Home తాజా వార్తలు ఐటిసి చైర్మన్‌గా సంజీవ్ పురి

ఐటిసి చైర్మన్‌గా సంజీవ్ పురి

Sanjiv Puri appointed as new chairman of ITC

19 శాతం పెరిగిన ఐటిసి లాభం

న్యూఢిల్లీ : ఎఫ్‌ఎంసిజి దిగ్గజ సంస్థ ఐటిసి చైర్మన్‌గా సంజీవ్ పురి నియమితులయ్యారు. ఇదే సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఈ కీలక పదవి అప్పగించారు. 2019 మార్చి ముగింపు నాటి క్యూ4, వార్షిక ఫలితాల వెల్లడి సందర్భంగా బోర్డు సమావేశంలో డైరెక్టర్లు కొత్త చైర్మన్ నియామక ప్రకటన చేశారు. రెండు రోజుల క్రితం ఐటిసి చైర్మన్ యోగేశ్ చంద్ దేవేశ్వర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. 2018 నుంచి సంజీవ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. డిసెంబర్ 2015లో ఆయన్ని ఐటిసిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ఆ తర్వాత 2017లో సిఇఒ అయ్యారు.

క్యూ4 ఫలితాలు
మార్చి ముగంపునాటి త్రైమాసికంలో ఐటిసి అంచనాలకు మించి రాణించింది. కంపెనీ నికరలాభం 19 శాతం పెరిగింది. గతేడాదిలో లాభం రూ.2,933 కోట్ల నుంచి రూ.3,482 కోట్లను చేరింది. అలాగే రెవెన్యూ రూ.10,586 కోట్ల నుంచి రూ.12,206 కోట్లకు చేరింది. కంపెనీ ఎబిటా రూ.4572 కోట్లకు చేరగా, మార్జిన్లు 31.8 శాతంగా నమోదయ్యాయి. కంపెనీ సిగరెట్ విక్రయాలు 11 శాతం పెరుగుదలతో రూ.5,486 కోట్లను చేరాయి. గతేడాది సిగరెట్ సేల్స్ రూ.4,936 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ ఎఫ్‌ఎంసిజి ఆదాయం 9.7 శాతం పెరుగుదలతో రూ.8,760 కోట్లను తాకింది. ఫలితాల సందర్భంగా ఒక్కోషేరుపై కంపెనీ రూ. 5.75 డివిడెండ్‌ను ప్రకటించింది. మార్కెట్ ముగిసే సమయానికి ఐటిసి షేరు 3 శాతం నష్టంతో రూ.289 వద్ద స్థిరపడింది.

Sanjiv Puri appointed as new chairman of ITC