Home ఛాంపియన్స్ ట్రోఫీ శతక్కొట్టిన శామ్సన్

శతక్కొట్టిన శామ్సన్

  • పుణెపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఘన విజయం

Sanju-Samson

పుణె: ఇక్కడి ఎంసిఎ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య ఐపిఎల్ ఆట రసవత్తరంగా జరిగింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 97 పరుగుల తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టును చిత్తు చేసింది. 2016 ఐపిఎల్ ఎడిషన్‌లో డేర్ డెవిల్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లను పుణె సూపర్‌జెయింట్స్ జట్టు గెలుచుకుంది. ఈసారి కూడా గెలిస్తే హ్యాట్రిక్ సాధించే అవకాశం ఉండగా చివరికి కంగు తింది. సంజూ శామ్సన్ 102 పరుగులు చేయగా, అమిత్ మిశ్రా, జహీర్ కాన్‌లు చేరో 3 వికెట్లు తీసుకోడంతో ఢిల్లీ జట్టు గెలిచింది. ఇది ఐపిఎల్‌లో పుణె జట్టుపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ సాధించిన తొలి విజయం.
టాస్ గెలిచిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ అజింక్య రహానె ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ కడుపునొప్పి(స్టమక్ బగ్) కారణంగా ఆట నుంచి తప్పుకోవడంతో అజింక్యా రహానె పుణె జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తరఫున కోరీ అండర్సన్ తొలిసారిగా ఆడుతున్నాడు. ఢిల్లీ జట్టు బ్యాట్స్‌మన్ 63 బంతుల్లో 102 పరుగులు చేసి రాణించాడు. పైగా ఐపిఎల్-10వ సీజన్‌లో తొలి శతకాన్ని నమోదు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆడమ్ జంపా వేసిన 19వ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా హిట్ చేసి తన టి20 కెరీర్‌లోనే తొలి సెంచరీని శాంసన్ నమోదు చేశాడు. కానీ ఆ తర్వాత బంతికి శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులో ఉన్నంతసేపు అతడు బాగా ఆడి జట్టుకు మంచి పునాది వేశాడు. అశోక్ దిండా వేసిన 18 ఓవర్లో రెండు సిక్సర్లు దంచేశాడు. యువ క్రికెటర్ రిషబబ్ పంత్ ఆరంభంలో దూకుడుగా ఆడి భారీ స్కోరు చేయడానికి ప్రయత్నించాడు. కానీ బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో అతడు 31 పరుగులకు రనౌట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. క్రిస్ మోరిస్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 5 బంతులాడి రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదేసి 22 పరుగులు సాధించడమేకాక ఢిల్లీ జట్టు స్కోరును 205 దాటేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో పుణె బౌలర్లు రాణించలేదనే చెప్పాలి. చాహర్, తాహిర్, జంపా ఒక్కో వికెట్ తీసుకున్నారు.
షాబాజ్ నదీమ్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్, అజింక్యా రహానె ఓపెనర్లుగా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. పుణె జట్టు వేగంగా స్కోరు చేయాల్సిన పరిస్థితి. జహీర్ ఖాన్ 38 ఏళ్ల వయసులో కూడా 130 కిమీ వేగంతో బౌలింగ్ చేయడం గొప్ప అనే చెప్పాలి. జహీర్ ఖాన్ వేసిన బంతికి శామ్సన్‌కు క్యాచ్ ఇచ్చి అజింక్యా రహానె చీప్‌గా అవుటయ్యాడు. పుణె 24 పరుగుల స్కోరుకే తొలి వికెట్ పడిపోయింది. మయాంక్ అగర్వాల్ జహీర్ ఖాన్ బౌలింగ్‌లోనే మోరిస్‌కు క్యాచ్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి కొన్ని బౌండరీలు దంచేసి స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ 5.5 ఓవర్లో పుణె  49 స్కోరు వద్ద మోరిస్ వేసిన బంతికి నదీమ్‌కు మూడో వికెట్‌గా  క్యాచ్ అవుటయ్యాడు. 52 స్కోరు వద్ద  డుప్లెసిస్ నాలుగో వికెట్ పడిపోయింది. దాంతో పుణె చిక్కులో పడ్డటయింది. కమ్మిన్స్ వేసిన బంతికి బెన్‌స్టోక్స్ 5 బంతులే ఆడి 2 పరుగుల స్కోరుకే  పంత్‌కు క్యాచ్ అవుటయ్యాడు. ఢిల్లీ భారీ స్కోరును ఛేదించేలా ధోనీ నిలకడగా ఆడాడు. కానీ అమిత్ మిశ్రా వేసిన బంతికి కరుణ్ నాయర్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ధోనీ మొత్తం 14 బంతులాడి 11 పరుగులే చేశాడు. అప్పటికే పుణె 6 వికెట్ల నష్టానికి 79 స్కోరు వద్ద ఉంది. గెలుపు దూరమవుతున్నట్టని పించింది. తర్వాత రజత్ భాటియా, దీపక్ చాహర్ స్వల్ప స్కోరులకే అవుటయ్యారు. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టు నిర్దారిత 20 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది.