Home వార్తలు సబ్జా గింజలతో మధుమేహం దూరం

సబ్జా గింజలతో మధుమేహం దూరం

sabzaసబ్జా గింజల్లో కేలరీలు తక్కువ, ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మల మూత్ర సమస్యల్ని నివారిస్తుంది. శరీరం బయటనే కాకుండా లోపల భాగాలను కూడా కాపాడుతుంది. విటమిన్లు, పోషకాలు, ఇనుము  అధికంగా ఉండటంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  వీటిలో ఓమెగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.  దీనివల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మంచి యాంటీ బయాటిక్‌లా కూడా పనిచేస్తాయి. ఈ గింజలు కేవలం నీటితోనే కాకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలతో కలిపి తీసుకోవచ్చు. ఇవి చర్మ సమస్యల్ని అరికడతాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

  • సబ్జా గింజలో పీచు ఎక్కువగా ఉంటుంది. మలబద్దకాన్ని అరికడుతుంది.
  • ఆహారం తీసుకునే ముందు గ్లాసు నీళ్లలో సబ్జా గింజలను వేసుకుని తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం.
  •  ఈ గింజలు జీర్ణవ్యవస్థ సక్రమంగా జరిగేలా చూస్తుంది.
  • గ్లాసు నీటిలో నాలుగు చెంచాల సబ్జా గింజలను వేసి నానబెట్టాలి. అరగంట తర్వాతగ్లాసు పచ్చిపాలలో వేసుకుని కొన్ని చుక్కల వెనిల్లా వేసుకుని తాగాలి. ఇది టైప్ టూ మధుమేహంతో బాధపడేవారికి ఉపశమనాన్ని ఇస్తుంది.
  • సబ్జా గింజల పాలను కాఫీ, టీలకు బదులుగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట తగ్గుతాయి.
  • మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడించే విటమిన్ ఇ కూడా ఇందులో ఉంది.
  • ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాస్తే త్వరగా తగ్గుతాయి.
  • ఈ గింజల్ని నీళ్లలో కలుపుకుని బాగా ఉబ్బిన తర్వాత తాగితే తలనొప్పి, మైగ్రేన్‌లాంటి సమస్యలు ఇట్టే పోతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.
  • చిన్న కప్పు సబ్జా గింజలను తరచుగా తీసుకోవడం వల్ల కావాల్సిన ఇనుము, పోషకాలు శరీరానికి అందుతాయి.
  • గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలు పీడిస్తున్నప్పుడు ఈ గింజల్ని నీళల్లో నానబెట్టి నేరుగా తినాలి.
  • క్రీడాకారులు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. వాళ్లు ఈ విత్తనాలను రోజూ తీసుకోవాలి.
  • ఈ గింజలను రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.
  • శ్వాస సంబంధిత వ్యాధులతో బాధ పడేవారు గోరు వెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన ఈ గింజలను కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శ్వాస బాగా ఆడుతుంది.