Home కలం సాహితీ పిపాసి పోతుకూచి

సాహితీ పిపాసి పోతుకూచి

EDIT

తెలుగు సాహిత్యంలో పోతుకూచి సాంబశివరావు బహుముఖ ప్రజ్ఞాశీలి. కవి గా, రచయితగా, నాటకకర్తగా, నటుడిగా, అనువాదకునిగా,వ్యాస కర్త గా, జీవిత చరిత్ర రచయితగా, పత్రి కా రచయితగా, సంపాదకునిగా, సాహిత్యోద్యమకర్తగా, కథారచయితగా, విమర్శకునిగా, సాహిత్యాభిమానులకు సుపరిచితులు. పోతుకూచి సాంబశివరావు 1928 జనవరి 27న తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో జన్మించారు. సూరమ్మ, నరసింహమూర్తి పుణ్య దంపతులు ఇతని తల్లిదండ్రులు. పోతుకూచి వంశస్తులు కావడంతో పోతుకూచి సాంబశివరావు ‘పోతుకూచి’గా సుప్రసిద్ధులు. 1950 ప్రాంతంలో తెలంగాణకు రావడం హైదరాబాద్‌లో స్థిరపడటంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలు, హైదరాబాద్ ఆచార వ్యవహారాలు తమ కథలలో, నాటకాలలో ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. తెలంగాణలో జీవితమంతా గడిపి తెలంగాణ రచయితలను, కవులను, కళాకారులను, సాహిత్య సంస్థలను ప్రోత్సహిస్తూ తెలుగు సాహిత్యం కోసం ఎప్పుడూ తపించిన పోతుకూచి సాంబశివరావును“ తెలంగాణ దత్తపుత్రుడు’గా చెప్పవచ్చు. తెలంగాణలోని లబ్ధప్రతిష్టులైన కవుల నుంచి వర్ధమాన కవుల వరకు ఎంతో మంది రచనలను పోతుకూచి నడిపిస్తున్న విశ్వరచన, విశ్వసాహితీలో ప్రచురించడం. విశ్వసాహితీ సాహి త్య, సాంస్కృతిక సంస్థ ద్వారా సన్మానించడం. పుస్తక ప్రచురణలకు ఆర్థికంగా, హార్ధికంగా సహా య, సహకారాలు అందించడం చేస్తుండేవారు. 2017 ఆగస్టు 6వ తేదీన స్వర్గస్తులైనప్పటికీ ఆయన సాహిత్యం తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానంను పొందింది.
పోతుకూచి సాంబశివరావు నటుడిగా, నాటకకర్తగా ఎంతో ప్రసిద్ధి పొందారు. రేడియో నాటకాలలోనూ నటించారు. ఏకపాత్రాభినయాలు రచించారు. రేడియో నాటికలను రాశారు. రేడియో నాటికలను సంపుటిగా ప్రచురించారు. ప్రతిధ్వనులు అనే శ్రవ్యనాటకాల సంపుటిలో 10 నాటికలున్నాయి. అవి 1) పెళ్ళి పిలుపు, 2) రెండు నాటికలు, 3) అంత్యక్రియలు, 4) అద్దెకొంపలో ఒక నెల, 5) స్వాముల వారు, 6) కాలక్షేపం, 7) గృహంలో ప్రజాస్వామ్యం, 8) వితంతు వివాహం, 9) తిరుగుబాటు, 10) చుట్టాల రభస. ఈ నాటికలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతూ పాఠకుల ప్రశంసలు అందుకున్నాయి. నాటికలలో “ఇదీ తంతు”, “దొంగ”, “దొర” “ఏడు సున్నాలు”, “మూడు నాటికల సంపుటి ఇందులో “ఒన్, టు, త్రీ, ఫోర్‌”, “ఏం ప్రేమలో ఏం గొడవలో”, “అంతరించే అంతరాలు”, “దీన్ దయాళ్ గారి దేవుడిలో” “సరిహద్దుల్లో”, ముఖ్యమైనవి.
“హంతకులు”, “పల్లె కదిలింది” నాటకాలను రాశారు” పోతుకూచి నాటకాలు ఒక పరిశీలను” అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓరియంటల్ విభాగం నుండి ఈ వ్యాస రచయిత. ఉస్మానియా యూనివర్సిటీ ఓరియంటల్ ఫ్యాకల్టీ బోర్డు ఆఫ్ స్టడీస్ మాజీ చైర్మన్ బి.జయరాములు పర్యవేక్షణలో పరిశోధన చేశారు. పోతుకూచి నాటకాలపై చలం, శ్రీ.శ్రీ. నార్ల, షేక్ స్పియర్, మొదలైన అనేక మంది ప్రభావం ఉన్నట్లు కన్పిస్తుంది. పోతుకూచి నాటకాలను భారతదేశ జాతిపిత మహాత్మగాంధీ, భారతదేశ మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, మాజీ ముఖ్యమంత్రులు వెల్లోడి, బూర్గుల మొదలైన వారు ఎంతో మెచ్చుకున్నారు. నాటకరంగంలో సుప్రసిద్ధులైన ఎంతోమంది కళాకారులు, నటులు, నాటకకర్తలు, విమర్శకులు పోతుకూచి నటనను చూసి వేనోళ్ళ పొగిడేవారు. ఆల్ ఇండియా రేడియోలో ‘ఎ’ క్లాస్ ఆర్టిస్ట్‌గా పేరు సంపాదించారు.
పోతుకూచి కథలు సంపుటాలుగా వచ్చి సంచలనం సృష్టించాయి. “ఎదురు ప్రశ్నలు (1952), హైదరాబాద్‌లో (1957), బతుకుల పతనం (1962), కొత్త విలువల బతుకు (1963), మందారాలు (1969), పోతుకూచి కథలు, శేఖరం కథలు (రెండు సంపుటాలు) ఒక్కొక్క కథల సంపుటం కొత్తదనంతో మరింత మెరుగులతో ఉర్రూతలూగిస్తూ, ఉత్సాహపరుస్తూ చదివింపజేస్తాయి. పోతుకూచి కథలలో సాంఘిక కథలు, దేశభక్తి కథలు, ప్రేమకథలు, హాస్యం కథలు కన్పిస్తాయి. సామ్రాజ్యవాద భావాలతో పాటు మూఢనమ్మకాలు, సనాతన మతాచారాలపై తిరుగుబాటు ఎన్నో సామాజిక విషయాలు చోటుచేసుకున్నాయి.
పోతుకూచి కథలలో ముఖ్యంగా 1) కొత్త విలువల బ్రతుకు. 2) మామ్మ నడిపిన విప్లవం, 3) వారసులు, 4) మాతృమూరి, 5) ఏకాంతం, 6) రాయబారి, 7) మలుపు తిరిగిన మమత, 8) అతనిలో వెలుగు చుక్క, 9) సిగరెట్ చిలిపి చేష్టలు, 10) విముక్తి, 11) తొలి వెలుగు మలుపు, 12) గోదావరి గట్టు మీద, 13) నాకీ అవతరాలు చాలు ప్రభూ, 14) చౌరస్తాలో నాయకుడు, 15) బస్సులో పది నిమిషాలు, 16) చౌకులో, 17) అసమర్థుడు, 18) రామచంద్రుని అరణ్యవాసం, 19) విడివడని మూడులు, 20) ప్రాణం తీసిన పండు, 21) సంఘర్షణ, 22) సాలెగూళ్ళు, 23) ఆహ్వానం, 24) అంతర్భాగాలు, 25) కాలయంత్రంలో సాయంత్రం, 26) వీడ్కోలు, 29) వివాహంలో కలహం, 30)పండుగ నాటి శాపం, 31) పెంపుడు జంతువు, 32) కలిసి విడిన వెలుగు కణాలు, 33) స్మృతి వెలుగులు, 34) డాక్టర్ చంపిన రోగి, 35) ఆమె గృహంలో అతని స్వగృహం, 36) దారి తప్పిన ప్రేమ, 37) మాజీ యజమాని, 38) మంచివాని చెడ్డతనం.39 తెగిన కథ . 40 జీవితం విలువ 41. చితికిన మాతులు 42. విముక్తి ఎప్పుడు? పోతుకూచి కథలు హిందీలోనూ, ఇంగ్లీష్‌లోనూ, రష్యా , జర్మనీ భాషలలో అనువదింపబడి ఎంతో ప్రఖ్యాతి గాంచాయి.
