Home స్కోర్ సెమీస్‌లోనే సైనా ఔట్

సెమీస్‌లోనే సైనా ఔట్

మలేసియా మాస్టర్స్ టోర్నీ
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సైనా ఓటమి పాలైంది. చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్)తో జరిగినసెమీస్‌లో సైనాకు చుక్కెదురైంది. ఏకపక్షంగా సాగిన పోరులో మారిన్ 2116, 2113 తేడాతో సైనాను చిత్తు చేసింది. సెమీస్ చేరే క్రమంలో నజోమి ఒకుహరను ఓడించిన సైనా ఈసారి మాత్రం మారిన్ ధాటికి ఎదురు నిలువలేక పోయింది. ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించిన మారిన్ అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆట ప్రారంభంలో సైనా కాస్త బాగానే ఆడింది. కానీ, మారిన్ తర్వాత పుంజుకుంది. సైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేసింది.

ఇదే క్రమంలో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో అయితే మరింత చెలరేగి పోయింది. తీవ్ర ఒత్తిడికి గురైన సైనా వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో సఫలమైన మారిన్ అలవోకగా రెండో గేమ్‌ను దక్కించుకుంది. మరోవైపు ఈ ఏడాది జరిగిన తొలి టోర్నీలో టైటిల్ సొంతం చేసుకోవాలని భావించిన భారత స్టార్ సైనాకు చేదు అనుభవమే మిగిలింది. సైనా ఓటమితో మలేసియా టోర్నీలో భారత పోరాటానికి తెరపడింది. ఇంతకుముందే పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్‌లో భారత్‌కు ఓటమి ఎదురైన విషయం తెలిసిందే.

Saina defeated in Malaysia women’s singles semi finals