Home అంతర్జాతీయ వార్తలు సిరియా నుంచి రష్యా సేనల ఉపసంహరణ : పుతిన్

సిరియా నుంచి రష్యా సేనల ఉపసంహరణ : పుతిన్

puthin

మాస్కో : సిరియా నుంచి రష్యా సేనలు పాక్షికంగా వైదొలుగనున్నాయి. తమ దేశ సేనల పాక్షిక ఉపసంహరణకు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతి న్ ఆదేశాలు వెలువరించారు. ఆకస్మికంగా పుతిన్ సోమవారం సిరియా సందర్శనకు వెళ్లారు. సిరియాలోని రష్యా వైమానిక స్థావరంలో నుంచి ఆయన టీవీలో మాట్లాడారు. మియిమిమ్ ఎయిర్‌బేస్ వద్ద పుతిన్‌కు సిరియా అధ్యక్షులు బషర్ అల్ అసాద్ స్వాగతం పలికారు. గత రెండేళ్ల నుంచి సిరియా అంతర్యుద్ధంలో రష్యా జోక్యం చేసుకొంటోంది. తమ మిత్రదేశం డమాస్కస్‌కు అనుకూలంగా ఐసిస్, ఇతర జిహాదీ సంస్థలను లక్షంగా చేసుకుని వైమానిక దాడులకు దిగుతోంది. తమ దేశ బలగాలను కొంత మేరకు ఉపసంహరించుకుంటున్నట్లు ఈ మేరకు రక్షణ మంత్రికి, సైనిక దళాల ప్రధానాధికారికి ఆదేశాలు వెలువరించినట్లు పుతిన్ తమ టీవీ ప్రసంగంలో తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల అణచివేతలో రష్యా నుంచి తమకు పూర్తి సహకారం అందిందని ఇందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. పుతిన్, అసాద్ చిరునవ్వులు చిందిస్తూ, కరచాలనం చేసుకుంటున్న ఫోటోలు నెట్‌లో తళుక్కుమన్నాయి. ఐసిస్ అణచివేతలో దాదాపుగా విజయం సాధించినట్లు సిరియా, రష్యాలు భావిస్తున్నాయి.