పోతుకూచి నవలలు రచించారు. ముఖ్యంగా “ఉదయ కిరణాలు” “ఏడు రోజుల మజిలీ”, “అన్వేషణ”,“ చలమయ్య షష్టి పూర్తి”, “నారింజ” లాంటి నవలలు చదవడం ప్రారంభిస్తే ముగింపు వరకు పాఠకులను కట్టిపడేసేవే. పోతుకూచి పేరు కాస్తా “ఉదయ కిరణాలు సాంబశివరావు”గా కూడా మారిపోయింది. కవితా రచనలోనూ పోతుకూచి విశేషంగా చేశారు. వర్ధమాన రచయితలతో పోటీ పడ్తూ దిన, వార, పక్ష, మాస పత్రికలలో తమ కవితలనూ ప్రచురించేవారు. ఇతరుల కవితలు చదివి వారిని ప్రోత్సహించేవారు. మెచ్చుకునేవారు పోతుకూచి 5 కవితా సంపుటాలను వెలువరించారు. అవి. 1. రాసి సిరా, 2. అనురాగం 3. శిఖరాలు 4. చైతన్య కిరణాలు 5. అన్ని నాదాలు, ఈ కవితా సంపుటాలలో అవినీతి, అన్యాయం, బంధుప్రీతి, లంచ గొండితనం. మూఢ నమ్మకాలను నిరసిస్తూ దేశభక్తిని ప్రబోధించారు.
పోతుకూచి ఆధునిక తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలలో ముఖ్యంగా హైకూలు, నానీలు, మీని కవితలు, సౌధామినీ కవితలు మాదిరిగా స్వయంగా “చుక్కలు” అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనిని అనుసరించి అనేక మంది కవులు “చుక్కలు” ప్రక్రియలో తాము కవితలు రాయడం. కవితా సంకలనాలను ప్రచురించడం చేశారు. వ్యాస కర్తగా పోతుకూచికి ప్రత్యేక స్థానం ఉంది. “శృంగాటకం” అనే శీర్షికతో అనేక వ్యాసాలు రాశారు. శృంగాటకం అంటే చదుకూ (చౌరస్తా) అని అర్థం నాలుగు వీధుల కూడలి చదుకూ కాబట్టి ఆయన వ్యాసాలు నాలుగు మార్గాలు అంటే వాటికి సంబంధించిన నాలుగు అర్థాలు గోచరిస్తాయి. ‘దక్కన్ క్రానికల్‌” ఆంగ్ల దినపత్రికలో “ది తెలుగు వరల్డ్‌” అనే శీర్షికతో తెలుగు సంస్కృతి. సాహిత్యం, భాష, సంప్రదాయాలపై అనేక వ్యాసాలు రాశారు. ఆంధ్ర పత్రికలో “న్యాయం, చట్టం” గురించి సామాన్యులకు అర్థమయ్యేలా అందరికి న్యాయం’ అనే శీర్షికతో పలు వ్యాసాలు రాశారు.
అనువాద రచనలో పోతుకూచికి మంచి అనుభవం ఉంది. ఆలిండియా రేడియో నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనంలో గణతంత్ర దినోత్సవం , సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనాలలో ఆంగ్ల కొంకణి, కన్నడ, ఒరియా, హిందీ, నేపాలీ కవితలను అనువాదం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆలిండియా అనువాద వర్క్‌షాప్‌లో పోతుకూచి నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం. దక్షిణ భారత భాషలకు సంబంధించిన సాహిత్య అకాడమీ నిర్వహించిన అనువాదకుల వర్క్‌షాప్‌లో కూడా పోతుకూచి ప్రముఖంగా నిలిచారు. పద్యరచనలో పోతుకూచికి బాల్యంలోనే బీజాలు పడ్డాయి. సుమతి, వేమన, కుమారి, భాస్కర, రామదాసు, శతకాల మాదిరిగా తాను శతక రచన రాయాలని “పోతుకూచీయం”, “సాంబశివానందలహరి” అను రెండు శతకాలను రచించారు. కళాశాలలో చదివే రోజుల లోనే “జనషాందుడు” అనే పేర పద్యాలను రచించారు. పోతుకూచి తాను నడిపే విశ్వ రచనలో డైరీ రాసేవారు. ఈ డైరీని ఎంతో మంది సాహితీ ప్రముఖులు మెచ్చుకున్నారు. డా॥. సి.నా.రె., జి.వి. సుబ్రహ్మణ్యం, పి.వి. రమణ, చే.రా, కోకా రాఘవరావు, గండవనం సుబ్బరామిరెడ్డి మొ. ఎంతో మంది పోతుకూచి డైరీలో సాహిత్య విషయాలను ఎంతో అద్భుతంగా కన్నులకు కట్టినట్లు రాస్తారని ప్రశంసలు కురిపించేవారు.1984లో బెంగళూర్‌లో అఖిలభారత భాషా సాహిత్య సమ్మేళనం జరిగిన సందర్భంలో పోతుకూచిని “భారత భాషా భూషణ్‌” అను బిరుదుతో సత్కరించారు.
ఈ బిరుదు డాక్టరేట్‌కు సమానమైనది. 1993లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ప్రదానం చేసింది. 1972 లో హైదరాబాద్‌లో జరిగిన సాహితీ రజతోత్సవం సందర్భంగా అప్పటి విద్యాశాఖ మంత్రి యం. వి. కృష్ణారావు చేతుల మీదుగా “సాహితీ చైతన్య” అనే బిరుదును ప్రదానం చేశారు. 1979లో వరంగల్‌లో సాహితీ భీష్మ, త్యాగరాయ గానసభలో “కళారత్న” ఈ విధంగా ఎన్నో సంస్థలు, సాహి త్య, సాంస్కృతిక, కళా సంస్థలు అనేక బిరుదులతో సన్మానాలు చేశాయి. అనేక మందికి సాహి త్య, కళా సంస్థలను ప్రారంభించేటట్లు ప్రోత్సహించి వారికి సలహాదారులుగా ఉంటూ సహా య, సహకారం అందించారు. జీవితమంతా తెలుగు సాహిత్యానికి అంకితం చేసిన వ్యక్తి పోతుకూచి నిరాడంబర జీవితం, నిశితమైన ఆలోచన, తెలుగు సాహిత్యాభివృద్ధికై తపన, కొత్తవారిని ప్రోత్సహించాలనే తాపత్రయం, నిష్కల్మష హృద యం గల పోతుకూచి తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలో సాహితీ వ్యవసాయం చేసిన కృషీవలుడు. ఈ నెల 27వ తేది ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఉదయం నుండి సాయంత్రం వరకు పోతుకూచి జన్మదినోత్సవ సందర్భంగా కవి సమ్మేళనాలు, సన్మానాలు, ఉపన్యాసాలు వివిధ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోతుకూచిని గురిం చి తలుచుకునే కంటే ఆయన సాహిత్యాన్ని, చదివితే నిజమైన నివాళులు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలోనూ తమ తోడ్పాడు అందించారు.

డా.ఎస్.విజయభాస్కర్
9290826988