Home ఖమ్మం ఇసుక అక్రమ రవాణాకు అదుపేది!

ఇసుక అక్రమ రవాణాకు అదుపేది!

Sand-Smugglingగంధసిరిలో ఆగని ఇసుక అక్రమ రవాణా
కూపన్ల నిలిపివేతతో జోరుగా ఇసుక అక్రమ తోలకాలు
రూ. లక్షల ఆదాయం కోల్పోతున్న గ్రామ పంచాయతీ
ముడుపుల మత్తులో రెవెన్యూ, మైనింగ్ అధికారులు!

మన తెలంగాణ/ ముదిగొండ: మండల పరిదిలోని గంధసిరి సమీపంలోని మున్నేరులో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారుల ఉదాసీనత వైఖరితో కొంత మంది బడాబాబులు వందలాది ట్రాక్టర్లలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం మున్నేరులో నీరు పుష్కలంగా ఉన్నా ఏటి మధ్యలోకి ట్రాక్టర్లు వెళ్లి పట్టపగలే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ తోలకాలు సాగిస్తున్నారు. వినియోగదారుల నుంచి ఒక ట్రక్కు ఇసుకను రూ. 3 వేల వరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు తహసీల్దార్ కార్యాలయం పేరుతో రూ.1000 డిడి తీసి కూపన్లు తీసుకొని పంచాయతీ అనుమతితో తోలకాలు సాగించాలి. కానీ ఇసుకాసురులు రెండు నెలల క్రితం మున్నేరులోకి నీళ్లు రావటం వల్ల ట్రాక్టర్లు, కూలీల సహాయంతో ఇసుకను తోడి గ్రామ సమీపంలో అనేక చోట్ల ఇసుక నిల్వలను ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై “మన తెలంగాణ” వరుస కథనాలు ప్రచురించిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో తహసీల్దార్ రమాదేవి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గంధసిరి గ్రామంలో 600 ట్రక్కుల ఇసుక నిల్వలు గుర్తించి ట్రాక్టర్ ఒక్కింటికి రూ. 2 వేలు చొప్పున జరిమానా విధఙంచి అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. ఆ తరువాత కూడా అక్రమ రవాణా కొనసాగుతుండటంతో తహసీల్దార్ ఇసుక కూపన్లను నిలిపి వేశారు. దీంతో ఇదే అవకాశంగా భావించిన ఇసుక అక్రమార్కులు కొంత మంది రెవెన్యూ అధికారులు, విఆర్‌ఒల అండదండలతో అడ్డూ అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఫలి తంగా పంచాయతీ, ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండాపోతుంది. ఇసుక గ్రామాల విఆర్‌ఒలతో పాటు మరికొంత మంది విఆర్‌ఒలు గ్రూపులుగా ఏర్పడి అక్రమా ర్కుల నుంచి భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేలల్లో జరగాల్సిన ఇసుక అక్రమ రవాణా పట్టపగలే యథేచ్చగా కొనసాగి స్తున్నా రంటే సంబంధిత అధికారులు ఏ స్థాయిలో అక్రమా ర్కులకు సహకరిస్తున్నారో అవగతమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.