Home తాజా వార్తలు మే చివరి వారంలో ఖరీఫ్ రైతుబంధు

మే చివరి వారంలో ఖరీఫ్ రైతుబంధు

Rythu Bandhuహైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని మే చివరి వారంలో అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తును చేస్తోంది. సీజన్ ప్రారంభం కంటే ముందే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున సొమ్ము జమ కానుంది. ఇప్పటికే భూప్రక్షాళన ద్వారా ఇప్పటి వరకు పట్టాదారులుగా నమోదైన రైతుల వివరాలను తమకు ఇవ్వాలని రెవిన్యూ శాఖను కోరింది. జూన్ నెల మొదటి తారీఖు నుంచే ఖరీఫ్ ప్రారంభమవుతుందని, ముందస్తుగా మే నెల చివరి వారంలో రైతులకు పెట్టుబడి అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రైతుబంధు అమలు కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు సిఎం కెసిఆర్ తన ప్రసంగంలో చెప్పారు.

అలాగే ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేయనున్నారు. 201819 ఆర్థిక సంవత్సరంలోనూ రూ. 12 వేల కోట్లు కేటాయించారు. గత ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం మొత్తం 53.68 లక్షల మంది రైతులకు 1.42 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇందులో అత్యధికంగా 48.19 లక్షల మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఖరీఫ్‌లో రైతుబంధు కింద ఎకరాకు రూ. 4 వేల చొప్పున 50.88 లక్షల మంది రైతులకు రూ.5257 కోట్లు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. అలాగే రబీలో 49.03 లక్షల మంది రైతులకు రూ. 5,244.26 కోట్లు అందజేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది.

రెండు విడతల్లో కలిపి పెట్టుబడి సాయం కింద ఇచ్చిన మొత్తం రూ. 10,501 కోట్లుగా ఉంది. ఇదే అంచనా ప్రకారం ఒక కోటి 30 లక్షల యాభై వేల ఎకరాలకు రూ.5 వేల చొప్పున రూ.6575 కోట్లు ఖరీఫ్ సీజన్‌కు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రెవిన్యూ శాఖ నుంచి వచ్చిన భూముల ఆధారంగా ఈ వివరాలపై స్పష్టత రానుంది. రైతుబంధు కింద ప్రతీ రైతుకు ఏడాదికి రూ. 8 వేల చొప్పున రెండు విడతలుగా అందజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల గతం కంటే ఈసారి రైతులు అధికంగా లబ్దిపొందనున్నారు.

పాత మార్గదర్శకాలే

ఈసారి మార్గదర్శకాలు కొంతమేరకు సవరిస్తారన్న ప్రచారం జరుగుతోంది. పదెకరాలు మించిన ధనిక రైతులకు నిలుపుదల చేస్తారన్న ప్రచారమూ ఉంది. గత రబీలో రైతుబంధు అమలు సందర్భంగా 50 ఎకరాలు దాటిన రైతులకు సాయాన్ని నిలుపుదల చేసినట్లు సమాచారం. అలాంటి నిర్ణయం ఏదైనా ఉంటుందని అంటున్నారు. అయితే వ్యవసాయశాఖ వర్గాలు మాత్రం అలాంటిది ఏమీ ఉండదని, గతేడాది ఎలాగైతే అందరికీ ఇచ్చారో అలాగే ఉంటుందని అంటున్నారు.

నేరుగా రైతు ఖాతాకే

గత ఏడాది ఖరీఫ్‌లో పట్టాదారు పాసుపుస్తకాల నెంబర్, రైతు పేరు, పెట్టుబడి సాయం మొత్తం వివరాలతో వివిధ బ్యాంకులతో వ్యవసాయ శాఖ చెక్కులను ముద్రించింది. ఆ తరువాత వాటిని ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి పంపిణీ చేశారు. వాటిని రైతులు బ్యాంకులకు వెళ్లి నగదుగా మార్చుకున్నారు. ఇక రబీ విషయానికి వచ్చేసరికి కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నిబంధనల మేరకు చెక్కులు కాకుండా రైతుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి, వారి అకౌంట్‌లోనే పెట్టుబడి సొమ్మును జమ చేశారు. రైతుల వివరాలన్ని ప్రభుత్వం దగ్గర ఉండటం, చెక్కుల పంపిణీ పెద్ద పనిగా ఉండటంతో ఈసారి నేరుగా రైతుల ఖాతాల్లోనే సొమ్మును జమ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.

Rythu Bandhu Kharif disbursement in last week of May