Home జాతీయ వార్తలు సల్మాన్‌కు బెయిల్

సల్మాన్‌కు బెయిల్

salman

*దేశం వీడి వెళ్లరాదని షరతు
7న తిరిగి న్యాయస్థానానికి
ప్రత్యేక విమానంలో ముంబయికి

జోధ్‌పూర్: కృష్ణ జింకల వధ కేసులో జైలు పాలయిన అగ్రనటుడు సల్మాన్‌ఖాన్‌కు బె యిల్ మంజూరైంది. స్థానిక న్యాయస్థానం శనివారం ఈ నటుడికి బెయిల్ ఇచ్చింది. రూ. 5౦ వేల వ్యక్తిగత బాండు, రూ. 25 వేల చొప్పున రెండు పూచీకత్తులతో సల్మాన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జిల్లా సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషి ప్రకటించారు. దీంతో పలు భారీ బడ్జెట్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్న హీరోకు తాత్కాలిక విముక్తి దక్కింది. బెయిల్‌కు  సంబంధించిన అన్ని లాంఛనాలు పూర్తి చేసిన మీదట సల్మాన్‌ను శనివారం సాయంత్రం విడుదల చేస్తారని, బెయిల్ మంజూరీ సందర్భంగా వెల్లడించారు. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో సల్మాన్ జైలు నుంచి బయటకు వచ్చారు. తమ వాహనంలో వెళ్లిపోయారు. బెయిల్ మంజూరీ సందర్భంగా నటుడికి కొన్ని షరతులు కూడా విధించారు. న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం వదిలిపెట్టి వెళ్లరాదని, వచ్చే నెల 7 వ తేదీన తిరిగి న్యాయస్థానానికి హాజరు కావాలని జడ్జి ఆదేశించినట్లు బిష్ణోయ్ తెగ న్యాయవాది మహీపాల్ బిష్ణోయ్ తెలిపారు. కృష్ణ జింకల వేట వాటి వధపై సల్మాన్‌కు వ్యతిరేకంగా బిష్ణోయ్ వర్గీయులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సల్మాన్‌కు బెయిల్ దక్కడంపై ఆ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము దీనిని సవాలు చేస్తూ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేస్తామని లాయర్ మహీపాల్ తెలిపారు. బెయిల్‌పై విచారణ సమయంలో సల్మాన్ సోదరీలు అల్విరా, అర్పితలు కోర్టు హాల్‌లోనే ఉన్నారు. సోదరుడికి బెయిల్ మంజూరుతో వారిలో సంతోషం వ్యక్తం అయింది. కృష్ణజింకల వధ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడగానే సల్మాన్‌ను జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. శుక్రవారమే సల్మాన్ లాయర్లు ఆయన తరఫున జిల్లా న్యాయస్థానంలో బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారమే విచారణ జరగాల్సి ఉంది. అయితే కేసును పూర్తిగా పరిశీలించాల్సి ఉందని, తక్షణ విచారణకు వీలు కాదని న్యాయమూరి తెలిపారు. శనివారానికి విచారణను వాయిదా వేశారు. అయితే శుక్రవారం రాజస్థాన్‌లో భారీ స్థాయిలో శుక్రవారమే జడ్జిల బదిలీలు జరిగాయి. విచిత్ర రీతిలో ఈ బదిలీలీ జాబితాలో సల్మాన్‌కు శిక్ష విధించిన జోధ్‌పూర్ న్యాయస్థానం జడ్జి ఖత్రి, ఇప్పుడు బెయిల్ ఇచ్చిన రవీంద్ర కుమార్ జోషీ కూడా ఉన్నారు. బెయిల్‌పై విచారణ జరపాల్సి ఉన్న జోషీ కూడా బదిలీ కావడంతో శనివారం ఉదయం వరకూ బెయిల్ కేసుపై సస్పెన్స్ నెలకొంది. అయితే జోషినే సల్మాన్ బెయిల్ దరఖాస్తును విచారణకు స్వీకరించడంతో దీనిపై విచారణకు కూడా అవకాశం దక్కింది. ఆయన కోర్టుకు రావడం విచారణను పూర్తి చేసి, బెయిల్ మంజూరు చేయడంతో సల్మాన్‌లో అప్పటివరకూ నెలకొని ఉన్న రియల్ సస్పెన్స్ వీడిపోయింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ గురువారం రాత్రి నుంచి జైలులో ఉన్నారు. రెండు రాత్రులు ఆయన నిద్రలేని రాత్రులుగా గడపాల్సి వచ్చింది. తమ క్లయింట్‌కు బెయిల్ దక్కిందని, జోధ్‌పూర్ కోర్టు తీర్పునుసవాలు చేస్తూ తాము త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని సల్మాన్ ఖాన్ తరఫు లాయరు హెచ్‌ఎం సరస్వత్ వెల్లడించారు. తీర్పును పూర్తిగా పరిశీలించిన తరువాత తాము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు. కృష్ణ జింకల వధ తరువాత 2౦ ఏళ్లకు సల్మాన్ కేసులో తీర్పు వెలువడింది. ఈ కేసులో హీరో సల్మాన్ దోషిగా ఖరారయి ఐదేళ్ల జైలు పాలు కాగా , నిందితులుగా ఉన్న సహనటులు సైఫ్ అలీఖాన్, టబూ, నీలం, సోనాలీ బెంద్రేలు నిర్దోషులుగా బయటపడ్డారు. ‘నటులు అందులోనూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వారు నిజజీవితంలో ప్రవర్తనపరంగా ఆదర్శంగా ఉండాలి. హీరోల ప్రతి చర్యను ఫ్యాన్స్ అదో ఫ్యాషన్‌గా అనుకరిస్తారు. ఇక వారు చేసే ఏ పని అయినా ఆచరిస్తారు. ఈ కోణంలో హీరోలపై గురుతర బాధ్యత ఉంది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ప్రత్యేక విమానంలో ముంబైకి సల్మాన్
బెయిల్‌పై విడుదల అయిన సల్మాన్ వెంటనే గట్టి భద్రత నడుమ జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ముంబై చేరుకున్నారు. సల్మాన్‌ను ముంబైకి తీసుకువెళ్లేందుకు వచ్చిన కొందరు సన్నిహితులు, సల్మాన్ చెల్లెళ్లు తిరిగి ఈ విమానంలో ముంబైకి వెళ్లారు.