Home తాజా వార్తలు ఆయ‌న మిలియ‌న్లలో ఒక‌రు: సాయి ప‌ల్ల‌వి

ఆయ‌న మిలియ‌న్లలో ఒక‌రు: సాయి ప‌ల్ల‌వి

 

తన అభిమాన హీరో సూర్యతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని మలయాళ భామ సాయి ప‌ల్ల‌వి పేర్కొంది. తమిళ స్టార్ హీరో సూర్య, సాయి పల్లవి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించన సినిమా ‘ఎన్జీకే’. ఈ సినిమాకు సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించారు. కాగా, ప్రమోషన్ లో భాగంగా సోమవారం సాయంత్రం చెన్నైలో ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ విడుదల వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య‌పై సాయిప‌ల్ల‌వి ప్రశంస‌ల జ‌ల్లు కురిపించింది.

‘నేను సూర్య సర్‌కు వీరాభిమానిని. సినిమా షూటింగ్‌లో సూర్యను ఎక్కువగా గమనించేదాన్ని. దీంతో ఆయన సెట్‌లో అసౌకర్యంగా ఫీల్‌ అయ్యి ఉంటారు. షాట్‌కు ఆయన ఎలా సిద్ధమౌతున్నారు… ఆ పాత్రలో ఎలా ఒదిగిపోతున్నారని బాగా గమనించేదాన్ని. సూర్య సెట్‌లోని అందరు టెక్నీషియన్లతోనూ ప్రేమగా మాట్లాడుతుంటారు. వారి కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకుంటుంటారు. ఆయనది ఎంతో మంచి వ్యక్తిత్వం. నేను మరో 20 ఏళ్లు పనిచేసినా.. సూర్య పడ్డ శ్రమలో సగం కూడా చేయలేను. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన మిలియన్‌లో ఒకరు. ఈ ప్రాజెక్టులో నేను నటించడం సంతోషంగా ఉంది. నేను ఓ సీన్‌ కోసం 50 టేక్‌లు తీసుకున్నప్పటికీ సూర్య విసుగు తెచ్చుకోలేదు, నేను సౌకర్యవంతంగా ఉండేలా ప్రవర్తించారు’ అని సాయిపల్లవి చెప్పింది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.కాగా, మే 31న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Sai pallavi speech at NGK Audio Launch