Home సినిమా ‘విన్నర్’తో తేజూ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తాడు

‘విన్నర్’తో తేజూ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తాడు

Winner Pre Release Function Scenesసాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన సినిమా ‘విన్నర్’. మహా శివరాత్రి కానుకగా ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదలకానుంది.  ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. సినిమా ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.

కార్యక్రమంలో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ “ఈ చిత్రంతో తమన్ నాకు సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. సినిమాలోని ఒక్కో పాటను రిలీజ్ చేసిన మహేష్‌బాబు, అనిరుధ్, రవితేజ, మురుగదాస్, సమంతలకు థాంక్స్. రకుల్‌ప్రీత్ సింగ్ చక్కగా నటించింది. తనతో నాకిది మొదటి సినిమా. ఇక ఒకసారి కళ్యాణ్ మామయ్య (పవన్‌కళ్యాణ్) నాతో మాట్లాడుతూ… ‘అవార్డులు, రివార్డులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఓటమి వచ్చినప్పుడు  నీ చుట్టూ ఎవరుంటారన్నదే ముఖ్యం’ అన్నారు. ఇది నిజమే. నా గత సినిమాలు కొన్ని ఆడకపోయినా నా అభిమానులు అండగా నిలిచారు. ఈ రెండేళ్లలో ఏం గెలుచుకున్నావని ఎవరైనా అడిగితే… మెగా ఫ్యాన్స్ అభిమానం గెలుచుకున్నానని చెబుతా”అని తెలిపారు. దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ “తేజూతో సినిమా చేస్తున్నంతసేపు సొంత తమ్ముడితో సినిమా చేసినట్టుంది. తేజూని మానిటర్‌లో చూస్తున్నప్పుడు చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లకు నేను దర్శకత్వం వహించినట్టు అనిపించింది.

తను దర్శకుల హీరో. ఈ సినిమాలో గుర్రంతో చాలా రిస్కీ షాట్స్ చేశాడు. రెండు, మూడుసార్లు పడ్డాడు. నేను వెంటనే పరిగెత్తుకొని వెళ్లి ఎలా ఉందనగానే ఏం కాలేదనేవాడు. ‘విన్నర్’తో నటుడిగా నెక్స్ లెవెల్‌కు వెళ్తాడు. రకుల్‌తో నాకిది రెండో చిత్రం. అనుష్క తర్వాత అంత అంకితభావాన్ని రకుల్‌లో చూశాను”అని అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ “తేజూ, నా కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ ‘విన్నర్’తో హిట్ కొడతాం.

తేజూకి సాంగ్స్ చేసేటప్పుడు నాకు చిరంజీవి, పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్ గుర్తుకొస్తారు. గోపీచంద్, నాది హిట్ కాంబినేషన్. మా ప్రతి సినిమా హిట్టే”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రకుల్‌ప్రీత్ సింగ్,  చిత్ర నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), బివిఎస్‌ఎన్ ప్రసాద్, పివిపి, జెమిని కిరణ్, రాజీవ్ రెడ్డి, శ్రీనువైట్ల, మెహర్ రమేష్, సురేందర్ రెడ్డి, అబ్బూరి రవి, బాబీ, అనిల్ రావిపూడి, బివిఎస్ రవి, సంకల్ప్, ఛోటా కె.నాయుడు, పరుచూరి వెంకటేశ్వరరావు, గౌతంరాజు, రామజోగయ్య శాస్త్రి, వెలిగొండ శ్రీనివాస్, యాంకర్ అనసూయ తదితరులు పాల్గొన్నారు.