Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

షబ్నవీస్ బతికే ఉంటాడు…

Shabnavis

చాలా మంది పుడుతుంటారు, చస్తూ ఉంటారు కొందరే చరిత్రలో నిలిచిపోతారు. భవిష్యత్తుకు మార్గదర్శకులవుతారు. అది వారు చేసే పనులను బట్టి నిర్ణయించబడుతుంది. తెలుగు సాహిత్యంలో కూడా అదే జరిగింది. జరుగుతూ ఉంది. నాటి నుండి నేటి వరకు చాలా తక్కువ మంది రచనాకారులే సాహితీ జగత్తు నేలారు. గొప్ప గొప్ప స్థానాలను అలంకరించారు. సాహిత్యానికి మెరుగులు దిద్ది మెరుపులా మెరిసారు. అలాంటి కొందరిలో షబ్నవీస్ వెంకట రామనర్సింహారావు గారొకరు. పోరుగడ్డ నల్లగొండలో 1896 సం॥లో జననం పొందిన ఆయన దేశాభివృద్ధికి, భాషాభివృద్ధికి విశేషకృషి సల్పారు. అందులో భాగంగానే తెలంగాణా వాదాన్ని నిలబెట్టడంలోను సమర్థులయ్యారు.
తొలుత విద్య అందరికి అందాలని సత్సంకల్పంతో 1918, మార్చి18న నల్లగొండలో ఆంధ్రసరస్వతి నిలయమనే గ్రంథాలయం స్థాపించారు. అలాగే తెలంగాణ చరిత్రలో మైలురాయిగా చెప్పుకునే సంఘటన నీలగిరి పత్రికాస్థాపన. తెలంగాణ వ్యాప్తంగా(నిజాం రాష్ట్రంలో) జరిగే జనసంఘం కార్యక్రమాలను మేధావులకు అందించే ప్రయత్నమే షబ్నవీస్‌గారి ‘నీలగిరి’ వారపత్రికాస్థాపన.
1922 ఆగస్టు 24న మాడపాటి హనుమంతరావు, టేకుమల్ల రంగారావు, అక్కినేపల్లి జానకిరామారావు వంటి వారి ప్రోత్సాహాలతో తెలంగాణ జాగృతే లక్ష్యంగా నీలగిరి వారపత్రికను షబ్నవీస్‌గారు స్థాపించి తెలంగాణ జాతి జనుల గుండెలను కదిలింపజేసే సమాచారాన్ని అందించారు. చైతన్యం దిశగా సాగారు. అందులో మచ్చుకు… 1926లో నిజాం ప్రాంత ప్రజలు వలసబోయిన ఆంధ్రులని పేర్కొంటూ ఏద్దూరి అన్నపూర్ణయ్య తీర్మానించారు. దాన్ని ఖండిస్తూ నీలగిరి పత్రిక చేసిన ఉద్యమం మరపురానిది మరచిపోనిది. ఇక ఒద్దిరాజు సోదరులు ‘తెనుగు పత్రిక’ ఆర్థిక ఇబ్బందులకు గురైనప్పుడు విరాళాలు సేకరించడంలో నీలగిరి పత్రిక యాజమాన్యం కృషిచేసి దయార్థ్ర హృదయతను చాటుకుంది. నిజాం వార్తలు, నీలగిరి గ్రంథాలయం, నవలా ప్రపంచం, తాళపత్ర గ్రంథాలు, వృత్తాంతాలు అలాగే హాస్యోక్తులతో సాగే ‘కుప్పిలి పురాణం’ శీర్షిక, కె.రాములు గారి ‘బుద్దుని సందేశం’ శీర్షికలతో పాటు శేషాద్రి రమణకవులు, వెంకట రామానుజాచార్యులు, గంగుల శాయిరెడ్డి, కోదాటి రామకృష్ణారావు, ఆదిరాజు వీరభద్రరావు వంటి వారి రచనలను అందించిన గొప్ప తెలంగాణ పత్రిక నీలగిరి. ఈ పత్రిక స్థాపన తర్వాతే తెనుగు, గోలకొండ వంటి పత్రికలు వెలువడ్డాయి. అలా పత్రికా రంగంలో కాక సమాచార ప్రసారంలో జనాదరణ పొందిన తొలి తెలంగాణ పత్రిక ఈ నీలగిరి.పత్రికలో సమాజానికి హితాన్ని చేకూరుస్తూనే 1921లో సంస్కారిణి గ్రంథమాలను, వీరేశలింగం కంఠాభరణం గ్రంథమాలను ఉస్మానియా ముద్రణాలయంను స్థాపించిన సాహిత్యోద్యమకారుడు షబ్నవీస్ గారు.
ఇందులో భాగంగా శేషాద్రి రమణకవులు మిత్రుడైన షబ్నవీస్ సతీవియోగం చెందినప్పుడు ఆమె స్మృత్యర్థం ‘ఉదయ లక్ష్మి’ (1923) శతకాన్ని ఆవిష్కరించారు. ఇక షబ్నవీస్ గారు రచించిన ‘బాలికా విలాపం’ (1921) నాటి దురాచారాలను ఎండగట్టి సంఘసంస్కరణ దిశగా సాగిన రచన అచ్చురూపం దాల్చింది. తర్వాత అనేక సాహితీ కార్యక్రమాలు చేపట్టారు షబ్నవీస్‌గారు.ఇంతటి ఘన చరిత్ర గలిగిన షబ్నవీస్ తెలంగాణలో తొలి పత్రికా స్థాపకుడిగా, సాహిత్యోద్యమమూర్తిగా వెలుగొందిన వాడు షబ్నవీస్. ఆంధ్రుల పాలనలో ఎవరూ గుర్తుంచలేకపోయినా వారు ఈ మట్టిలో ఎప్పటికీ బతికే ఉంటారు. తక్కువ కాలం జీవించిన షబ్నవీస్ 1929న దివంగతులైనా చరిత్ర పుటల్లో, వ్యక్తుల హృదయాల్లో సజీవంగా బతికే ఉంటారు.

– (తెలంగాణలో మొట్టమొదటి పత్రిక ‘నీలగిరి’ 1922
ఆగస్టు నెలలో ప్రారంభమైంది)

Comments

comments