Home ఆఫ్ బీట్ రుష్యశృంగుడు

రుష్యశృంగుడు

Rusya

కశ్యపప్రజాపతి కుమారుడైన విభాండకుడికి ఓ నది తీరంలో ఒక మగ శిశువు దొరుకుతుంది. ఆ శిశువుకు రుష్యశృంగుడు అనే పేరు పెడతాడు. చిన్నతనం నుంచి రుష్యశృంగుడిని అల్లారుముద్దుగా ఆశ్రమ పరిసరాలు దాటనివ్వకుండా, నియమ, నిష్ఠలతో పెంచుతూ వేదవేదాంగవిదుని చేస్తాడు. రుష్యశృంగునికి ఆ అడవిలోని చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు తప్ప మరేమీ తెలియదు. అతనికి స్త్రీ, పురుష భేదం లేదు. నిత్యాగ్నిహోత్రియై లోకప్రసిద్ధులైన వ్రతిత్త్వము, ప్రాజాపత్యములనే బ్రహ్మచర్యములను పాటిస్తూ, పితృసేవ చేసుకుంటూ కాలం గడుపుతుండేవాడు. ఆ రోజులలో అంగరాజ్యాధిపతియైన రోమపాదుడు రాజ్యంలో తీవ్ర కరువు తాండవిస్తోంది. ఈ కరువంతటికి తాను చేసిన పాపాలే కారణమని తెలుసుకున్న రోమపాదుడు వాటిని తొలగించుకోవడానికి తానేం చెయ్యాలో చెప్పండంటూ తన మంత్రులనూ, పండిత, పురోహితులనూ కోరుతాడు. అప్పుడు వారు “మహారాజా! అఖండ బ్రహ్మచర్యదీక్షావ్రతుడు, మహాశక్తిసంపన్నుడైన రుష్యశృంగుడిని మన రాజ్యానికి ఆహ్వానించి, మీ కుమార్తె అయిన శాంతను అతనికి వివాహం చేయండి. రుష్యశృంగుని పాదస్పర్శతో మీ పాపం ప్రక్షాళనమై, ప్రజలంతా సుఖ శాంతులు పొందగలరు. రుష్యశృంగునకు తపస్సు, స్వాధ్యాయనము, వనవాస జీవితము తప్ప మరేమీ తెలియవు. ముఖ్యంగా స్రీలను చూసిగానీ, విషయవాంఛలను అనుభవించిగానీ ఎరుగడు. కనుక, వయో, రూప, లావణ్య, విద్యాచతురులైన వారాంగలను ఈ కార్యానికి ఉపయోగించితే వారు తమ సౌందర్యంతో రుష్యశృంగుని ఆకర్షించి మన రాజ్యానికి తీసుకుని రాగలరు” అని సలహా ఇస్తారు. దీనికి మహారాజు సరేనన్నాడు.
సర్వాంగ సౌందర్యనిధులైన వారకాంతలు రుష్యశృంగుని ఆశ్రమానికి సమీపంలో నివాసం ఏర్పరచుకుంటారు. ఒకరోజు సౌందర్యశోభితులైన ఆ వారకాంతలను చూసిన రుష్యశృంగుని మనస్సులో ఏదో తెలియని చిన్న కదలిక అలలా కదిలింది. ఇది గమనించిన ఆ వారకాంతలు ఆయన దగ్గరికి వెళ్లి “ ఓ బ్రాహ్మణోత్తమా! నీవెవరు? నీ జీవన విధానమేమిటి? జనశూన్యమైన ఈ ఘోరారణ్యంలో ఎలా ఒంటరిగా సంచరిస్తున్నావు? ” అని అడిగారు. “నేను విభాండకమహర్షి కుమారుడను. నా పేరు ఋశ్యశృంగుడు. మీరంతా నా ఆశ్రమానికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యాలి” అని అర్ధించాడు. ఆ వారకాంతలు అతని ఆశ్రమానికి వెళ్ళి, అతని ఆతిథ్యం స్వీకరించి, వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన దగ్గరనుంచీ ఋశ్యశృంగుని మనసు అదుపులో లేకుండాపోతోంది. ఎప్పుడూ కూడా అతని మనుసులో ఆ వారకాంతలే గుర్తుకొస్తున్నారు. నిద్ర కూడా పోవడం లేదు. మరుసటిరోజు ఆ వారకాంతల నివాసం చేరుకుంటాడు. అతని కోసమే ఎదురుచూస్తున్న ఆ వారకాంతలు, రుష్యశృంగుని కౌగిలించుకుని “స్వామీ! మీ రాకకోసమే ఎదురు చూస్తున్నాం. మీరు కోరగానే మీరిచ్చిన అతిథి సత్కారం అందుకున్నాం. అలాగే మీరుకూడా మా ఆశ్రమానికి వచ్చి, మా ఆతిథ్యం సీకరించాలి” అని కోరారు. రుష్యశృంగుడు వారి అభ్యర్ధనను చిరునవ్వుతో అంగీకరిస్తాడు. ఆ వారకాంతలు తీయతీయని మాటలతో అతనిని కవ్విస్తూ, “ఇక్కడే మా ఆశ్రమం” అంటూ రుష్యశృంగుని అంగరాజ్యం తీసుకువచ్చారు. ఋశ్యశృంగుడు అంగరాజ్యంలో ప్రవేశించగానే, ఆకాశం కారుమేఘావృతమై, కుండపోతగా వర్షం కురిసింది. సంతృప్తిచెందిన రోమపాదుడు, రుష్యశృంగునికి స్వాగతమర్యాదలు జరిపి, అతిథి సత్కారాలు చేసి “మహాత్మా! ప్రజాక్షేమం కోసం మిమ్ములను ఈ విధంగా తీసుకునివచ్చినందుకు క్షమించండి. మీ రాకతో నా రాజ్యం సుభిక్షమైంది.” అని అంటాడు. విభాండకుడి అంగీకారం మేరకు మహారాజు తన కుమార్తె శాంతను రుష్యశృంగుడుతో వివాహం జరిపిస్తాడు.