పేర్కొన్నారు. త్వరలో అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టర్కీ ఆర్థిక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠం 70.1కు పడిపోయింది. ఎస్‌బిఐ చైర్మన్ రజినీష్ కుమార్ మాట్లాడుతూ, డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ చాలా బలహీనపడిందని, అయితే ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి పటిష్టంగానే ఉందని అన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరుగుతున్న కారణంగా రూపాయి 69 నుంచి 70 మధ్య నిలకడగా ఉండే పరిస్థితి ఉండే అవకాశముందని అన్నారు. బాండ్లు, ఈక్విటీల్లో పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉన్నాయని ఆయన అన్నారు. దిగుమతిదారుల నుంచి ఆందోళన కారణంగా రూపాయి నష్టపోతుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటుందని, దూకుడుగా వ్యవహరిస్తే కూడా మార్కెట్ మంచిది కాదని అన్నారు.
కొద్ది రోజుల్లో సాధారణ స్థితి: హెచ్‌డిఎఫ్‌సి
రూపాయి మారక విలువ పతనంపై ఎక్కువగా ఆందోళన చెందటం లేదని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ పాండా అన్నారు. టర్కీ కరెన్సీ సంక్షోభ భయాలకు అంతర్జాతీయ మార్కెట్లు అతిగా స్పందించాయని, కొద్ది రోజుల్లో పరిస్థితి సాధారణ స్థికి చేరుకుంటుందని తెలిపారు. డాలర్ పెరుగుదల రూపాయి మారక విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. రూపాయి విలువ 70 వద్దకు పడిపోతుందని అంచనా వేయడం, టర్కీ ఆర్థిక సంక్షోభ భయాలు వర్ధమాన మార్కెట్లకు విస్తరించడం ఇందుకు కారణమని అన్నారు. రూపాయి విలువ 70.30 లేదా 70.50 దిగువకు వెళ్లదని అంచనా వేశారు. 2018 ప్రారంభం నుంచి చూస్తే పెట్టుబడుల ఉపసంహరణ ఎక్కువగా జరిగిందని భాస్కర్ పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, ఇతర ప్రపంచ మార్కెట్లలో లిక్విడిటీ తక్కువైందని, వర్ధమాన మార్కెట్లలోని సమస్యలు బహిర్గతమయ్యాయని తెలిపారు. ఈ సమస్య భారత్ మార్కెట్లకు లేదన్నారు. మార్కెట్‌లో విశ్వాసం సన్నగిల్లలేదని, పరిస్థితులు చేయిదాటిపోతే అప్పుడు రిజర్వు బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఇతర దేశాల కరెన్సీలు సైతం
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూపాయి విలువ 10 శాతం పతనమైంది. అమెరికా కరెన్సీ దిగుమతిదార్లు, బ్యాంకర్ల నుంచి డిమాండ్ బాగా పెరగడంతో రూపాయి బలహీనపడుతోందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. టర్కీ కరెన్సీ లైరా చరిత్రాత్మక కనిష్టానికి చేరడంతో ఈ ప్రభావం ఇతర కరెన్సీలనూ దెబ్బకొట్టింది. ఈ బాటలో రూపాయికి అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. అలాగే ఇతర దేశాల కరెన్సీలు కూడా టర్కీ కరెన్సీ లైరా దెబ్బకు డీలాపడ్డాయి. రష్యన్ రూబుల్ సైతం 15 శాతం తిరోగమించింది. ఈ బాటలో ఫిలిప్పీన్స్ పెసో, ఇండొనేసియన్ రుపయా 7.5 శాతం, దక్షిణాప్రికన్ ర్యాండ్ 15 శాతం, బ్రెజిలియన్ రియల్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. టర్కీ కరెన్సీ లైరా చరిత్రాత్మక కనిష్టం 7.24ను తాకింది. టర్కీ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. టర్కీ ప్రెసిడెంట్ టయ్యిప్ ఎర్డోగన్ ఆర్థిక వ్యవస్థపై నియంత్రణలు పెంచడం, అమెరికా ప్రభుత్వంతో దౌత్య వ్యతిరేకత, ఆర్థిక లోటు పెరగడం వంటి ప్రతికూల అంశాలు ఈ పరిస్థితికి కారణమయ్యాయి.

Comments

comments