Search
Wednesday 21 November 2018
  • :
  • :

మనసారా ప్రేమించి సమంతను పెళ్లి చేసుకున్నా : నాగచైతన్య

Chi-La-Sow

‘ఏ మాయ చేశావె’ సినిమాలో తొలిసారిగా కలిసి నటించి మంచి హిట్‌ను అందుకున్నారు నాగచైతన్య, సమంత. ఈ జంట మనం, ఆటోనగర్ సూర్య చిత్రాల్లో కూడా కలిసి నటించారు. ఈ నేపథ్యంలో ప్రేమలో పడ్డ ఈ జంట వివాహం గత ఏడాది జనవరిలో జరిగింది. అయితే వేరే ఆప్షన్ లేక సమంతను పెళ్లి చేసుకున్నానని సరదాగా చెప్పాడు నాగచైతన్య. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘చి.ల.సౌ’. సుశాంత్, రుహానీ శర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నాగచైతన్య మాట్లాడుతూ “నాకు సమంత ‘ఏ మాయ చేశావె’ చిత్రం నుంచి పరిచయం. ఏడేళ్ల నుంచి ఆమె వెంట పడితే రెండేళ్ల క్రితం నా ప్రేమకు ఓకే చెప్పింది సమంత. అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. చివరికి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వేరే ఆప్షన్ లేక”అని నవ్వుతూ చెప్పారు. సమంత మాట్లాడుతూ “నేను చైతూ వెంట పడితే.. అతను చాలా మంది అమ్మాయిల వెంట పడ్డాడు. అందరు అయిపోయిన తర్వాత చివరికి నా వెంట పడి పెళ్లి చేసుకున్నాడు”అని సరదాగా తెలిపారు. దీంతో చైతూ మాట్లాడుతూ “నా జీవితంలో చాలా మంది అమ్మాయిలు లేరు. నేను మనసారా ప్రేమించి సమంతను పెళ్లి చేసుకున్నాను.

ఆమెతో గడిపిన అందమైన క్షణాలను మరిచిపోలేను”అని పేర్కొన్నారు. ఇక సినిమా గురించి నాగచైతన్య మాట్లాడుతూ “7,8 నెలల క్రితం సమంత నాతో ‘రాహుల్ రవీంద్రన్ మనల్ని కలిసి ఓ స్క్రిప్ట్ చెబుతాడట’ అని చెప్పింది. రాహుల్ నటించబోయే సినిమా అది అనుకున్నాను. కానీ తను దర్శకత్వం చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాను. కథ వినగానే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఓ రాత్రి జరిగే కథ ఇది. ఎలాగైనా ఈ సినిమాలో భాగం అయితే బావుండు అనిపించి నాన్న నాగార్జునతో ఈ విషయం చెప్పాను. నాన్న ఈ సినిమా చూశారు. ఈ చిత్రం ఆయనకు బాగా నచ్చింది. సినిమాలో సుశాంత్ చాలా కొత్తగా కనపడతాడు. రుహాని చాలా బాగా నటించింది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమా చక్కగా కనెక్ట్ అవుతుంది”అని అన్నారు. సమంత మాట్లాడుతూ “రాహుల్ చాలా హార్డ్‌వర్కర్. అతను ఈ సినిమా చూడమని చెప్పగానే భయపడతూ చూశాను. ఎందుకంటే అతను దర్శకుడు కావాలని ఆశగా చేసిన సినిమా ఇది. సినిమా చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాహుల్ నటుడిగా నాకు కనెక్ట్ కాలేదు కానీ దర్శకుడిగా కనెక్ట్ అయ్యాడు. కొత్త సుశాంత్‌ను తెరపై చూస్తారు. రుహాని ఫైర్ క్రాకర్‌గా పేరు తెచ్చుకుంటుంది. తనకు అవార్డ్ కూడా వస్తాయి”అని చెప్పారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “పెళ్లిచూపుల్లో కలిసిన అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు కరెక్టా? కాదా? అని ఓ అర గంటలో ఎలా నిర్ణయించుకుంటారు. దానికి ఎంత సమయం పడుతుంది? అనే కాన్సెప్ట్‌తో సాగే చిత్రమిది. పెళ్లే వద్దు అనుకునే అర్జున్, అంజలి జీవితాలు ఓ రాత్రిలో ఎలాంటి మలుపులు తిరిగాయనేది సినిమా కథాంశం”అని తెలిపారు. సుశాంత్ మాట్లాడుతూ “నా సొంత నిర్ణయంతో ఓ సినిమా చేద్దామని అనుకుంటున్న తరుణంలో రాహుల్ రవీంద్రన్ ఈ కథతో నన్ను కలిశాడు. ఇలాంటి కథతో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకం ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుహానీ శర్మ, జస్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments