Search
Sunday 18 November 2018
  • :
  • :

కాసులు కురిపిస్తున్న ఇసుక

Sand transportation is the largest commercial

నిషేధం పేరుతో మరింత ప్రియం
అక్రమ రవాణా అంతా అధికారుల కనుసన్నల్లోనే
అతి పెద్ద వ్యాపారంగా ఇసుక రవాణా
ట్రాక్టర్ల వారీగా వసూళ్లు
ప్రస్తుతం వీరిదే దందా

ప్రస్తుతం ఇసుక అక్రమ రవాణా కాసులు కురిపిస్తుంది. ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగుతుంది. ఏర్లు, నదులలో ఇసుకను తవ్వేస్తున్నారు. ఇసుక రవాణా మొత్తం అధికారుల కనుసన్నల్లోనే సాగుతుందన్నది జగమెరిగిన సత్యం. పోలీస్, రెవెన్యూ అధికారులకు తెలియకుండా తట్టెడు ఇసుక కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇసుక రవాణా కోసం ముఠాలు ఏర్పడ్డాయి. అన్ని ముఠాలు కలిసి ఒక మాఫీయాలా తయారయ్యాయి. విఆర్‌ఓ, విఏఓ, కానిస్టేబుల్ వద్ద నుంచి మొదలైన వ్యవస్థ మండలాధికారుల వరకు కొన్ని చోట్ల రెవెన్యూ, సబ్ డివిజన్ అధికారుల వరకు వ్యాపించింది. పర్యావరణం, భూగర్భ జలం, ఇతర నియమ నిబంధనలు వీరికి అక్కర్లేదు. వీరికి కావాల్సిందల్లా డబ్బే. ఒక కూపన్‌తో 20 ట్రిప్పులు, 30 ట్రిప్పులు తొలిన పట్టించుకున్న వారు లేరు. కొన్ని మండలాల్లో ఇసుక రవాణా చేసే వనరులున్నా గ్రామాల నుంచి ట్రాక్టర్ల వారీగా వసూళ్లకు పూనుకుంటున్నారు. నగరాలకు, పట్టణాలకు ఇసుకను చేరవేసే క్రమంలో ఎర్ర చందనం రవాణాను తలపిస్తున్నారు. వెనుక, ముందు కార్లు, మోటార్ సైకిళ్లతో రక్షణగా వెళ్తూ అధికారుల కంటపడితే డబ్బులతో నచ్చజేప్పడం, లేదంటే ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఇసుక ట్రాక్టర్లను తప్పించడం చేస్తున్నారు. కాసులు కురిపిస్తున్న ఇసుక

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఇసుక రవాణా అతి పెద్ద వ్యాపారంగా మారింది. దీంతో పాటే దందాలు, మఫీయా సంస్కృతి కూడా క్రమేపి పెరుగుతూ వస్తుంది. ఇసుక రవాణా చేసే వ్యక్తులు అధికారులకు ఆత్మీయులుగా మారిపోయారు. స్థానిక శాసన సభ్యులు, ఇంకా పైస్థాయి ప్రజాప్రతినిధి, జిల్లాస్థాయి అధికారి చెప్పినా మండల కేంద్రాల్లో కానీ పని ఇసుక అక్రమ రవాణా చేసే వ్యక్తి ఫోన్‌లో చెబితే పనైపోతుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. డబ్బులతో కూడుకున్న వీరి బంధం పెనవేసుకు పోయింది. ప్రతి మండలంలోనూ ఇసుకే వ్యాపారంగా దీనికి సంబంధించిన పైరవీలే ఆధారంగా ధనార్జన చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గోదావరి, కిన్నెరసాని, వైరా, మున్నేరు, కట్టలేరు ఇంకా ఇతర చిన్న నదులతో పాటు వాగుల్లో సైతం ఇసుక మిగలనీవ్వడం లేదు. అధికారులు ఇసుక ర్యాంపుల అధికారిక కేటాయింపు ఇంకా ఏదో ఏదో అంటూ ఏం చెప్పినా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కొందరు ఒక కూపన్ తీసుకుని 20 ట్రిప్పుల పైబడి రవాణా చేస్తున్నారు. పట్టుబడితే కూపన్ చూపుతున్నారు. లేదంటే ఎన్నిసార్లయినా ఇక వారిష్టమే. నిర్మాణ రంగం ఇటీవల కాస్త వేగం పుంజుకోవడంతో ఇసుక పిరమైపోయింది. ఓ ట్రాక్టర్ ట్రక్కు ఇసుక ఐదారు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తుంది. రోజుకు ఒక్క ట్రిప్పు ఇసుక రవాణా చేసిన మూడు నుంచి నాలుగువేలు మిగులుతుండడంతో ఇది ఇప్పుడు ప్రధాన వ్యాపారమైంది. అనుమతులు లేని చోట సైతం తవ్వకాలు సాగిస్తున్నారు. నది పరివాహాక ప్రాంతమంతా ఎక్కడ చూసినా ఇసుక ర్యాంపులుగా మారిపోతున్నాయి. ఇసుక అక్రమ రవాణా మొత్తం రెవిన్యూ, పోలీస్ అధికారుల పరోక్ష అనుమతులతోనే సాగుతుందనేది ప్రధాన ఆరోపణ. పలు చోట్ల పైరవీకారులు స్థానిక అధికారులను ప్రసన్నం చేసుకుని ఇసుకను నగరాలకు, పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. కొన్ని చోట్ల నెల వారి మామూళ్లు వసూళ్లు చేస్తుండగా కొన్ని చోట్ల ఇసుక ట్రిప్పుల లెక్కన వసూలు చేస్తున్నారు. కొందరు నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల నుంచి ట్రాక్టర్ల వారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నెలనెల మామూళ్లు అందుతుండడంతో అధికారులు నోరు మెదపడం లేదు. నదులు లోయలుగా మారిపోతున్నాయి. మిట్టపల్లి ఏటి నుంచి వేలాది ట్రిప్పుల ఇసుక తోలడంతో ఇప్పుడు అది గుంటలమయంగా మారిపోయింది. ఏ అధికారి వెళ్లి చూసినా ఇప్పుడు కళ్లకు కట్టినట్లు కనపడుతుంది. కొన్ని చోట్ల 10 నుంచి 20 అడుగుల లోతు ఉన్న ఇసుకను కూడా వెలికి తీశారు. వైరా నది పరివాహాక ప్రాంతంలోనూ. కిన్నెరసాని ఇతర ఏర్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఇసుక అక్రమ రవాణాతో వ్యాపారులు పైరవీకారుల అవతారమెత్తారు. మండలాధికారులతో నిత్యం ఆర్థిక లావాదేవీలు నడుపుతుండడంతో వీరు చెప్పిందే మండల స్థాయి అధికారులు వినాల్సి వస్తుంది. ఇటీవల ఓ రైతు వ్యవహారానికి సంబంధించి స్థానిక శాసన సభ్యుడు మండలాధికారికి ఫోన్ చేసి చెప్పినా పని కాకపోవడంతో సదరు రైతు ఇసుక అక్రమ రవాణా దారుని ఆశ్రయించాడు. అతను ఫోన్‌లో చెబితేనే పని నిమిషాల్లో జరిగిపోయిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు సైతం ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇసుక పైరవీకారులు ఏం చెబితే అది చేస్తున్నారు. మొత్తం ఇసుక రవాణా ఒక పెద్ద వ్యవస్థగా మారింది. రానున్న కాలంలో ఇది మరింత ప్రమాదకంగా తయారు కానుంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇసుక అక్రమ రవాణాదారులు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుండడం, గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్న నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝుళిపించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments