Home మంచిర్యాల గోదావరిలో ఇసుక దొంగలు

గోదావరిలో ఇసుక దొంగలు

tractor

* అనుమతి కొంత, అక్రమాలు కొండంత
* కాసులు కురిపిస్తున్న ఇసుక దందా
* గ్రామపంచాయతీల ఆదాయానికి గండి
* అనుమతుల పేరుతో అక్రమంగా తరలింపు

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి   నదిలో ఇసుక దొంగలు పడ్డారు…. ప్రతినిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు కొంత మేరకు ఉండగా అక్రమంగా ఎక్కువ మొత్తంలో ఇసుకను తరిలిస్తున్నారు. ఈ తతంగం పట్టణ రహదారుల గుండా సాగుతున్నప్పటికీ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.  ఇసుక దొంగలు వందలాది సంఖ్యలో అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఒకే పర్మిట్‌పై వారాల తరబడి కాలం వెళ్ల దీస్తున్నారు. ఇసుక దందా కాసులు కురిపిస్తుండగా అధికార పార్టీకి చెందిన నేతలు ట్రాక్టర్లు కొనుగోలు చేస్తూ  ఎలాంటి అనుమతులు లేకుండానే గోదావరిలోకి పంపిస్తున్నారు.  పట్టణంలోని కళాశాల రోడ్డు గుండా ప్రతినిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతున్నా అధికారులు వాటి పర్మిట్లను పరిశీలించకపోవడంతో యథేచ్చగా ఇసుకను రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అదే విధంగా అభివృద్ధి పనుల కోసం వాగులు వాటి పరివాహక ప్రాంతాల్లో ఇసుక రావాణా కోసం అనుమతులు పొందుతూ పెద్ద  ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. భూగర్భ జలాలు పడిపోవడంతో పాటు గ్రామపంచాయతీల ఆదాయానికి గండిపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. మంచిర్యాల జిల్లాలోని గోదావరి నదితో పాటు వాగులు ఎక్కువగా ప్రవహించే  వేమనపల్లి, కన్నెపల్లి, భీమిని, నెన్నెల మండలాల్లో అనుమతులు లేని ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. కన్నెపల్లి మండలం ముత్తాపూర్ వద్ద నిర్మిస్తున్న చిన్న ప్రాజెక్టుకు అవసరమైన ఇసుక కోసం ఇదే మండలంలోని వీరాపూర్ వాగును ఆశ్రయించారు.  స్థానికంగా ఇసుక రావాణాకు అనుమతులు పొందినప్పటికీ పెద్ద ఎత్తున  తెరచాటుగా బయటకు తరలిస్తున్నారు. గత రెండేళ్ల క్రితం ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపగా కొంత మేరకు నిలిచిపోయిన అక్రమ దందా మళ్లీ యథేచ్చగా సాగుతుంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ దందా  మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. కన్నెపల్లి మండల కేంద్రంతో పాటు జజ్జెరవెల్లి , వీరాపూర్, భీమిని మండలంలోని మల్లీడి, చెన్నాపూర్, నెన్నెల మండలంలోని మెట్‌పల్లి, వేమనపల్లి మండలంలోని గొర్లపల్లి వాగుల నుంచి ప్రతినిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుక తరలిపోతుంది. అభివృద్ధి పనుల పేరిట స్థానికంగా అనుమతులు పొందినప్పటికీ ట్రాక్టర్ల యాజమానులు అభివృద్ధి పనులకు తరలించడంతో పాటు బయట మార్కెట్‌కు అధికంగా పంపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారి అవసరాల కోసం రూ.200 చెల్లించి వేబిల్లు ఆధారంగా ఇసుకను తీసుకెళ్లే వెసులుబాటు అధికారులు కల్పించగా ఈవాగు నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తాండూర్ మండల కేంద్రంలోని ఆలయం నిర్మాణం పేరిట ఒక ట్రాక్టర్ యాజమాని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సంఘటన ఇటీవల వెలుగు చూసింది. ఇసుక రవాణపై నిఘా ఏర్పాటు చేసి, తనిఖీలు చేయాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో బినామీ వేబిల్లులకు అక్రమ రవాణా యదేచ్చగా సాగుతుంది. కన్నెపల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండూర్ వరకు కూడా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నెన్నెల మండలం మెట్‌పల్లి వాగు నుంచి ప్రతినిత్యం బెల్లంపల్లి మండలంలోని గ్రామాలకు పట్టణానికి ఇసుకను తరలిస్తున్నారు. ఈ వాగులో రవాణకు ఎలాంటి అనుమతులు లేకుండానే ట్రాక్టర్ల యాజమానులు ఇసుకను తరలిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా అధికారులు స్పందించకపోయినట్లయితే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం నెలకొంది.