Home వార్తలు నాలుగు వారాల సంబురం

నాలుగు వారాల సంబురం

bonaluగోల్కొండలో ప్రారంభమయ్యే ఈ ఉతవం నెల చివరి వారం తిరిగి గోల్కొండలోనే ముగుస్తుంది. ఆషాఢమాసంలో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారంటే ఈ మాసంలో వర్షాకాలం ప్రారంభం కావడం వల్ల మారిన వాతావరణంతో పిల్లలు, పెద్దలు అనేక రోగాల బారిన పడే అవకాశముంటుంది. గ్రామ దేవతలను ఆరాధిస్తే ఆ అమ్మవారే రక్షిస్తారనేది ప్రజల నమ్మకం.
ఒక్కొక్కవారం ఒక్కొక్క ప్రాంతం బోనాల పండుగ జరుపుకుంటారు. ఆయా ప్రాంతాలలో పండుగ జరుపుకోవడానికి నేపథ్యం ఉంది. అది
మొదటి వారం గోల్కొండ ఎల్లమ్మ పండుగ : గోల్కొండ కోట నిర్మించడానికి ముందు గొల్లవారు ఈ కొండ (గుట్ట) మీద మేకలు, గొర్రెలు మేపేవాళ్ళు. వారు అదే ప్రాంతంలో నివాసాన్ని ఏర్పరచుకున్నారు. అప్పటికే ఆ కొండమీద గుడి ఉన్నందున ఆ గొల్లలు వారి సాంప్రదాయం ప్రకారం బోనాలు సమర్పించేవారు. కాలక్రమంలో కాకతీయులు ఆ కొండపై కోట నిర్మించి గొల్లకొండగా నామకరణం చేశారు. తర్వాత బహమనీలు, కుతుబ్‌షాహీలు ఈ కోటను ఆక్రమించి గోలకొండ (గొల్కొండ) గా మార్చారు. కులీ కుతుబ్‌షా కాలం నుండే గోల్కొండలోని అమ్మవారికి బోనాలు సమర్పించే వారంటే తెలంగాణలో మత సామరస్యం ఎలా ఉండేదో అర్థమౌతుంది.
రెండవ వారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఉత్సవం : సికింద్రాబాద్ వాస్తవ్యుడైన మారటి అప్పయ్యకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కలరా సోకింది. ఈ వ్యాధి బారి నుండి కాపాడాలని మాంకాళమ్మకు మొక్కుకున్నాడు. అప్పుడు ఆ అమ్మవారు కరుణించడంతోనే అతను ఆ వ్యాధి నుండి విముక్తి పొందాడట. దీనికి ప్రతీకగా క్రీ.శ. 1813లో మహంకాళి అమ్మవారి విగ్రహం చేయించి ప్రతిష్టించా రంటారు. ఆమెకే ఉజ్జయిని మహంకాళి అని పేరు పెట్టారు. అప్పటి నుండి ప్రతియేడు ఆషాఢంలో బోనం సమర్పిస్తారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆదివారం ఉదయం నుండి బోనాలు సమర్పించి, మధ్యాహ్నం రెండు గంటల నుండి ఫలారం బండిపై అమ్మవారిని ఊరేగిస్తారు. ఫలారం బండికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే ఆ బండికి రెండు గొర్రె పొట్టేల్లను (మగ గొర్రెలను) కడతారు. బండిని రంగు రంగులతో అలంకరించి, తొట్టెలు కట్టి, అమ్మవారి విగ్రహం లేదా చిత్రపటం అందులో ఉంచి మహంకాళి చెల్లెండ్లైన ముత్యాలమ్మ, గండెమ్మ,జూలమ్మ (ఇప్పటి రెజిమెంటల్ బజార్‌లోని) డొక్కలమ్మ దగ్గరకు భక్తులు ఊరేగింపుగా తీసికెళతారు. ఇందులో ప్రధాన పాత్ర పోతురాజు వీరగోల (కొరడా) ధరించి ప్రత్యేక వేషధారణతో ముందు నడుస్తుండగా భక్తులు వారితో పాటు ఊరేగింపుగా నడుస్తారు. రెండవ రోజైన సోమవారం ఉదయం 11 గం॥ ప్రాంతంలో ఈ ఘట్టం మొదలౌతుంది. ‘రంగం’ ఎక్కడం జరుగుతుంది. రంగం అంటే ‘వేదిక’ అని అర్థం, అంటే ఆ అమ్మవారి గుడి ప్రాంగణంలో ద్వారం ముందు ఈ వేదికను ఏర్పాటు చేస్తారు. ఈ రంగంపై (కన్య) వివాహం కాని స్త్రీ, కాల్చని పచ్చి కుండపై నిలబడి, చేతిలో వేప మండలు ధరించి శరీరమంతా పసుపు పూసుకొని, నుదుట తిలకం (బండారు) దిద్దుకొని “భవిష్యవాణి” చెబుతుంది. ఈ యేడు ( ఈ సంవత్సరం) జరగబోయే శుభ, అశుభ పరిణామాలపై చెబుతుంది, కనుక భవిష్యవాణి అంటారు ఉదాహరణకు వర్షాలు, పంటలు ప్రజలు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో వివరిస్తుంది. అదే విధంగా అక్కడికి వచ్చిన భక్తులు ప్రజలక్షేమం గురించి అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతుంది.
మూడవ వారం చార్మినార్ అమ్మవారు : హైదరాబాద్‌కు మూసీనదిలో వరదలు వచ్చినప్పుడు చార్మినార్ మునిగిపోయేంత నీళ్లు వచ్చినాయట, అప్పుడు అమ్మవారు నవాబుకు కలలో కనిపించి బంగారు చేటలో పసుపు, కుంకుమ మొదలైన పూజా ద్రవ్యాలు నీటిలో వదిలితే వరద తగ్గుతుందని చెప్పిందట అప్పుడు నవాబు అదే విధంగా బంగారు చేటలో పూలు, పండ్లు, పసుపు, కుంకుమ పూజాద్రవ్యాలతో నదిలో వదలగానే వరదలు తగ్గాయట. అప్పటి నుండి హైదరాబాదు ప్రాంతంలో లాల్‌దర్వాజ బోనాల పండుగ జరుపుకుంటారు. ఇక్కడ కూడా సాంప్రదాయబద్దంగా బోనాలు ఫలారం బండి, ఘట్టాలు ఆదివారం జరుగగా, సోమవారం రంగం ఎక్కడం జరుగుతుంది.
నాల్గవ వారం : జంట నగరాల పరిసర ప్రాంతాలలోని అన్ని అమ్మవారి గుళ్ళలో ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఆ తరాత శ్రావణ మాసం మొదటి వారం లాల్‌బజార్‌లో బోనాల ఉత్సవాన్ని జరుపుతారు. అలా తెలంగాణ రాష్ట్ర మంతటా జరుపుకుంటారు.